ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఖరారు చేసిన జగన్ ప్రభుత్వం

By Raju VS Oct. 28, 2020, 10:40 am IST
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఖరారు చేసిన జగన్ ప్రభుత్వం

దినోత్సవం కూడా నిర్ధారించుకోలేని రాష్ట్రంగా గడిచిన ఆరేళ్లుగా మిగిలిన ఆంద్రప్రదేశ్ కి ఇకపై అలాంటి సమస్య లేదు. నవంబర్ 1నాడే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా ఏపీ ప్రభుత్వం నిర్ధారణ చేసింది. దానికి అనుగుణంగా జీవో కూడా విడుదల చేసింది. జీవో నెంబర్ 1691 ప్రకారం ఇకపై నవంబర్ 1నాడే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం జరపాలని నిర్ణయం చేసింది. దానికి అనుగుణంగా రాష్ట్ర కేంద్రంతో పాటుగా అన్ని జిల్లా కేంద్రాల్లో వేడుకల నిర్వహణకు ఓ కమిటీని నియమించింది.

ఏపీ ప్రభుత్వ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ చైర్మన్ గా 9 మందితో కమిటీ ఏర్పాటయ్యింది. అందులో సీనియర్ అధికారి రజిత్ భార్గవ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, గుంటూరు కలెక్టర్, ఎస్పీలతో సహా ఇతరులున్నారు.

వాస్తవానికి ఆంధ్రరాష్ట్రం 1953 అక్టోబర్ 1న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఆతర్వాత 1956 నవంబర్ 1న తెలంగాణా విలీనంతో ఆంధ్రప్రదేశ్ గా మారింది. చివరకు 2014 జూన్ 2 న తెలంగాణా విభజనకు అపాయింట్ మెంట్ డే గా నిర్ణయం జరగడంతో రాష్ట్ర విభజన జరిగింది. దాంతో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం విషయంలో సందిగ్ధం ఏర్పడింది. చంద్రబాబు ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో స్పష్టతకు రాలేకపోయింది. చివరకు జూన్ 2న దీక్షల పేరుతో కాలయాపన చేసింది.

ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం విషయంలో స్పష్టత ఇవ్వడం పట్ల పలువురు సంతృప్తి వ్యక్తం చేశారు. అనేక మంది అభిప్రాయాలకు అనుగుణంగా నవంబర్ 1నాడే దానిని నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏటా నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రమంతా జరుపుకోవడం సంతోషకరమని అంటున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp