శ‌భాష్‌.. ఏపీ పోలీస్‌..!

By Kalyan.S Oct. 30, 2020, 07:45 am IST
శ‌భాష్‌.. ఏపీ పోలీస్‌..!

ఆంధ్ర‌ప్రదేశ్ పోలీస్ వ్య‌వ‌స్థ ఆధునిక‌త‌ను సంత‌రించుకుంటోంది. ప్ర‌భుత్వ ప్రోత్సాహంతో సాంకేతిక ప‌రిజ్ఞానం పెంపొందించుకుంటోంది. ఎన్న‌డూ లేని రీతిలో ఏడాదిన్న‌ర కాలంగా టెక్నాల‌జీ వినియోగంలో ముందు వ‌రుస‌లో నిలుస్తోంది. జాతీయ స్థాయిలో నెంబ‌ర్ వ‌న్ పోలీసింగ్ వ్య‌వ‌స్థ‌గా గుర్తింపు పొందుతోంది. అందుకు వ‌రుస‌గా వ‌స్తున్న అవార్డులే నిద‌ర్శ‌నం. జాతీయ స్థాయిలో పోలీస్ శాఖలో టెక్నాలజీ వినియోగాలపై స్కొచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో భాగంగా జాతీయ అవార్డులను ప్రకటించింది. మొత్తం 84 అవార్డులను ప్రకటించిగా రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ 48 అవార్డులను దక్కించికుంది. కేరళ-9, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్-4, తెలంగాణ-1, తమిళనాడు-1 అవార్డులను దక్కించుకున్నాయి. ఇక ఏపీ పోలీసు శాఖ వరుసగా రెండవ సారి టెక్నాలజీ వినియోగంలో జాతీయ స్థాయిలో అవార్డులను కైవసం చేసుకుంది. ఈ సంవత్సరం ఇప్పటికే 37 అవార్డులు సాధించిన ఏపీ పోలీస్ శాఖ తాజాగా వివిధ విభాగాల్లో 48 అవార్డులు కైవసం చేసుకోని మొత్తం 85 అవార్డుతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

ఏడాదిలో 103 అవార్డులు

ఇటీవ‌ల కాలంలో ఏపీ పోలీస్ వ్య‌వ‌స్థ మెరుగైన ప‌నితీరును క‌న‌బ‌రుస్తోంది. కేసుల చేధ‌న‌, ద‌ర్యాప్తులో సాంకేతిక వ్య‌వ‌స్థ‌ను ఉప‌యోగిస్తూ ఫ‌లితాలు సాధిస్తోంది. ఈ మేర‌కు ఎన్నో అవార్డులు పొందుతోంది. ఏడాదిలో మొత్తం 103 అవార్డులను దక్కించుకొని దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అగ్రస్థానంలో నిలిచింది. దిశ అప్లికేషన్, పోలీస్ సేవా అప్లికేషన్, డిజిటల్ హెల్త్ అప్లికేషన్‌ల‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు ల‌భించింది.

చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏపీ పోలీస్ ఒకేసారి 48 జాతీయ అవార్డులు పొందటం గర్వించదగ్గ విషయ‌య‌ని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. సీఎం వైఎస్ జ‌గ‌న్ ఇచ్చిన స‌హ‌కారం, ప్రోత్సాహంతోనే ఈ అరుదైన గౌర‌వాన్ని సొంతం చేసుకోగ‌లిగామ‌ని తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో పోలీస్ సేవలను ప్రజలకు మ‌రింత చేరువయ్యేలా చేశామ‌న్నారు. 'మహిళా భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దిశా యాప్‌కి బంగారు పతకం వచ్చింది. పోలీస్ సేవలను ప్రజలకు అందించేందుకు విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పోలీస్ సేవా యాప్ ద్వారా ఇంటినుంచే కావాల్సిన సమాచారం తెలుసుకొనే అవకాశం కల్పించాం. యాప్ ద్వారా 29 రోజుల్లోనే 32000 ఎఫ్ఐఆర్‌లు డౌన్ లోడ్ చేశారు. దాంతో పోలీస్ సేవా యాప్‌కి కూడా బంగారు పతకం వచ్చింది' అని గౌత‌మ్ స‌వాంగ్ పేర్కొన్నారు.

అవినీతిని రూపుమాప‌డం జ‌గ‌న్ ల‌క్ష్యం

సామాన్యులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ సేవలు అందాలన్నది ప్రభుత్వ ఆదేశమ‌ని, టెక్నాలజీ వినియోగంతో అవినీతిని రూపుమాపాలన్నది సీఎం జ‌గ‌న్ లక్ష్యమ‌ని తెలిపారు పారదర్శకత ,జవాబుదారీతనంతో ఏపీ పోలీస్ ముందుకు సాగుతోందని భ‌విష్య‌త్తులో టెక్నాలజిని పూర్తి స్థాయిలో వినియోగించి ఇంకా మార్పులు తెస్తామ‌న్నారు. ఆన్‌లైన్ గేమింగ్ ,గ్యాంబ్లింగ్ ,బెట్టింగ్‌ల‌పై ప్రత్యేక దృష్టి సారించామ‌ని గంజాయి, డ్ర‌గ్స్‌పై స్పెష‌ల్ డ్రైవ్‌లు పెట్టి వాటిపై కూడా ఉక్కుపాదం మోపుతామ‌ని డీజీపీ వెల్ల‌డించారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేసే వారిపై నిఘా పెట్టామని, టెక్నాలజీ వాడి తప్పించుకోవాలని చూసినా ట్రాక్ చేస్తామని హెచ్చ‌రించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp