పారిశ్రామికవాడల్లో హెల్త్ సిటీలు

By Ramana.Damara Singh May. 16, 2021, 03:07 pm IST
పారిశ్రామికవాడల్లో హెల్త్ సిటీలు

కరోనా కల్లోలంతో దేశమంతా అల్లాడి పోతోంది. ఉన్న ఆస్పత్రులకు అదనంగా ఎన్ని ఏర్పాటు చేసినా సరిపోవడం లేదు. సరిపడినన్ని బెడ్లు లేక, మెడికల్ ఆక్సిజన్ తగినంత సరఫరా కాక.. రోగులు సకాలంలో చికిత్సకు నోచుకోలేకపోతున్నారు. యుద్ధప్రాతిపదికన ప్రభుత్వాలు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నా సరిపోని దుస్థితి నెలకొంది. సెకండ్ వేవ్ లోనే ఈ పరిస్థితి ఉంటే.. ఇంకా మూడో దశ ఉందని.. అది ఇంతకంటే తీవ్రంగా ఉంటుందన్న వైద్య నిపుణుల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది. కరోనా సంక్షోభం ఇంకా చాన్నాళ్ల కొనసాగే అవకాశం ఉన్నందున భవిష్యత్తు వైద్య అవసరాలపై దృష్టి సారించింది. ఒకపక్క ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పలు వినూత్న చర్యలు చేపడుతున్న ప్రభుత్వం.. మరోపక్క భవిష్యత్తు అవసరాలను ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణతో ముందుకెళుతోంది. అందులో భాగంగా పారిశ్రామికవాడల్లో కాన్సెప్ట్ హెల్త్ సిటీల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది.

రాష్ట్రంలో 7 చోట్ల..

రాష్ట్రంలో ఏడు కాన్సెప్ట్ హెల్త్ సిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) అధ్యర్యంలో వీటి ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలోని పారిశ్రామికవాడలు, కారిడార్లకు సమీపంలో హెల్త్ సిటీలు ఏర్పాటు చేస్తారు. ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మొత్తం ఏడు హెల్త్ సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వీటికోసం పారిశ్రామికవాడలకు సమీపంలోనే అవసరమైన భూమి సేకరిస్తారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ ఒక సర్కులర్ కూడా జారీ చేసింది.

ఏమేం ఉంటాయి..

ప్రతి కాన్సెప్ట్ హెల్త్ సిటీలో ఒక కార్పొరేట్ ఆస్పత్రి, ఒక స్పెషాలిటీ నర్సింగ్ హోమ్, నర్సుల శిక్షణ కేంద్రం, మెడికల్ వ్యర్ధాల నిర్వహణ కేంద్రం (బయో హజార్డ్ ట్రీట్మెంట్ ప్లాంట్), సర్వీస్ అపార్టుమెంట్లు, కమ్యూనిటీ కేంద్రంతో పాటు.. అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తారు. ఆస్పత్రిలో ఎన్ని బెడ్లు ఉంటాయన్నది ఇంకా నిర్ణయించలేదు. పారిశ్రామికవాడల్లో పనిచేసే వేలాది
ఉద్యోగులు, కార్మికులకు చెంతనే వైద్య సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో కాన్సెప్ట్ హెల్త్ సిటీ ఆలోచన రూపుదిద్దుకుంది. భవిష్యత్తులో మెడికల్ ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా పారిశ్రామికవాడల్లోని యూనిట్లలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి, సిలెండర్ల రీఫిల్లింగ్ కు అనుమతులు ఇవ్వాలని పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకుంది. వీటికి ముందుకొచ్చే పరిశ్రమలకు అదనంగా ఎటువంటి ఫీజులు వసూలు చేయరు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp