ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం, కరోనా బాధితులకు ఉచితంగా ప్రైవేటు చికిత్స

By Raju VS Jul. 08, 2020, 10:15 pm IST
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం, కరోనా బాధితులకు ఉచితంగా ప్రైవేటు చికిత్స

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో అడుగు వేసింది. కరోనా వైరస్ విస్తృతమవుతున్న వేళ కీలక నిర్ణయం తీసుకుంది. బాధితులకు ప్రైవేటు చికిత్స అందించేందుకు సిద్ధమయ్యింది. వైద్యం కోసం ఆరోగ్య శ్రీ పథకం వర్తిస్తుందని ప్రకటించింది. దానికి అనుగుణంగా వైద్య ఆరోగ్యశాఖ తరుపున జీవో 77 విడుదల చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయడంతో ప్రజలకు ఉపశమనం ఖాయమని అంతా భావిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. కానీ తాజాగా ఆయా ఆసుపత్రుల వర్గీకరణ, వైద్యానికి ధరలు నిర్ణయించడంతో మార్గం సుగమం అయ్యింది.

ఇటీవల హైదరాబాద్ లో కొన్ని కార్పోరేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్య సహాయం పొందుతున్న వారి నుంచి లక్షల్లో వసూలు చేస్తున్న ఫీజుల వ్యవహారం కలవరం కలిగిస్తోంది. చాలామందిని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులలో తగిన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయకుండా, ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల్లోఫీజులు గుంజుతున్న తీరు మీద పలువురు హైదరాబాదీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుని ఆరోగ్య శ్రీ వర్తించేలా కరోనా చికిత్స కు సిద్ధమవుతోంది. ఓవైపు ప్రభుత్వ ఆసుపత్రుల విధుల నిర్వహణకు సిబ్బంది నియామకం చేసింది. వైద్యుల రిక్రూట్ మెంట్ చేస్తోంది. సదుపాయాలు కల్పించేందుకు వివిధ ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో ఉచితంగా కరోనా సేవలు అందించేందుకు ఎంపిక చేసిన ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతినిస్తోంది. బాధితులకు తగిన చికిత్స అందించేందుకు అవకాశం ఉన్న ఆసుపత్రులను ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయా ఆసుపత్రులలో వైద్యానికి అయ్యే ఖర్చుని ప్రభుత్వం చెల్లిస్తుందని వెల్లడించారు.

అందులో భాగంగా కోవిడ్ 19 బాధితులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సకు ఆరోగ్య శ్రీ పథకం కింద నిర్ణయించిన ధరలు ఈ కింద విధంగా ఉన్నాయి.

నాన్ క్రిటికల్ పేషెంట్లకు రోజుకి రూ.3250
క్రిటికల్ కేర్ ఐసీయూలో వెంటిలేటర్ , ఎన్ఐవీ అవసరం లేకుండా రోజుకి రూ.5,480
ఐసీయూలో ఎన్ఐవీతో చికిత్స రూ. 5980
ఐసీయూలో వెంటిలేటర్ తో చికిత్స రూ. 9,580
వెంటిలేటర్ లేకుండా సెప్సిస్ చికిత్స రూ. 6,280
వెంటిలేటర్ తో సెప్సిస్ చికిత్స రూ. 10,380

నాన్ క్రిటికల్ పేషెంంట్లకు ఎవరైనా ప్రత్యేక రూమ్ కావాలని ఆశిస్తే అదనంగా రోజుకి రూ. 600 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తూ ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా వైద్య సేవలు మరింత విస్తృతమవడమే కాకుండా ప్రజలకు ఆందోళన తొలగి, కరోనా ని ఎదుర్కొనే అవకాశం దక్కుతుందని అంతా భావిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp