4 నిమిషాల్లోనే ప్ర‌మాద నివార‌ణ చ‌ర్య‌లు ఆరంభం..

By Kalyan.S Aug. 09, 2020, 04:15 pm IST
4 నిమిషాల్లోనే ప్ర‌మాద నివార‌ణ చ‌ర్య‌లు ఆరంభం..

విజ‌య‌వాడ స్వ‌ర్ణ ప్యాలెస్ ఘ‌ట‌న చాలా విచార‌క‌రం. అస‌లే అనారోగ్యంతో అలిసి సొలిసి కాస్త సేద‌తీరుతున్న వేళ‌.. నిద్ర‌లోనే 10 మంది వ‌ర‌కూ శాశ్వ‌త నిద్ర‌లోకి జారుకోవ‌డం తీర‌ని విషాదం. అయితే ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వ యంత్రాంగం క్ష‌ణాల్లో స్పందించ‌డం వ‌ల్ల ప్రాణ న‌ష్టం త‌గ్గింద‌నే చెప్పాలి. తెల్ల‌వారుజామున 4.30 నుంచి 5.00 మ‌ధ్య ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఆ స‌మ‌యంలో జ‌రిగిన ప్ర‌మాద తీవ్ర‌త ఎప్పుడూ ఎక్కువ‌గానే ఉంటోంది. గాఢ నిద్రలో ఉండే స‌మ‌యం కావ‌డంతో హుటాహుటిన స్పందించ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. విజ‌య‌వాడ ఘ‌ట‌న‌లో మాత్రం యంత్రాంగం త‌క్ష‌ణ‌మే స్పందించింద‌నే చెప్పొచ్చు. ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత సుమారుగా 5 గంట‌ల 6 నిమిషాల‌కు పోలీసుల‌కు ఫోన్ వ‌చ్చింది. 5 గంట‌లా 9 నిమిషాల‌కు ఫైర్ సిబ్బందికి స‌మాచారం అందింది. నాలుగే నాలుగు నిమిషాల్లో అంటే 5 గంటలా 13 నిమిషాల‌కు ఫైర్ సిబ్బంది వాహ‌నాల‌తో స‌హా అక్క‌డ‌కు చేరుకున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. త‌క్ష‌ణం నివార‌ణ చ‌ర్య‌లు ప్రారంభించారు.

అస‌లే కొవిడ్ ఆస్ప‌త్రి..

అస‌లే అది కొవిడ్ ఆస్ప‌త్రి.. ఏ వీధిలోనైనా కొవిడ్ రోగి ఉన్నాడంటే ఆ ద‌రిదాపుల‌కు వెళ్లేందుకే చాలా మంది భ‌య‌ప‌డుతున్నారు. అటువంటిది కొవిడ్ రోగులు ఆప‌ద‌లో ఉన్నార‌ని తెలియ‌గానే ఏమీ ఆలోచించ‌కుండా ముందుగా త‌మ‌ క‌ర్త‌వ్యం నిర్వ‌ర్తించారు ఫైర్, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది. మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. పీపీఈ కిట్ లు ధ‌రించి ఆస్ప‌త్రిలోకి వెళ్లారు. అక్క‌డ ప్రాణాపాయంలో ఉన్న 18 మంది రోగుల‌ను రెస్క్యూ చేసి కాపాడారు. సిబ్బంది స‌త్వ‌ర‌మే స్పందించ‌డం వ‌ల్లే వారంద‌రూ ప్రాణాల‌తో ఉన్నార‌ని ఉన్న‌తాధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు చెబుతున్నారు. వారి కృషిని కొనియాడుతున్నారు. ఎటుచూసినా ద‌ట్ట‌మైన పొగ‌.. ఊపిరి ఆడ‌డం లేదు. ఎటు పోవాలో తెలియడం లేదు. కిటికీ అద్దాలు ప‌గుల‌గొట్టి కాపాడాలి.. కాపాడాలి.. అంటూ కేక‌లు పెట్టాను. నా అరుపులు విన్న ఫైర్ సిబ్బంది న‌న్ను ర‌క్షించారు. అంటూ ఓ బాధితుడు ప‌వ‌న్ సాయి కృష్ణ సెల్ఫీ వీడియో ద్వారా త‌న అనుభ‌వాన్ని, భ‌యాన్ని వెలిబుచ్చాడు.

హుటాహుటిన రంగంలోకి మంత్రులు

ర‌మేష్ ఆస్ప‌త్రి దుర్ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు మంత్రుల బృందం కూడా వెంట‌నే రంగంలోకి దిగింది. ప్ర‌మాదంపై ఆరా తీసింది. ప్ర‌స్తుతం ఉన్న రోగుల వైద్య చికిత్స‌కు సంబంధించి వివ‌రాలు సేక‌రించింది. మంత్రులు సుచ‌రిత‌, ఆళ్ల నాని, వెల్లంప‌ల్లి, పేర్ని నాని, ఎంపీ మోదిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ వెంట‌నే స‌మీక్ష జ‌రిపారు. తీసుకోవాల్సిన చ‌ర్య‌లు సంబంధించి అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున విచార‌ణ క‌మిటీ వేశారు. ఆస్ప‌త్రిలో మొత్తం 31 మంది చికిత్స పొందుతుండ‌గా ప‌ది మంది చ‌నిపోయార‌ని, 18 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడార‌ని, వారిలో 15 మంది ర‌మేష్ ఆస్ప‌త్రికి చెందిన మెయిన్ బ్రాంచిలో చికిత్స పొందుతుండ‌గా.. ఆరుగురు సుర‌క్షితంగా ఇళ్ల‌కు చేరిన‌ట్లు వివ‌రించారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా అటు ప్ర‌భుత్వ యంత్రాంగం.. ఇటు మంత్రుల బృందం ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే స్పందించ‌డంతో కొంత మంది ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp