ఆక్వారంగం చిరకాల వాంఛను నెరవేరుస్తున్న జగన్ ప్రభుత్వం

By Raju VS Jul. 22, 2021, 10:50 am IST
ఆక్వారంగం చిరకాల వాంఛను నెరవేరుస్తున్న జగన్ ప్రభుత్వం

ఆక్వారంగంలో ఇప్పుడు దేశంలోనే ఆంద్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. రొయ్యలు, చేపలతో పాటుగా వివిధ మత్స్యసంపద ఎగుమతులకు కేంద్రంగా మారుతోంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తోంది. ఇప్పటికే జగన్ ఎన్నికల హామీలో భాగంగా ఆక్వారైతులకు విద్యుత్ సబ్సిడీ అమలు చేస్తున్నారు. దాంతో సాధారణ ఆక్వా సాగుదారులందరికీ పెద్ద ఊరట దక్కింది. అందుకు తోడుగా ఫిషింగ్ హార్బర్లు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలోని 9 కోస్తా జిల్లాల పొడవునా మత్స్యకారులకు అందుబాటులో ఉండేలా హార్బర్ల నిర్మాణానికి పూనుకుంటున్నారు. అవి కూడా అందుబాటులోకి వస్తే మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది.

తాజాగా నర్సాపురం వద్ద ఫిషరీస్ యూనివర్సిటికీ సన్నాహాలు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఫిషరీస్ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఏకంగా ఇప్పుడు యూనివర్సిటీకి ప్రభుత్వం పూనుకుంటోంది. గతంలో అనేక ప్రభుత్వాల్లో కేవలం హామీగా మిగిలిన ఈ యూనివర్సిటీని జగన్ ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొస్తోంది. 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించేందుకు సిద్ధమవుతోంది. దానికి తోడుగా పలాస, కైకలూరు కేంద్రంగా రెండు కళాశాలలు కూడా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఈ యూనివర్సిటీ నిర్మాణానికి వచ్చే సెప్టెంబర్ లో సీఎంతో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సాపురం మండలంలోని సరిపల్లె- లిఖితపూడి మధ్యలో భూమిని సిద్ధం చేశారు. రూ. 332 కోట్ల వ్యయంతో నిర్మాణం జరగబోతోంది. ఆక్వారంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ అవసరమైన సాంకేతిక సలహాలు, ఇతర నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ఇక యూనివర్సిటీ సిద్ధమయితే నూతన కోర్సులకు, పలు పరిశోధనలకు అవకాశం దక్కుతుంది. త్వరలోనే నిర్మాణానికి టెండర్లు ఖరారు చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచే అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నారు. అదే సమయంలో నిపుణుల కొరత తీరిపోతుందని స్థానిక ఆక్వా రైతులు ఆశిస్తున్నారు.

Also Read : జ‌గ‌న్ స్ట్రాట‌జీకి చుక్కలు కనిపిస్తున్నాయా..!

ప్రస్తుతం కేరళ, తమిళనాడులో మాత్రమే ఫిషరీస్ యూనివర్సిటీలు అందుబాటులో ఉన్నాయి. ఏపీలో మూడో యూనివర్సిటీకి ముహూర్తం సిద్ధం అవుతుండడంతో స్థానిక ఆక్వా సాగుదారులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు. నర్సాపురంలో ఏర్పాటు చేయడం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్థానంలో ఇది కీలకమైన అభివృద్ధి కార్యక్రమంగా మారుతుందని కూడా చెబుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp