ఏపీ : ముందుంది మ‌రింత మంచి కాలం..

By Kalyan.S Oct. 30, 2020, 08:15 am IST
ఏపీ : ముందుంది మ‌రింత మంచి కాలం..

సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అకుంఠిత‌ దీక్ష‌, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల‌న్న‌ప‌ట్టుద‌ల ఏపీని దేశంలోనే అత్యున్న‌త స్థాయిలో నిలిచేలా చేస్తున్నాయి. యువ‌త‌కు మెరుగైన ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌, మెరుగైన ర‌హ‌దారుల నిర్మాణం, ఐటీ ఆధారిత కంపెనీల ఏర్పాటుకు సంబంధించిన భారీ ప్రాజెక్టులు ఏపీలో కార్య‌రూపం దాల్చ‌నున్నాయి. జ‌గ‌న్ విన‌తులు, లేఖ‌ల‌కు స్పందిస్తూ కేంద్రం అందిస్తున్న స‌హ‌కారంతో కీల‌క ప్రాజెక్టుల‌కు ఆమోద ముద్ర‌లు ప‌డుతున్నాయి. రాష్ట్రంలో 30 నైపుణ్య కళాశాలల ఏర్పాటు ద్వారా యువత ఉపాధికి భ‌రోసా క‌ల‌గ‌నుంది. ఐటీడీసీ, ఎన్టీపీసీ, ఎస్ఏఐఎల్, బీహెచ్ఈఎల్, కాంకొర్ సంస్థలు సీవోఈ ఏర్పాటుకి సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో ఐదు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లతో పాటు, యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు, ఆర్థిక తోడ్పాటునందించేందుకు కేంద్ర సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలోని 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం ముందుకు వ‌చ్చింది. పెట్రో కెమికల్ కాంప్లెక్స్ లో భాగంగా రాష్ట్రానికి రెండు పెట్రో కెమికల్ ప్రాజెక్టులు రానున్నట్లు కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ప్రకటించారు. సీవోఈతో పాటు ఏపీలో సోలార్ మానుఫాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటుకు బీహెచ్ఈఎల్ ఆసక్తి చూపుతోంది. 

అందుబాటులోకి వ‌స్తే తిరుగులేదంతే..!

డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలో స్కిల్ సెంటర్ల నిర్మాణం పనులు మొదలు పెట్టడంతో పాటు.. 18 నెలల్లోనే పనులు పూర్తి చేసే విధంగా ప్ర‌భుత్వం లక్ష్యం నిర్దేశించింది. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఔషధ పరిశ్రమలు ఉండడంతో బల్క్ డ్రగ్ పార్కు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. పరిపాలన రాజధాని విశాఖను రానున్న రోజుల్లో ఐ.టీ హబ్ గా అభివృద్ధి చేయడంతో పాటు.. ‘‘వరల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్ హబ్’’ గా తీర్చిదిద్దేందుకు ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తోంది. ఊహించని స్థాయిలో విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే భావనపాడు, రామాయపట్నం పోర్టుల డీపీఆర్ సిద్ధం కాగా.. డిసెంబర్ 15 కల్లా పనులు ప్రారంభం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. అలాగే ఏపీని స్టార్టప్ కల్చర్ మరింత అనుకూల వాతావరణంగా మార్చేందుకు ఐటీ నిపుణుల‌తో ప్ర‌భుత్వం సంప్ర‌దింపులు జ‌రుపుతోంది.

రూ.8,869 కోట్లతో 28 ప్రాజెక్టులు

అలాగే జాతీయ ర‌హ‌దారుల నిర్మాణానికి సంబంధించి ఈ నెల‌లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఏపీలో 28 ప్రాజెక్టులు ప్రారంభించిన విష‌యం తెలిసిందే. వాటికి సంబంధించిన ప‌నులు కూడా కొన‌సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుల‌కు రూ. 8,869 కోట్లు వెచ్చించ‌నున్నారు. వాటిలో 2,209 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి రూ.32,175 కోట్లు వ్యయం కానుంది. వీటికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తుది దశలో ఉంది. వచ్చే ఏడాదిలో పనులు మొదలవుతాయి. రూ.5 వేల కోట్లకు పైగా వ్యయం అయ్యే బెంగళూరు–చెన్నై హైవే ఏపీకి ఎంతో కీలకంగా మార‌నుంది. పోర్టు కనెక్టివిటీ ఏర్ప‌డితే వాణిజ్య సంబంధాలు మెరుగుప‌డ‌నున్నాయి. అమరావతి – అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే పనులు నాలుగు జిల్లాలలో కొనసాగుతున్నాయి. ప్రాజెక్టుల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఏపీలో మరింత ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తామ‌ని, ఎంఎస్‌ఎంఈ, ఖాదీ పరిశ్రమలకు కేంద్రం పూర్తి అండగా ఉంటుంద‌ని గ‌డ్క‌రీ హామీ ఇచ్చారు. దీని ద్వారా చేనేత, హస్తకళల రంగాలు కూడా అభివృద్ధి చెంద‌నున్నాయి.


idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp