AP opposition parties, Allience - ఏపీ పాలిటిక్స్ : విప‌క్షాల‌ పొత్తులు - లెక్క‌లు

By Kalyan.S Dec. 07, 2021, 11:00 am IST
AP opposition parties,  Allience - ఏపీ పాలిటిక్స్ : విప‌క్షాల‌ పొత్తులు - లెక్క‌లు

ఏపీ ఎన్నిక‌ల‌కు ఇంకా రెండున్న‌రేళ్ల స‌మ‌యం ఉంది. జ‌రిగిన రెండున్న‌రేళ్ల కాలాన్ని ప‌రిశీలిస్తే.. 151 సీట్ల‌ను సాధించి బంప‌ర్ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే అంత‌కుమించే సీట్ల‌ను కైవ‌సం చేసుకుంటుంద‌ని ఆ పార్టీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల వెల్ల‌డైన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలను ప‌రిశీలిస్తే ఆ మాత్రం ధీమా స‌హ‌జ‌మే అనిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 23 సీట్ల‌ను సాధించిన తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి ప్ర‌స్తుతం మ‌రింత దిగ‌జారింది. ఇది గుర్తెరిగిన అధినేత చంద్ర‌బాబు నాయుడు వ్యూహాన్ని మార్చారు. ఎంత గ‌ట్టిగా వాదించినా, ఎంత‌లా ప్ర‌చారం చేసినా ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేద‌ని భావించి చివ‌ర‌కు ఏడిచైనా సాధించాల‌ని ప‌థ‌కం ర‌చించారు.

ఆ పాచిక కూడా అంత‌లా పారిన‌ట్లు క‌నిపించలేదు. ప‌దే ప‌దే బాబే ఆ విష‌యాన్ని చెప్పుకోవ‌డంతో సింప‌తీ పోయి రాజ‌కీయ నాట‌కాల్లో ఒకటిగా భావిస్తున్న‌వారు పెరుగుతున్నారు. ఈ క్ర‌మంలో ఏం చేసినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రి త‌ప్పు అంత‌గా క‌లిసిరాద‌నే విష‌యం టీడీపీ పెద్ద‌ల‌కు అవ‌గ‌త‌మ‌తైంది. దీంతో ఒంటరిగా వెళ్లి చేయి కాల్చుకోకూడదని ఆలోచిస్తున్నారు. ఎప్ప‌టి నుంచో పొత్తుల వార్తలు వ‌స్తున్నా, ఈసారి కాస్త ముందుకు.. అంటే లెక్క‌ల‌పై కూడా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన ఒక కూటమిగా ఏర్పడి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాయి. అనంత‌రం మారిన బాబు ధోర‌ణి, న‌రేంద్ర మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌ను బీజేపీ మ‌ర‌చిలేక‌పోతోంది. అందువ‌ల్ల చంద్ర‌బాబు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా బీజేపీ ఆయ‌న‌ను ద‌గ్గ‌ర‌కు రానీయ‌డం లేదు.

ఇక మిగిలింది జ‌నసేన పార్టీ. అయితే 2024 నాటికి జనసేనతో టీడీపీ పొత్తు అంటే చాలా లెక్కలు చూడాల్సి ఉంది. అన్నింటికీ మించి జనసేన ఈ మధ్యకాలంలో తన సొంత అస్థిత్వాన్ని చాటుకుంటూ ముందుకు సాగుతోంది. దాంతో ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అన్నది కూడా వాటా తేల్చాలి. జనసేన కేడ‌ర్ లో అయితే పవనే మా సీఎం అన్న భావన ఉంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా 2019 ఎన్నికల వేళ చూస్తే తాను సీఎం అయితే ఫలానా పని చేస్తాను అంటూ చాలానే చెప్పారు. ఇక ఈ మధ్య కూడా ఆయన అనంతపురం పర్యటనలో మాట్లాడుతూ జనసేన అధికారంలోకి వస్తే కర్నూల్ లో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. అంటే పవన్ మదిలో సీఎం సీటు మీద ఆలోచన ఆశ ఉందని అర్థం అవుతోంది.

Also Read : Central Government - పోలవరం నిధులపై కనికరించని కేంద్రం, కొర్రీలు తొలగేదెన్నడు?

అలాంటి ఆలోచ‌న ఉన్న త‌రుణంలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే.. ఒక‌వేళ మెజార్టీ సీట్లు సాధిస్తే ప‌వ‌న్ ఆశ తీరుతుందా అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. దీని మీద సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జనసేన టీడీపీల మధ్య పొత్తు కుదరాలని దిగువ స్థాయిలో రెండు పార్టీల క్యాడర్ కోరుకుంటున్నాయని చెప్పారు. ఇక తేల్చాల్సింది రాష్ట్ర స్థాయిలోనే అని కూడా చెప్పేశారు. పొత్తు కుదిరితే రెండు పార్టీలకే కాదు ఏపీకి కూడా ఎంతో మేలు చేకూరుతుందని ఆయన అంటున్నారు. సీట్ల స‌ర్దుబాటు పెద్ద సమస్య కాబోదని ఈజీగా చెప్పేశారు. కానీ అది అంత ఈజీ కాద‌ని లెక్క‌లు చెబుతున్నాయి. ఏపీలో 175 సీట్లు ఉన్నాయని రెండు పార్టీలకు 2019 ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయి అన్న దాని మీదనే సీట్ల వాటా తేలుతుందని అయ్య‌న్న అభిప్రాయం.

ఆ ఎన్నికల్లో జనసేనకు 6.5 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీకి దాదాపుగా నలభై శాతం ఓట్లు వచ్చాయి. ఈ ప్రాతిపదికనే సీట్ల ఒప్పందం జరగాలని పేర్కొన్నారు. ఆ లెక్క‌న జనసేనకు గట్టిగా పదిహేను సీట్ల కంటే ఎక్కువగా వచ్చే చాన్సే లేదు. బీజేపీతో చేయి కలిపిన పవన్ ఈ పదిహేను సీట్ల కోసం టీడీపీతో జ‌త క‌డ‌తారా అనేది ప్రశ్న. ఇక జనసేనకు ఎక్కువగా గోదావరి జిల్లాలోనే బలం ఉందని అది కూడా కొన్ని ప్రాంతాలలోనే అని తమ్ముళ్ళు చెబుతున్నారు. ఆ విధంగా చూస్తే ఇచ్చిన పదిహేను సీట్లలో కూడా మెజారిటీ అక్కడే ఇచ్చేసి జనసేనను బుజ్జగిస్తారా అన్న సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి. అయితే జనసేన మాత్రం కచ్చితంగా యాభై దాకా సీట్లు కోరే చాన్స్ ఉందని అంటున్నారు. అంతే కాదు సీఎం సీటు ఇవ్వకపోయినా డిప్యూటీ సీఎం అయినా కోరే చాన్స్ ఉందని చెబుతున్నారు.

ఇక రెండున్న‌రేళ్ల‌లో టీడీపీ కంటే జ‌న‌సేన పుంజుకుంద‌ని ఆ పార్టీ నాయ‌కులు పేర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో మెజార్టీ సీట్ల‌ను డిమాండ్ చేసేందుకు ఇప్ప‌టి నుంచే వాయిస్ పెంచుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. నిజంగా టీడీపీ, జ‌న‌సేన క‌లిస్తే.. మ‌రి బీజేపీ సంగ‌తేంటి? ఆ పార్టీ కూడా ఒంటిరిగా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పోటీ చేయ‌దు. జ‌న‌సేన ‌పైనే ఆశ‌లు పెట్టుకుంది. ఈ నేప‌థ్యంలో చివ‌ర‌కు 2014 సీన్ రిపీట్ అయితే.. టీడీపీ ఎవ‌రికెన్ని సీట్లు ఇస్తుంద‌నేది మ‌రో ప్ర‌శ్న. రెండు పార్టీల‌కు పాతిక మించకుండా సీట్లు కేటాయించి మిగిలిన 150 సీట్లలో పోటీ చేసి కూటమి బలంతో అధికారంలోకి రావాలని టీడీపీ యోచిస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. 2014లో జ‌న‌సేన పోటీ చేయ‌లేదు కాబ‌ట్టి పెద్ద‌గా పంచాయ‌తీ లేకుండానే సీట్ల స‌ర్దుబాటు జ‌రిగిపోయింది. కానీ ఈసారి పొత్తు పొడిస్తే.. మాత్రం లెక్క‌ల్లో చాలానే తేడా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. మ‌రి ఏం జ‌ర‌గ‌నుందో వేచి చూడాలి.

AlsoRead : Tdp, Yellow Media, Employees Unions - టీడీపీ, పచ్చ మీడియా కలిసి ఉద్యోగ సంఘాలను వాడుకోవాలని చూస్తున్నాయా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp