గిట్టుబాటు ధర అదో చిరకాల కల

By KalaSagar Reddy Dec. 11, 2019, 01:12 pm IST
గిట్టుబాటు ధర అదో చిరకాల కల

దేశానికి వెన్నుముక రైతన్న అన్నది మన దేశ నినాదం , మరి ఆ రైతుకి వెన్నుముక ???? .

ఆరుగాలం కష్టించి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరే రైతన్నకి దన్నునిచ్చే వెన్నుముక .
మాకు ఉచితాలు వద్దు , సబ్సిడీలు వద్దు , మోసపూరిత మాఫీలొద్దు , ఎన్నికల తాయిలాలు అసలే వద్దు . ఎండనకా , వాననకా రెక్కలు ముక్కలు చేసుకొని స్వేదాన్ని ఎరువుగా మార్చి కష్టించి పండించిన మా పంటకు న్యాయమైన గిట్టుబాటు ధర ఇవ్వండి చాలు మరేమీ వద్దు అనే రైతు ఘోష ఫలించే రోజు వస్తుందా ??? .

ఈసారైనా దళారీల దశాబ్దాల కట్టుబాట్లు చీల్చుకొని రైతుముంగిటికి రాబోతోందా కష్టఫలం .ఈ రోజు అసెంబ్లీలో వరి గిట్టుబాటు ధర గురించి ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానమిస్తూ గురువారం అనగా 12 వ తారీఖు గిట్టుబాటు ధరలతో కూడిన ప్రకటన పత్రికల్లో ఇస్తామని సమాధానమిచ్చారు .

రాష్ట్రంలో ప్రధాన పంటలైన వరి ,జొన్న ,సజ్జ ,మొక్కజొన్న ,రాగి ,కందులు ,పెసర ,మినుము,శనగలు , వేరుశనగ, పసుపు , పత్తి , మిర్చి ఉత్పత్తులకు ప్రభుత్వం కనీస గిట్టుబాటు ధర నిర్ణయిస్తుందని , ఆ రేటుకి ఒక్క రూపాయి కూడా తక్కువకి ఏ రైతు అమ్ముకోవాల్సిన అవసరం లేదని ఉద్ఘాటించారు .

ప్రకటనల్లో భాగంగా కొనుగోలు కేంద్రాల వివరాలు పొందు పరుస్తామని , అలాగే అమ్ముకోవటంలో రైతుకి ఏదైనా సమస్య ఏర్పడితే పరిష్కారం కొరకు హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేస్తామన్నారు . రైతుకి మేలు చేసే అంశంలో తమ ప్రభుత్వం ఏ రోజూ వెనకడుగు వేయదని , నాలుగడుగులు ముందే ఉంటుందని కూడా తేల్చిచెప్పారు .
నిజానికి ఇది వైసీపీ మేనిఫెస్టోలో కూడా అతి ముఖ్యమైన అంశం . 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని , గిట్టుబాటు ధర విషయంలో స్వామినాథన్ కమిటీ సిఫారసులను అనుసరించి ధర నిర్ణయించి ఆ ధరకి రైతు బహిరంగ మార్కెట్లో అమ్ముకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వ ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతు నుండి ప్రభుత్వమే కొనుగోలు చేసేట్టు చర్యలు తీసుకొంటామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగానే చర్యలు తీసుకోబోవటం రైతులకు శుభ పరిణామం అని చెప్పొచ్చు .

12 వ తారీఖు ప్రకటించబోయే రేట్లు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం పెట్టుబడి వ్యయానికి యాభై శాతం లాభంగా లెక్కించి ధర నిర్ణయిస్తారా , ఇతర అంచనాలను ప్రామాణికంగా తీసుకొంటారా , ఏ పంటకు ఎంత రేటు నిర్ణయిస్తారు అనేది ఆసక్తికరం . గురువారం ఉదయం పత్రికల కోసం ప్రతి రైతూ ఉత్కంఠగా ఎదురు చూస్తాడు అనటంలో అతిశయోక్తి లేదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp