ఆ ఇద్దరు మంత్రుల రాజీనామాలకు గవర్నర్‌ ఆమోదం

By Kotireddy Palukuri Jul. 20, 2020, 08:35 pm IST
ఆ ఇద్దరు మంత్రుల రాజీనామాలకు గవర్నర్‌ ఆమోదం

రాజ్యసభకు ఎన్నిక కావడంతో మంత్రి పదవులకు మోపీదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌లు సమర్పించిన రాజీనామాలను రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ కొద్దిసేటి క్రితం ఆమోదించారు. ఈ నెల 22వ తేదీన నూతనంగా ఎన్నికలైన 55 మంది రాజ్యసభ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పక్షం రోజుల కిందట మోపీదేవి, పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌లు సమర్పించిన రాజీనామాలకు గవర్నర్‌ ఆమోదించారు.

గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా రేపల్లె, తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గాల నుంచి మోపీదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌లు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే పార్టీ పెట్టకముందు నుంచి తనకు అండగా ఉన్న వీరిద్దరికి జగన్‌ సముచిత స్థానం కల్పించారు. ఎమ్మెల్సీలుగా చేసి తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. పిల్లికి రెవెన్యూ శాఖ, మోపీదేవికి మత్య్సకార, మార్కెటింగ్‌ శాఖలను కేటాయించారు. సీఆర్‌డీఏ రద్దు, పాలనవికేంద్రీకరణ బిల్లుల ఆమోదం సందర్భంగా ఇటీవల శాసన మండలిలో జరిగిన పర్యవసనాల నేపథ్యంలో మండలిని రద్దు చేసేందుకు జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఈ మేరకు శాసన పరమైన పక్రియను కూడా పూర్తి చేసి కేంద్రం ఆమోదానికి పంపింది. ఈ నేపథ్యంలో మంత్రి పదవులు కోల్పోతున్న వీరిద్దరిని రాజ్యసభకు పంపాలని జగన్‌ నిర్ణయించారు. ఈ మేరకు గత నెల 19వ తేదీన జరిగిన ఎన్నికల్లో వీరు గెలిచారు.

గవర్నర్‌ వీరిద్దరి రాజీనామాలను ఆమోదించడంలో జగన్‌ కేబినెట్‌లో రెండు మంత్రిపదవులు ఖాళీ అయ్యాయి. వీటిని వెంటనే భర్తీ చేసేందుకు వైసీపీ అధినేత సిద్ధం అవుతున్నారు. నిబంధనల ప్రకారం ఏపీలో 25 మంది మంత్రులు ఉండొచ్చు. ఆ మేరకు పూర్తి స్థాయి కేబినెట్‌ను ప్రారంభంలోనే జగన్‌ ఏర్పాటు చేశారు. తాజాగా ఖాళీ అయ్యే రెండు బెర్త్‌లను రాజీనామా చేసిన నేతల సామాజికవర్గాల ఎమ్మెల్యేలకే ఇవ్వాలని వైసీపీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఆ ఇద్దరి పేర్లను రేపు సీఎం జగన్‌ వెల్లడిస్తారని తెలుస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp