స్వర్ణ ప్యాలేస్ ఘటనతో అప్రమత్తమయిన ప్రభుత్వం

By Raju VS Aug. 09, 2020, 01:52 pm IST
స్వర్ణ ప్యాలేస్ ఘటనతో అప్రమత్తమయిన ప్రభుత్వం

విజయవాడలో జరగిన ఘటనతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ప్రైవేటు ఆసుపత్రుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ కేంద్రాల పై దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలకు శ్రీకారం చుట్టింది. భద్రత సహా ఇతర అన్ని ఏర్పాట్లను పరిశీలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దాంతో రెవెన్యూ, పోలీస్, ఫైర్ అధికారులు రంగంలో దిగారు. అన్ని జిల్లాల్లోనూ ప్రైవేటు కేంద్రాల వివరాలను సేకరిస్తున్నారు.

విజయవాడ రమేష్ ఆస్పత్రి యాజమాన్యం ప్రైవేటు కోవిడ్ సెంటర్ విషయంలో అనుమతులు తీసుకోలేదని ఫైర్ డైరెక్టర్ జయరామ్ నాయక్ తెలిపారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్ ను కోవిడ్-19 సెంటర్ గా మార్చి నప్పుడు ఫైర్ అనుమతి తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా అదే నిబంధనలు పాటించాల్సి ఉంది. కానీ రమేష్ ఆస్పత్రి యాజమాన్యం గానీ, లేదా స్వర్ణ ప్యాలేజ్ యజమాని గానీ దానికి విరుద్ధంగా వ్యవహరించారు. దాంతో ప్రమాదం జరిగిన సమయంలో ఉన్న రోగులు 30 మందితో పాటు అటు ఆస్పత్రి, ఇటు హోటల్ సిబ్బంది కూడా తీవ్రంగా సతమతం అయ్యారు. అందులో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈఘటనపై ఫైర్ అధికారులు విచారణ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కూడా విచారణ సాగిస్తున్నారు. ఈ విచారణల ఆధారంగా హోటల్ యాజమాన్యంతో పాటుగా ఆస్పత్రి యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రైవేటు ఆసుపత్రుల తీరు మీద దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు, ఎక్కడ ఇలాంటి ప్రైవేటు కోవిడ్ సెంటర్లు నిర్వహిస్తున్నారనే విషయంపై సమాచారం సేకరిస్తున్నారు. ఆ వివరాల ఆధారంగా ఆయా కేంద్రాలలో సదుపాయాలను పరీక్షించేందుకు రంగంలో దిగారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అనేది కూడా పరిశీలించి, అనుమతులు లేని కేంద్రాలను తక్షణం మూసివేయాలని నిర్ణయించారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా మూడు శాఖల అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ పనిలోకి దిగారు.

వాస్తవానికి చాలా ఆసుపత్రులలో తగిన సదుపాయాలు లేకుండానే భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. స్వర్ణా ప్యాలేస్ లో కూడా దాదాపు అదే పరిస్థితి అని చెబుతున్నారు. ఈ తరుణంలో విచారణ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తప్పవని అంచనా వేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp