వ్యాక్సినేషన్ లో ఏపీ ప్రభుత్వ మెగా డ్రైవ్ మరో ముందడుగు

By Kalyan.S Jun. 20, 2021, 07:30 am IST
వ్యాక్సినేషన్ లో ఏపీ ప్రభుత్వ మెగా డ్రైవ్  మరో ముందడుగు

దేశంలో కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా డెల్టా వేరియంట్ దాడి చేసే ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని తెలుస్తోంది. ఇప్పటికే యూకే, యూఎస్ లో డెల్టా వేరియంట్ ప్రభావం మొదలుకావడం, మన దేశంలో కూడా ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఆంక్షల సడలింపు చేసుకోవచ్చని కేంద్రం సిగ్నల్ ఇచ్చేసింది. తెలంగాణా వంటి రాష్ట్రాల్లో ఒకేసారి మొత్తం సాధారణ స్థితికి అనుమతినిచ్చేశారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ముఖ్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది.

ఓవైపు కరోనా ఆంక్షల సడలింపు విషయంలో సాయంత్రం వరకూ అవకాశం ఇచ్చింది. సాయంత్రం 6గంల తర్వాత కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రకటించారు. అదే సమయంలో వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్ కి శ్రీకారం చుట్టారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉన్న తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో లక్ష డోసులు చొప్పున ఒకే రోజు వేసేందుకు సిద్ధమయ్యారు. మిగిలిన జిల్లాల్లో అర లక్ష మందికి కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సంకల్పించారు. దానికి అనుగుణంగా ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వ్యాక్సిన్లు వేసేందుకు వాటిని చేర్చారు. ఆదివారం ఉదయం నుంచే పంపిణీ మొదలయ్యింది. ప్రతీ జిల్లాలోనూ 500 వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేసి పంపిణీ ప్రారంభించారు.

వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం ద్వారానే కోవిడ్ ని నియంత్రించవచ్చని ప్రపంచ అనుభవం. కీలకమైన వ్యాక్సిన్ విషయంలో దేశ వ్యాప్తంగా ఇప్పటికీ నత్తనడక కొనసాగుతోంది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం చొరవ తీసుకుని ముందడుగు వేసే ప్రయత్నం చేస్తోంది. వీలయినంత త్వరగా 45 ఏళ్ల పైబడిన వారికి పూర్తి చేయాలని భావిస్తోంది. వారితో పాటుగా విదేశీ విద్య కోసం వెళ్లాలనుకునే వారికి కూడా వ్యాక్సిన్ అందిస్తోంది. మరోవైపు 5 ఏళ్ల లోపు వయసు పిల్లల తల్లులకు ఇప్పటికే 28 శాతం మందికి వ్యాక్సిన్లు అందించారు. మిగిలిన తల్లులందరికీ వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తిచేసేందుకు ఈ డ్రైవ్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఒకే రోజు ఆరు లక్షల మందికి వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. తాజాగా ఆదివారం ఒక్క రోజులోనే పది లక్షల మందికి వ్యాక్సిన్ వేయబోతున్నారు. ఈ మెగా డ్రైవ్ లో 80వేల డోసులు కోవ్యాక్సిన్ కాగా, మిగిలిన అందరికీ కోవీషీల్డ్ వేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమంగా వ్యాక్సిన్ కి ప్రాధాన్యతనివ్వడం ప్రయోజనకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp