టీటీడీ బోర్డు సభ్యులు వీరేనా..? అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం

By Karthik P Sep. 15, 2021, 09:30 pm IST
టీటీడీ బోర్డు సభ్యులు వీరేనా..? అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం

నామినేటెడ్‌ పదవుల భర్తీలో అన్ని ప్రాంతాలకు, సామాజికవర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ వస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సభ్యుల నియామకంలోనూ అదే ఒరవడిని కొనసాగించినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి పాలక మండలిని ఏర్పాటు చేశారు. మొదటి పాలక మండలిలో చైర్మన్‌గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డినే రెండోసారి కొనసాగిస్తూ గత నెలలో నిర్ణయం తీసుకున్న వైఎస్‌ జగన్‌.. తాజాగా 25 మంది సభ్యులను నియమించారు. గత పాలక మండలిలో మొత్తం 40 మంది ఉండగా.. ఈ సారి ఆ సంఖ్యను 25కు పరిమితం చేశారు. ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల వారికి బోర్డులో చోటు కల్పించారు. రాజకీయ నేతలతోపాటు వివిధ రంగాల వారిని సభ్యులుగా నియమించారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

మొదటి పాలక మండలిలోనూ సభ్యురాలుగా పని చేసిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఈ సారి కూడా అవకాశం కల్పించారు. వైసీపీ ముఖ్యనేత, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పార్టీ ఇంచార్జి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి సతీమణే ప్రశాంతి రెడ్డి. వైసీపీలో ముఖ్య భూమిక పోషిస్తున్న వేమిరెడ్డి సతీమణికి జగన్‌ ఈ సారి కూడా అవకాశం కల్పించారు. ప్రముఖ స్థిరాస్తి వ్యాపారవేత్త మైంహోం రామేశ్వరరావు, ఇండియన్‌ సిమెంట్స్‌ శ్రీనివాసన్, హెటిరో పార్థసారధిరెడ్డిలకు బోర్డులో చోటు దక్కింది. యానం మాజీ ఎమ్మెల్యే, పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావుకు మొదటిసారి టీడీపీ సభ్యుడుగా పని చేసే అవకాశం లభించింది.

ఉత్తరాంధ్ర నుంచి పాయకరావుపేట ఎమ్మెల్యే గొర్ల బాబూరావుకు స్థానం కల్పించారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన బాబూరావు వైసీపీ ప్రారంభం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. వైఎస్‌ జగన్‌ వెంట ఆది నుంచి నడుస్తున్నారు. 2014 ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు అమలాపురం లోక్‌సభ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బాబూరావు.. 2019లో తిరిగి పాయకరావుపేట నుంచి పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. 

Also Read : బాబు మర్చిపోయారు.. జగన్ చేసి చూపించారు!

ఉభయగోదావరి జిల్లాల నుంచి రాజోలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణం రాజు సతీమణి మళ్లీశ్వరికి స్థానం దక్కింది. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పని చేసిన కృష్ణం రాజు 2009లో రాజోలు ఎస్సీ రిజర్డ్వ్‌ అయిన తర్వాత పోటీ చేసే అవకాశం కోల్పోయారు. అయితే కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్య భూమిక పోషించారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ కో ఆర్డినేటర్‌గా పని చేశారు. ఆది నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కృష్ణం రాజుకు వైఎస్‌ జగన్‌ ఈ విధంగా సముచిత స్థానం కల్పించారు.

కోస్తా జిల్లాల నుంచి ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌కు అవకాశం దక్కింది. యాదవ సామాజికవర్గానికి చెందిన బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ 2014లో కనిగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పట్టుదలతో ఐదేళ్లు ప్రజల్లో తిరిగిన బుర్రా.. 2019లో కనిగిరి చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 40 వేల పై చిలుకు మెజారిటీతో గెలుపొందారు. రాయలసీమ నుంచి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డికి స్థానం దక్కింది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాటసాని.. పాణ్యంలో తిరుగులేని నేతగా ఎదిగారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆయన.. 2019లో వైసీపీ టిక్కెట్‌ దక్కించుకుని 43 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గౌరు చరితపై భారీ విజయం సాధించారు.

తెలంగాణ నుంచి మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు, హెటిరో పార్థసారధిరెడ్డిలతోపాటు మన్నే జీవన్‌ రెడ్డి. కల్వకుర్తి విధ్యాసాగర్, రెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి, మారంశెట్టి రాములు సభ్యులుగా ఎంపికయ్యారు. తమిళనాడు నుంచి ఇండియన్‌ సిమెంట్స్‌ శ్రీనివాసన్‌తోపాటు ఎమ్మెల్యే నందకుమార్, కన్నయ్యలు, కర్ణాటక నుంచి శశిధర్, ఎమ్మెల్యే విశ్వనాథరెడ్డి, మహారాష్ట్ర నుంచి శివసేన కార్యదర్శి మిలింద్‌కు అవకాశం దక్కింది.

వీరితోపాటు పోలక అశోక్, మారుతి, సౌరభ్, రాజేష్‌ శర్మ, ఆడిటర్‌ శనత్, డాక్టర్‌ కేతన్‌ దేశాయ్, లక్ష్మీ నారాయణ, శంకర్లు టీటీడీ బోర్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరి పేర్లను అధికారికంగా ప్రకటించడమే తరువాయి. అయితే ఈ జాబితాలో చేర్పులు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read : ఏపీ సీఎంతో సుబ్రహ్మణ్య స్వామి సమావేశం, ఆసక్తికరంగా మారిన భేటీ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp