నిమ్మగడ్డ చెబుతున్నారు.. ఎన్నికలు చారిత్రాత్మకమట..!!

By Karthik P Jan. 24, 2021, 02:25 pm IST
నిమ్మగడ్డ చెబుతున్నారు.. ఎన్నికలు చారిత్రాత్మకమట..!!

సాధారణంగా ఎన్నికలకు రాజకీయ పార్టీల నేతలు పలు రకాలుగా అభివర్ణిస్తుంటారు. ఈ ఎన్నికలు రెఫరెండం అనో, అధికార పార్టీకి చమరగీతం పాడేవనో, ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించేవనో, ఎన్నికలు చారిత్రను తిరగరాసేవనో, చారిత్రాత్మకమైనవనో.. ఇలాంటి ప్రకటనలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు చేస్తుంటాయి. అధికార పార్టీల నేతలు అయితే ఎన్నికలకు ముందు వాటి గురించి వర్ణణలు పెద్దగా చేయరు. ఫలితాల తర్వాత.. అవి తమకు అనుకూలంగా వస్తే.. రకరకాలుగా అభివర్ణిస్తుంటారు. అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం, ఎన్నికలు నిర్వహించే రాజ్యగంబద్ధ సంస్థలైన కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలాంటి వ్యాఖ్యలు, ప్రకటనలు, అభివర్ణణలు చేయదు.

అయితే గతానికి భిన్నంగా, బహుసా చరిత్రలో తొలిసారి ఎన్నికలను చరిత్రాత్మకం అంటూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ అభివర్ణించారు. పంచాయతీ ఎన్నికలకు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరుగుతున్నాయట. ఈ ఎన్నికలు చారిత్రాత్మకమైనవంటూ నిమ్మగడ్డ నిన్న శనివారం పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేసిన సమయంలో అభివర్ణించారు. ఎన్నికలు నిర్వహించాల్సిన కమిషనర్‌.. తన పరిధి దాటి ఓ రాజకీయ నాయకుడిలా, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నేత మాదిరిగా.. ఈ ఎన్నికలు చరిత్రాత్మకమైనవంటూ పేర్కొనడం నిమ్మగడ్డ వ్యవహార శైలిని మరోమారు తెలియజేస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకుడుగా, చంద్రబాబు ఆత్మగా వ్యవహరిస్తున్నారంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు.. ఆయన వ్యవహార శైలి ద్వారా వాస్తవమేననేలా ఉన్నాయి.

ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయంటున్న నిమ్మగడ్డ.. ఆ ప్రత్యేకమైన పరిస్థితులు ఏవో మాత్రం చెప్పలేదు. 2018 ఆగస్టులో ముగిసిన పంచాయతీ పాలక మండళ్లకు ఎన్నికలకు నిర్వహించకుండా.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న ఎన్నికలను అర్థంతరంగా వాయిదా వేసి.. రాజకీయ పార్టీ అజెండాను నెత్తినెత్తుకుని మోస్తున్న నిమ్మగడ్డకు ఇవి ప్రత్యేకమైన ఎన్నికల మాదిరిగానే కనిపించవచ్చు. ప్రజా ఆరోగ్యంతో సంబంధం లేకుండా, ప్రభుత్వం, అధికారుల వినతులను బట్టుదాఖలు చేస్తూ.. ఎన్నికల నిర్వహణే తన లక్ష్యమంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ హోదాలో వివాదాలకు ఆజ్యం పోస్తున్న సదరు అధికారికి ఇవి ప్రత్యేకమైనవే కావచ్చు. కానీ రాజకీయ పార్టీలకు, ప్రజలకు మాత్రం ఇవి సాధారణ ఎన్నికలే. పంచాయతీ ఎన్నికలేమీ తొలిసారిగా జరగడం లేదు. స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించిన తర్వాత ఇప్పటికే నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. ఇది ఐదోసారన్న విషయం నిమ్మగడ్డ గుర్తించాలి. తన ఐదేళ్ల పదవి కాల సమయంలో ప్రారంభంలోనే ఎన్నికలకు నిర్వహించే అవకాశం వచ్చినా.. పట్టించుకోని నిమ్మగడ్డ.. మరో రెండు నెలల్లో దిగిపోనున్న తరుణంలో నిర్వహించాలనుకుంటున్నారు కాబట్టి .. ఇవి తనకు ప్రత్యేకమైనవి, చారిత్రాత్మకమైనవని ఆయన భావిస్తున్నారనుకోవాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp