ఆస్పత్రికి తరలించాలన్న అచ్చెం నాయుడు పిటిషన్‌పై హైకోర్టు లో ముగిసిన వాదనలు

By Kotireddy Palukuri Jul. 03, 2020, 05:17 pm IST
ఆస్పత్రికి తరలించాలన్న అచ్చెం నాయుడు పిటిషన్‌పై  హైకోర్టు లో ముగిసిన వాదనలు

తనకు అనారోగ్యంగా ఉన్నందున జైలు నుంచి ఏదైనా ప్రైవేటు ఆస్పతికి తరలించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్‌ అయిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ రోజు హైకోర్టు విచారణ జరిపింది. కోవిడ్‌ కారణంగా ధర్మాసనం ఆన్‌లైన్‌లో వాదనలు విన్నది. అచ్చెం నాయుడు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని, ఆయన్ను ఏదైనా ప్రవేటు ఆస్పత్రికి తరలించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు.

అచ్చెం నాయుడుకు సహాయకుడు కూడా అవసరమని న్యాయవాది తన వాదనలో చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సకు అయ్యే ఖర్చు అంతా అచ్చెం నాయుడు భరిస్తారని కోర్టుకు తెలిపారు. అచ్చెన్నాయుడుకు పూర్తిస్థాయిలో చికిత్స అందించామని, ఆయనకు మెరుగైన వైద్యం అవసరం లేదని ప్రభుత్వ లాయర్‌ తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తీర్పు ఎప్పడు వెలువరిస్తారన్న విషయాన్ని తెలపలేదు. అయితే రేపు తీర్పు ఇవ్వవచ్చనే ప్రచారం సాగుతోంది.

గత నెల 13వ తేదీన ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్‌ అయిన అచ్చెం నాయుడుకు కోర్టు రిమాండ్‌ విధించినా.. ఫైల్స్‌ ఆపరేషన్‌ జరగడంతో అప్పటి నుంచి గుంటూరు జీజీహెచ్‌లో ఉంటున్నారు. మరోసారి కూడా ఆపరేషన్‌ జరగడం, ఆ గాయం కూడా మానడంతో జీజీహెచ్‌ వైద్యులు అచ్చెం నాయుడును ఈ నెల 1వ తేదీన డిశ్ఛార్జి చేశారు. పోలీసులు అచ్చెం నాయుడును విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించిన రిమాండ్‌ గడువు ఈ నెల 10వ తేదీ వరకూ ఉంది. మరో వైపు ఏసీబీ కోర్టులో అచ్చెం నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. బెయిల్‌ ఇవ్వాలని అచ్చెం నాయుడు, తమ కష్టడీకి ఇవ్వాలని ఏసీబీలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp