మాన్సస్‌ ట్రస్ట్‌ వివాదం.. అశోక్‌గజపతి రాజుకు అనుకూలంగా హైకోర్టు తీర్పు

By Karthik P Jun. 14, 2021, 01:49 pm IST
మాన్సస్‌ ట్రస్ట్‌ వివాదం.. అశోక్‌గజపతి రాజుకు అనుకూలంగా హైకోర్టు తీర్పు

సింహాచలం దేవస్థాన పాలక మండలి, మాన్సస్‌ ట్రస్ట్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేవస్థానం, ట్రస్ట్‌ చైర్‌ పర్సన్‌గా ఆనందగజపతిరాజు పెద్ద కుమార్తె సంచయిత గజపతిరాజు నియమాకాన్ని ఏపీ హైకోర్టు రద్దు చేసింది. అంతకు ముందు చైర్మన్‌గా ఉన్న అశోక్‌ గజపతిరాజును పునర్నియమించాలని ఆదేశించింది. సంచయిత నియామకాన్ని సవాల్‌ చేస్తూ అశోక్‌ గజపతిరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరువైపుల వాదనలను విన్న హైకోర్టు.. ఈ రోజు తీర్పు వెలువరించింది.

ల్యాండ్‌ సీలింగ్‌ చట్టం నేపథ్యంలో.. విజయనగరం గజపతిరాజులు తమ ఆధీనంలో ఉన్న భూములను రాష్ట్రంలోని 104 దేవాలయాలకు బదిలీ చేసి.. వాటి పర్యవేక్షణకు మాన్సస్‌ ట్రస్టును ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి గజపతుల వారసులు ఆధ్వర్యంలోనే ఈ ట్రస్ట్‌ నడుస్తోంది. ట్రస్ట్‌ పరిధిలో వేలాది ఎకరాల భూములు ఉన్నాయి. వాటి విలువ లక్షన్నర కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. 2016 వరకు అశోక్‌గజపతిరాజు అన్న.. ఆనందగజపతి రాజు మాన్సస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన మరణించిన తర్వాత.. ఆ స్థానంలో అశోక్‌ గజపతిరాజును నాటి చంద్రబాబు ప్రభుత్వం ఆఘమేఘాలపై నియమించింది.

అశోక్‌ చైర్మన్‌గా ఉన్న మాన్సస్‌ ట్రస్టులో ఆయన కుమార్తె అతిధిగజపతిరాజును కూడా సభ్యురాలుగా నియమించింది. వారితోపాలు ట్రస్ట్‌ బోర్టుతో ఏ మాత్రం సంబంధం లేని టీడీపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న చెరుకూరి కుటుంబరావు, ఎన్టీఆర్‌వైద్య విధాన పరిషత్‌ మాజీ వీసీ ఐవీ రావులను కూడా సభ్యులుగా నియమించింది. అయితే ఆనందగజపతి రాజు కుటుంబం నుంచి ఎవరికీ స్థానం కల్పించలేదు.

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆనందగజపతి రాజు కుమార్తె సంచయిత గజపతిరాజును సింహాచలం ట్రస్ట్‌బోర్డులో సభ్యురాలుగా నియమించింది. ఆ తర్వాత 2020 మార్చిలో దేవస్థానం, మాన్సస్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాన్ని అశోక్‌గజపతిరాజు వ్యతిరేకించారు. తనను అన్యాయంగా తొలగించారంటూ.. కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఏపీ హైకోర్టు అశోక్‌గజపతిరాజుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ వ్యవహారంపై సంచయిత గజపతి రాజు, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Also Read : నగదు బదిలీ పథకం మాదేనంటున్న యనమల.. నాటి పాలన గుర్తులేదా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp