మహిళల రక్షణకు మరో కీలక యాప్ ని ప్రారంభించబోతున్న సీఎం జగన్

By Raju VS Nov. 23, 2020, 10:16 am IST
మహిళల రక్షణకు మరో కీలక యాప్ ని ప్రారంభించబోతున్న సీఎం జగన్

ఏపీలో మహిళల రక్షణ కోసం ఇప్పటికే ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ప్రధానంగా దిశ చట్టం వంటివి రూపొందించింది. వాటిని కేంద్రం ఆమోదిస్తే మహిళా చట్టాలకు మరింత పటిష్టత ఏర్పడినట్టుగానే భావించాలి. అదే సమయంలో ప్రయాణాల్లో మహిళలకు మరింత భద్రత కల్పించే దిశలో ప్రయత్నం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాలలు, మహిళల భద్రత కోసం అభయం అనే సరికొత్త ప్రాజెక్ట్ ను తెరమీదకు తెచ్చింది. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్భయ స్కీం లో భాగంగా అభయం అనే ప్రాజెక్టు ను రాష్ట్ర ప్రభుత్వం అమలకు పూనుకుంది.

ఏపీలో దాదాపు లక్ష ఆటో లను అభయం ప్రాజెక్ట్ కిందకు తీసుకురానున్నారు. ప్రతి ఆటో డ్రైవర్ మొబైల్లో అభయం అనే మొబైల్ అప్లికేషన్ ను రవాణాశాఖ అధికారులు ఇన్స్టాల్ చేస్తారు. దీనిలో ఆటో నెంబర్, డ్రైవర్ పేరు, ఇతర వివరాలన్నీ అప్లోడ్ చేస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆటో లో ప్రత్యేకంగా పానిక్ బటన్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆటో లలో ప్రయాణించే మహిళలు, పిల్లలు ఎవరైనా ఆపద ఉన్నట్లు గ్రహిస్తే వెంటనే.. బటన్ ను నొక్కాలి. ఇలా బటన్ నొక్కిన వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్ కు సమాచారం చేరుతుంది. అంతేకాకుండా బటన్ నొక్కిన వెంటనే ఆటో నుండి హెల్ప్ అని శబ్దం రావడంతో పాటు.. కొద్ది దూరం వెళ్ళగానే వాహనం ఆటోమేటిక్ గా ఆగిపోతుంది.

ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ యాప్ ని లాంఛనంగా ప్రారంస్తున్నారు. మహిళలు, పిల్లల భద్రత కోసం ఏర్పాటు చేసిన ఈ అప్లికేషన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హోంమంత్రి సుచరిత తెలిపారు. అభయం ప్రాజెక్ట్ మొదటి విడత లో భాగంగా రేపు విశాఖపట్నంలో లో వెయ్యి ఆటో లతో ఈ కార్యక్రమాన్ని తొలుత ప్రారంభిస్తున్నారు. డిసెంబర్ 1 వ తేదీన 5 వేల వాహనాలు, వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి లక్ష వాహనాల్లో ఈ తరహా ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు రవాణాశాఖ అధికారులు పేర్కొన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp