గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ..! మళ్లీ ముదురుతున్న ‘స్థానిక’ వివాదం

By Karthik P Nov. 18, 2020, 02:10 pm IST
గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ..! మళ్లీ ముదురుతున్న ‘స్థానిక’ వివాదం

స్థానిక ఎన్నికల కేంద్రంగా ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మొదలైన వివాదం మారోమారు రాజుకుటోంది. రాజకీయ వివాదంగా మారిన ఈ వ్యవహారంలో ఈ సారి ఏ విధంగా సాగుతూ, ఎన్ని మలుపులు తిరుగుతుందోనన్న చర్చ రాష్ట్రంలో ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌తో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ భేటీ కావడం ఈ చర్చకు బలం చేకూరుస్తోంది.

ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని, అందుకు ప్రభుత్వం, అధికారులు సిద్ధంగా ఉండాలని మంగళవారం నిమ్మగడ్డ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ కూడా రాశారు. అయితే కరోనా వైరస్‌ నేపథ్యంతో ఇప్పట్లో ఎన్నికలు సాధ్యం కావని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ రోజు సమాధానం ఇచ్చారు. ఈ మేరకు పూర్వా పరాలతో లేఖ రాశారు. ఈ రోజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు కూడా సాధ్యం కాదంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నిమ్మగడ్డ గవర్నర్‌తో భేటీ అయినట్లు తెలుస్తోంది.

దాదాపు 40 నిమిషాల పాటు గవర్నర్‌తో సమావేశమైన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. గవర్నర్‌తో ఏమి మాట్లాడారనేది తెలియాల్సి ఉంది. గవర్నర్‌తో భేటీ తర్వాత నిమ్మగడ్డ మౌనం ఆశ్రయించారు. అక్కడ నుంచి నేరుగా తన కార్యాలయానికి వెళ్లిపోయారు.

కరోనా వైరస్‌ తగ్గిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం.. తాను పదవిలో నుంచి దిగిపోయే లోపు ఎన్నికలు జరపాలన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అంతరం ఏర్పడుతోంది. ఈ అంతరానికి ఎన్నికల కమిషనరే కారణమనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండానే.. ఫిబ్రవరిలో నిర్వహిస్తానంటూ నిన్న మంగళవారం నిమ్మగడ్డ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ, ఏర్పాట్లు చేసుకోవాలని ప్రోసీడింగ్స్‌ కూడా జారీ చేయడంతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఒంటెద్దు పోకడలతో వెళుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.


idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp