లక్ష్యం....పోలవరం! -మార్చి 31 నాటికి కాలువలు మూసివేతకు నిర్ణయం

By Voleti Divakar Nov. 24, 2020, 10:18 pm IST
లక్ష్యం....పోలవరం! -మార్చి 31 నాటికి కాలువలు మూసివేతకు నిర్ణయం

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కాఫర్‌ డ్యాంను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంతో ఈ ఏడాది రబీ సీజన్‌ను ఖచ్చితంగా 120 రోజుల్లోనే పూర్తి చేయాలని, అందుకు రబీ సాగును కుదింపు చేయాలని నీటి పారుదల సలహ మండలి(ఐఎబి) నిర్ణయించింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, తూర్పు గోదావరి జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా డెల్టా కాలువలకు విడుదల చేసే సాగునీటిని వచ్చే ఏడాది మార్చి 31న నిలుపుదల చేయాలని ఇరిగేషన్‌ శాఖ అధికారులు నిర్ధేశించారు.

అయితే గోదావరి డెల్టాలోని ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీటిని సరఫరా చేసేలా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు మండలి దృష్టికి తీసుకొచ్చారు. ఆఖరికి 90 టిఎంసీల నీటితో తాగునీరు, పశువులకు సరిపడే నీటి సరఫరాతోపాటు రబీ సాగుకు ఢోకా లేకుండా రబీని పూర్తి చేయాలని నిర్ణయించారు. సాగునీటికి ఇబ్బందులు లేకుండా కాఫర్‌ డ్యాం నిర్మాణం 2020-21 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలనే సంకల్పతో అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఈ సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ రబీకీ 90 టిఎంసీల నుంచి 97 టిఎంసీల నీటితో ఉబయ గోదావరి జిల్లాల పరిధిలో డెల్టా కాలువలకు సాగునీటిని సరఫరా చేసేలా అధికారులు ఈ ఏడాది కాఫర్‌ డ్యాం నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని రబీ కార్యచరణను రూపొందించారు.

డెల్టాలో రబీ సీజన్‌లో ఒక లక్షా 45 వేల ఎకరాల నుంచి ఒక లక్షా 50 వేల ఎకరాల వరకూ సాగు అవుతుందని అధికారులు వివరించారు. అయితే పోలవరం కాఫర్‌ డ్యాం వల్ల గత ఏడాది డెల్టా పరిధిలో రైతులు పలు ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. ముఖ్యంగా అమలాపురం, టైలాండ్స్‌లో ఏప్రియల్‌లో తాగునీటికి ఇబ్బందులు పడ్డారని తెలిపారు. టైలాండ్స్‌ ప్రాంతాలకు నీరు వెళ్లాలంటే 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తేనే సాధ్యమని తెలిపారు. ఈస్ట్రన్‌ డెల్టా పరిధిలో డిసెంబర్‌ లోగా 85 శాతం నాట్లు పూర్తియ్యే అవకాశం ఉందని, అయితే సెంట్రల్‌ డెల్టా పరిధిలో 35 శాతం మాత్రమే నాట్లు పడే అవకాశాలు ఉన్నాయని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. రబీ సాగుకు కనీసంగా 120 రోజుల నుంచి 135రోజుల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. డిసెంబర్‌లోగా పూర్తి స్థాయిలో నాట్లు పడకపోతే రైతులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని సమావేశం దృష్టికి కలెక్టర్‌ తీసుకొచ్చారు.

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజు మాట్లాడుతూ పశ్చిమ డెల్టా పరిధిలో సుమారు 5.29 లక్షల ఎకరాలు సాగులో ఉందని, అయితే మార్చి 31నాటితో నీటి సరఫరాను నిలుపుదల చేస్తే రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అదే జరిగితే సుమారు 60 వేల ఎకరాల వరకూ ఆయకట్టులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు. గత ఏడాది రబీ సీజన్లో కూడా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. 120 రోజుల లోపు పంటలు చేతికొచ్చేలా చర్యలు తీసుకుంటే. ఇబ్బందుల నుంచి బయటపడవచ్చునని అభిప్రాయపడ్డారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp