వీడని ‘పంచాయతీ’ ఉత్కంఠ..! మరో మూడు రోజుల్లో క్లారిటీ..?

By Karthik P Jan. 19, 2021, 02:15 pm IST
వీడని ‘పంచాయతీ’ ఉత్కంఠ..!  మరో మూడు రోజుల్లో క్లారిటీ..?

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే ఉత్కంఠ మరికొన్ని రోజులపాటు కొనసాగే పరస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం వాదనలను విన్న ఏపీ హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ తీర్పును రిజర్వ్‌ చేసింది. తీర్పు ఎప్పుడు వెల్లడించేది తెలియాల్సి ఉంది.

ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేయగా.. కరోనా వైరస్, వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో సాధ్యం కాదంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. షెడ్యూల్‌ను నిలిపివేయాలని కోరింది. ఇరు వైపు వాదనలను విన్న హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించి.. షెడ్యూల్‌ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజనల్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. మూడు రోజుల పాటు ఇరు వైపుల వాదనలను ధర్మాసనం ఆలకించింది. వాదనలు పూర్తి కావడంతో.. తీర్పును రిజర్వ్‌ చేసింది.

కాగా, ఈ వ్యవహారంలో తమను కూడా ఇంప్లీడ్‌ చేయాలని ఏపీలోని ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశంపై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల పిటిషన్లను అనుమతించబోమని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆయా సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది.

రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఈ నెల 8వ తేదీన షెడ్యూల్‌ జారీ చేశారు. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించేదుకు అనుగుణంగా.. ఈ నెల 23. 27. 31 తేదీల్లో వరుసగా తొలి, రెండు, మూడో దశ ఎన్నికలకు నోటిఫికేషన్, వచ్చే నెల 4న నాలుగో దశ నోటిఫికేషన్‌ జారీ చేసేలా షెడ్యూల్‌ ప్రకటించారు. వచ్చే నెల 5, 7, 9, 17 తేదీల్లో ఉదయం 6:30 గంటలకు నుంచి మధ్యాహ్నం 3: 30 గంటల వరకు పోలింగ్, ఆ తర్వాత కౌంటింగ్‌ చేపట్టనున్నట్లు ప్రకటించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. ఈ నెల 23వ తదీన తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ తన తీర్పున ఈ నెల 22వ తేదీ లోపు వెల్లడించే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజనల్‌ బెంచ్‌ సమర్థిస్తుందా...? లేదా ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించి.. ఎన్నికల నిర్వహణకు లైన్‌ క్లియర్‌ చేస్తుందా..? శుక్రవారం లోపు తేలే అవకాశాలున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp