ఆంధ్రప్రదేశ్ లో తొలి జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు

By Kiran.G Dec. 05, 2019, 03:55 pm IST
ఆంధ్రప్రదేశ్ లో తొలి జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ లో తొలి జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదయింది. కృష్ణ జిల్లా నందిగామ సబ్ డివిజన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వీరులపాడు మండలం, రంగాపురం గ్రామానికి చెందిన రవి నాయక్ తన కుమారుడు కనిపించడంలేదని కంచికచర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రంగాపురం గ్రామం కంచికచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాకున్నా, కంచికచర్ల పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. తర్వాత రెండు బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఈ క్రమంలో మిర్యాలగూడ మండలం వీరంపాడులో బాలుడి ఆచూకిని గుర్తించారు.

దిశ అత్యాచార ఘటనతో కలత చెందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం జీరో ఎఫ్ఐఆర్ అమలు చేయాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. జీరో ఎఫ్ఐఆర్ అంటే బాధితులు తమకు అందుబాటులో ఉన్న ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఫిర్యాదు చేయవచ్చు. తరువాత సంఘటన ప్రదేశం గుర్తించి ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ పోలీస్ స్టేషన్ కు సంబంధిత కేసును బదిలీ చేస్తారు. రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ అమలు చేయడం వల్ల బాధితులకు సత్వర సహాయం అందుతుందని పలువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp