స్థానిక సంస్థల ఎన్నికలు.. రాష్ట్ర సర్కార్‌ తేల్చేసింది..!

By Kotireddy Palukuri Oct. 23, 2020, 03:25 pm IST
స్థానిక సంస్థల ఎన్నికలు.. రాష్ట్ర సర్కార్‌ తేల్చేసింది..!

కరోనా వైరస్‌ కారణంగా మార్చి 15వ తేదీన వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన వైఖరిని తేల్చి చెప్పింది. కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బ్యాంకర్లతో సమావేశం అనంతరం గౌతమ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బిహార్‌ శాసన సభ ఎన్నికలతో రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలను పోల్చలేమన్నారు. శాసన సభ ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి అన్న గౌతమ్‌ రెడ్డి.. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు వెలుసుబాటు ఉందన్నారు.

కరోనా వైరస్‌ను కారణంగా చూపుతూ తాను వాయిదా వేసిన స్థానిక సంస్థల ఎన్నికలను తాను పదవిలో ఉన్నప్పుడే నిర్వహించేందుకు వివాదాస్పద రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ యోచిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అది అలా కొనసాగుతుండగానే.. గురువారం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో సమావేశం అయ్యేందుకు తేదీని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు ఈ నెల 28వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి రావాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలకు వర్తమానం పంపి రాజకీయ రచ్చకు తెరలేపారు. వాయిదా పడిన ఎన్నికలపై కమిషనర్‌ తీరు ఉలా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితిలేదని చెప్పడంతో ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చింది.

బిహార్‌లో శాసన సభ ఎన్నికలు నిర్వహిస్తుండగాలేనిది ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించలేరా..? అంటూ ఇటీవల హైకోర్టు పాత పిటిషన్‌పై విచారణలో భాగంగా వ్యాఖ్యానించింది. ఆ తర్వాతే నిమ్మగడ్డ.. నిధులపై పిటిషన్, తాజాగా రాజకీయ పార్టీలతో చర్చ అంటూ ముందుకొచ్చారు. కరోనా వైరస్‌ ఏమీ లేని రోజున కనీసం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా యుద్ధప్రాతిపదికన జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదా వేశారు. నేడు మాత్రం వైరస్‌ వ్యాపిస్తూ.. రోజుకు నాలుగు వేల కేసులు నమోదవుతున్న తరుణంలో ఎన్నికల నిర్వహిస్తామంటూ చర్యలు చేపడుతుండడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. నిమ్మగడ్డ వ్యవహారశైలి ఇప్పటికే ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు పార్క్‌ హయత్‌ హోటల్‌ సాక్షిగా స్పష్టమైన తరుణంలో తాజా చర్యలు ఏపీలో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp