కృష్ణపట్నంలో కొత్త చరిత్ర: పారిశ్రామిక రంగంలో కీలక స్థానం

By Raju VS Mar. 01, 2021, 05:30 pm IST
కృష్ణపట్నంలో కొత్త చరిత్ర: పారిశ్రామిక రంగంలో కీలక స్థానం

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అత్యంత కీలకమైన తీర ప్రాంతంపై జగన్ సర్కారు దృష్టి సారించింది. కొత్త పోర్టులు, జెట్టీల నిర్మాణం చేపట్టింది. అదేసమయంలో కృష్ణపట్నం వంటి కీలక పోర్టు ముందడుగు వేసేందుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటోంది. చెన్నై, బెంగళూరు వంటి మహనగరాలకు చేరువలో ఉన్న కృష్ణపట్నం అభివృద్ధికి ఉన్న అన్ని అవకాశాలు వినియోగించుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఇటీవల పెద్ద చర్చనీయాంశంగా మారిన పోస్కో కంపెనీ కి కృష్ణపట్నం తీరంలో భూములు కేటాయించేందుకు ఆఫర్ ఇచ్చింది. దక్షిణాసియా ప్రాంతంలోనే పూర్తి ఆటోమేటెడ్ పోర్టుగా ఉన్న కృష్ణపట్నం లో ఉన్న అవకాశాలను పోస్కో యాజమాన్యం దృష్టికి తెచ్చింది. 2020-23 కాలం కోసం రూపొందించిన ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తుందని హామీ ఇచ్చింది. కొత్తగా ఉక్కు పరిశ్రమ పెడితే అక్కడి పోర్టునకు అది యాంకరింగ్ పరిశ్రమ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. పరిశ్రమ కి సంబంధించిన పూర్తి ప్రతిపాదనలతో ముందుకు వస్తే భారీగా రాయితీలు కూడా ఇస్తామని పరిశ్రమల శాఖ తరుపున కరికాల వల్లవాన్ రాసిన లేఖలో పేర్కొన్నారు.

పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన భూముల ఎంపిక కోసం పోస్కో బృందాన్ని పంపించాలని ఆయన ఆహ్వానించారు. ఇప్పటికే గత ఏడాది డిసెంబరులో ప్రాధమికంగా పర్యటించి, పరిశీలన చేసిన తరుణంలో తాజాగా ఏపీ ప్రభుత్వం నుంచి పోస్కో కంపెనీకి ఆహ్వానం అందడం ఆసక్తికరంగా మారింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో దేశంలోనే ఏపీ నంబర్ వన్ గా నిలిచిందని గుర్తు చేస్తూ మూడు రాష్ట్రాల సరిహద్దులకు చేరువలో ఉన్న కృష్ణపట్నం ప్రాధాన్యాన్ని చాటి చెప్పారు. ఈ నేపథ్యంలో నెల్లూరు , ప్రకాశం జిల్లాల్లో పారిశ్రామికీకరణ ప్రయత్నాలు వేగవంతం చేసినట్టు చెప్పవచ్చు.

ఏపీలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా కృష్ణపట్నం వేగంగా అభివృద్ధి అవుతిన్న తరుణంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కొత్తపుంతలు తొక్కిస్తుందని చెప్పవచ్చు. అనుబంధ పరిశ్రమలతో సమీప ప్రాంతాలకు కూడా ఈ ఫలితాలు దక్కే అవకాశం ఉంది.
ఓ వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడాలని ప్రయత్నిస్తూనే మరోవైపు పోస్కో ఆధ్వర్యంలో కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టించాలనే జగన్ లక్ష్యాన్ని పలువురు అభినందిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp