కరోనా బాధిత చిన్నారులకు బాసట

By Ramana.Damara Singh May. 13, 2021, 07:30 pm IST
కరోనా బాధిత చిన్నారులకు బాసట

కోవిడ్ జనజీవనాన్ని కాకవికాలం చేస్తోంది. కుటుంబాలకు కుటుంబాలు ఆస్పత్రుల పాలవుతున్నాయి. ప్రాణాలు కోల్పోతున్నాయి. చాలా కుటుంబాల్లో పెద్దలు వైరస్ దాడితో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుంటే.. వారి పిల్లలు బయట బిక్కుబిక్కుమంటున్నారు. మరికొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు అనాథలుగా మారి రోడ్డున పడుతున్నారు. హృదయవిదారకమైన ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతుండటం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కదిలించింది. ఇటువంటి చిన్నారులను చేరదీసి ఆదరించేందుకు ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు

ఎందరో అనాథలుగా..
కోవిడ్ సెకండ్ వేవ్ ధాటికి ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. వైరస్ కట్టడికి ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా దాని తీవ్రతకు బలవుతున్నవారు అధికంగానే ఉంటున్నారు. ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారులు రోడ్డున పడి దిక్కులేని వారవుతున్నారు. కుటుంబంలో నలుగురైదుగురు ఒకేసారి కోవిడ్ తో మరణిస్తుంటే.. ఆ ఇంట్లో చిన్నారులు అనాథలుగా మిగిలిపోతున్నారు.

అలాగే తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి కోవిడ్ బారినపడి ఐసోలేషన్ లోనో.. ఆస్పత్రిలోనో ఉంటే వారి పిల్లలు ఇంటిదగ్గర ఒంటరిగా బిక్కు బిక్కుమంటూ కాలం గడపాల్సి వస్తోంది. తల్లిదండ్రులు ఎప్పుడొస్తారో తెలీదు. ఆకలికి అన్నం పెట్టేవారెవరో, ఎవరిని అడగాలో తెలియక అల్లాడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంధువులు, సన్నిహితులు, స్నేహితులు ఉన్నా కరోనా భయాలు ఆ చిన్నారులను అక్కున చేర్చుకొనివ్వడం లేదు. ఇటువంటి అభాగ్య చిన్నారుల గురించి ప్రసార మాధ్యమాల్లో వచ్చినప్పుడు హృదయం ఉన్న మానవతవాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అక్కడక్కడా చేరదీస్తున్నా అధిక శాతం చిన్నారులు అనాథలుగానే మిగిలిపోతున్నారు.

సంరక్షణ కేంద్రాలు
కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు పేద రోగులకు ఉన్నత వైద్యం అందించేందుకు, వారి సంక్షేమానికి పలు వినూత్న నిర్ణయాలతో ముందుకెళుతోంది. ఇప్పుడు కరోనా బాధిత చిన్నారుల సంరక్షణ బాధ్యతను కూడా తనే తీసుకునేందుకు సిద్ధమైంది. తల్లిదండ్రులు మరణించిన లేదా ఆస్పత్రుల్లో చేరడం వల్ల పెద్ద దిక్కు కోల్పోయిన పిల్లల కోసం ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ జిల్లాకు ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేస్తున్నారు. బాధిత పిల్లలను గుర్తించి ఈ కేంద్రాల్లో చేర్చుకోవడం, వారికి ఆహారం ఇతరత్రా అవసరాల పర్యవేక్షణకు ప్రతి కేంద్రానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించనున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp