"వైఎస్సార్ జలకళ".. తీరనున్న సాగునీటి మెట్ట రైతుల కల

By Sanjeev Reddy Sep. 28, 2020, 07:51 am IST
"వైఎస్సార్ జలకళ".. తీరనున్న సాగునీటి మెట్ట రైతుల కల

నీటికీ ,పంటకి , రైతుకి ఉన్న సంభందం విడదీయలేనిది . నదీతీర ప్రాంతాల్లో భూములకి , నీటి ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టు భూములకీ సాగునీటి కష్టాలు తక్కువే కానీ వర్షాధార ప్రాంతాల్లో మెట్ట రైతులు నీటి కోసం భగీరథ ప్రయత్నాలు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం . ఆ ప్రయత్నాల్లో ప్రధానమైనది బోరు తవ్వకం . నిరంతరం పారే నదీ తీరాలకు దగ్గర్లో ఉండే ప్రాంతాల్లో తక్కువ లోతులో భూగర్భ జలాలు ఉండటంతో బోరు తవ్వకం ఖర్చు కూడా తక్కువే కానీ వాటికి దూరంగా ఉండే దుర్భిక్ష మెట్ట ప్రాంతాల్లో భూగర్భ జలాల కోసం వందల అడుగులు బోరు వేయాల్సిందే . ఇందుకోసం లక్షలు వెచ్చించాల్సిందే .

అయినా నీరు వస్తుందని నమ్మకం లేదు . పశ్చిమ ప్రకాశం నుండి చిత్తూరు వరకూ వందల అడుగుల చొప్పున బోర్లు తవ్వి నీరు పడక మరో ప్రయత్నం అనుకొంటూ బోరు మీద బోరు తవ్వి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొన్న రైతులు ఎందరో .

ఈ విధంగా సాంకేతిక సహాయం లేకుండా , నీటి వసతిని ఖచ్చితంగా గుర్తించకుండా బోర్లు తవ్వటం భూగర్భ జలమట్టాలకి కూడా ప్రమాదమే . కానీ రైతులకి ఈ విషయంలో గత ప్రభుత్వాలు కనీస సాంకేతిక సహాయం కూడా అందజేసింది లేదు . జియాలజిస్ట్ సర్వే చేసి నీటి వసతి నిర్ధారించిన ప్రదేశంలో బోరు వేస్తే విఫలమయ్యే అవకాశాలు తక్కువ . కానీ ఆ జియాలజిస్ట్ ఎక్కడుంటాడు , ఎవర్నీ సంప్రదించాలి లాంటి అంశాలేమి రైతుకి అందుబాటులో లేక తోచిన చోట బోర్లు తవ్వి నీరు పడక నష్టపోతుండటం జరుగుతుంది . ఈ కష్టాలకు ఇహ ముందు తెర పడనుంది అని చెప్పొచ్చు .

జగన్ తన పాదయాత్రలో ఈ కష్టాలు గమనించి తమ పార్టీ అధికారంలోకి వచ్చాక సాగు నీటి వసతి లేని మెట్ట భూముల్లో , ముఖ్యంగా సీమ ప్రాంతంలో నీటి కోసం బోర్లు మీద బోర్లు తవ్వి అప్పుల పాలవుతున్న రైతుల కష్టాలు తీర్చటానికి ప్రభుత్వ ఖర్చుతో బోర్లు తవ్విస్తామని పాదయాత్రలో హామీ ఇవ్వటం జరిగింది .

ఇచ్చిన హామీ మేరకు నేడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న వైఎస్సార్ జలకళ పధకం ద్వారా రానున్న నాలుగేళ్లలో అర్హులైన రైతులకు రెండు లక్షల బోరు బావులు తవ్వించడం తద్వారా ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడం లక్ష్యంగా నిర్ధేశించారు .

ఇందుకోసం ప్రతి అసెంబ్లీ , పార్లమెంట్ నియోజక వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున బోరు బండ్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. బోరు అవసరమున్న రైతు ఆన్ లైన్ ద్వారా www.ysrjalakala.ap.gov.in వెబ్ సైట్ నందు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా గ్రామ సచివాలయంలో తన పేరు నమోదు చేసుకోవచ్చు .

దరఖాస్తు చేసుకున్న రైతుల భూముల్లో హైడ్రో జియాలాజికల్ పరీక్షలు నిర్ధారించిన తర్వాత క్షేత్ర స్థాయిలో జియాలజిస్ట్ మరోసారి పరీక్షించి నీటి లభ్యతని గుర్తించిన ప్రాంతంలో మాత్రమే బోరు వేసే విధంగా రూపొందించిన ఈ పథకంలో బోర్లు విఫలమయ్యే అవకాశాలు చాలా తక్కువ .

గ్రౌండ్ వాటర్ ప్రమాదకర స్థాయికి పడిపోయిన 1000 పైగా గ్రామాలను ఈ పధకం పరిధిలోకి తీసుకురాలేదు . అలాగే జియాలజిస్ట్ నిర్ధేశించిన లోతులో బోర్లు వేసిన తరువాత భవిష్యత్తులో ఆ ప్రాంతంలో భూగర్భ జలమట్టం స్థాయి పడిపోకుండా వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణం కూడా చేపట్టనున్నారు .

సాంకేతిక పరిజ్ఞాన సాయంతో , పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేయనున్న ఈ బోర్ల ద్వారా మెట్ట ప్రాంత రైతుల కష్టాలు తీరడమే కాదు . అనంత లాంటి జిల్లాల్లో బోర్ల మీద బోర్లు వేసి అప్పుల పాలయ్యి చేసుకొనే రైతు ఆత్మహత్యలకు కూడా అడ్డుకట్ట పడుతుంది . ఈ పథకాన్ని సంక్షేమ పధకంగా కాక వ్యవసాయ ఉత్పత్తి పెరగటానికి దోహదం చేసే అభివృద్ధి పధకంగా పరిగణించవచ్చు .

రైతు బాంధవుడిగా పేరు పొందిన దివంగత నేత వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తూ రైతు భరోసా , గిట్టుబాటు ధరల స్థిరీకరణ నిధి , గ్రామగ్రామాన రైతు భరోసా కేంద్రాలలో తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని పేరు తెచ్చుకున్న వైసీపీ ప్రభుత్వం నేడు ప్రారంభించనున్న వైఎస్సార్ జలకళ పధకం ద్వారా ఆ పేరుని మరింత సుస్థిరం చేసుకోనుంది .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp