రేపే క్యాబినెట్ సమావేశం

By Sridhar Reddy Challa Jan. 17, 2020, 05:45 pm IST
రేపే క్యాబినెట్ సమావేశం

రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎపి క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. తొలుత 20 వ తారీఖు ఉదయం క్యాబినెట్ సమావేశం జరుగుతుందని ఆ తరువాత 11 గంటల నుండి అసెంబ్లీ సమావేశం జరుగుతుందని ప్రకటించినప్పటికీ, అనుకున్న దానికంటే రెండు రోజుల ముందే క్యాబినెట్ సమావేశం జరగనుండడం విశేషం. అయితే రాష్ట్రానికి సంబంధించి కీలకనిర్ణయాలు తీసుకునే ముందు క్యాబినెట్ లో ఆమోదించి, ఆ వెనువెంటనే అదే రోజు అసెంబ్లీ సమావేశంలో కీలకమైన బిల్లులు పెట్టడం అంత శ్రేయస్కరం కాదని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం న్యాయనిపుణుల సూచన మేరకే క్యాబినెట్ సమావేశాన్ని రెండు రోజులు ముందుకి మార్చినట్టు వార్తలొస్తున్నాయి.

క్యాబినెట్ సమావేశానికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ని విడుదలచేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అయ్యే క్యాబినెట్ సమావేశానికి హాజరు కావాల్సింది గా ఇప్పటికే మంత్రులందరికి సమాచారం అందించింది. ఈరోజు హైపర్ కమిటీ ముఖ్యమంత్రి తో భేటీ అయిన తర్వాత రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఎక్కడా కూడా రాజధాని మార్పు అంశంపై ఎటువంటి వ్యాఖ్యలు చెయ్యకుండా జాగ్రత్తపడ్డాడు.

అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారాన్ని బట్టి ముఖ్యమంత్రి చైర్మన్ గా, వైస్ చైర్మన్ తో పాటు తొమ్మిది మంది సభ్యులతో కూడిన జోనల్ డవలప్మెంట్ కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి వీటికి అధికారాలను బదిలీ చేసి ఆ తరువాత రాజధానిలో కొన్ని డిపార్ట్మెంట్ లను తరలిస్తే సరిపోతుందని అధికారులు సూచిస్తున్నట్టుగా మీడియా లో కథనాలొస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం ప్రక్రియకు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం ఇప్పటికే ఆ దిశగా అధికారులతో చర్చించినట్టు తెలుస్తుంది.

ఈ నేపద్యంలోనే రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో జోనల్ కార్పొరేషన్ ఏర్పాట్లు విధివిధానాలపై కూలంకుషంగా చర్చించే అవకాశం వుంది. హైపవర్ కమిటీ నివేదికపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఒకపక్క సీఆర్డీఏ కి భూములిచ్చిన రైతులు తమ విజ్ఞప్తులను, సూచనలను ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు ఆన్ లైన్ ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ సీఆర్డీఏ కమిషన్ కి తెలియజేయవచ్చని మొన్న మూడు రోజుల క్రితం హైపవర్ కమిటీ రైతులకు సూచించిన నేపథ్యంలో ఈరోజు తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం ముందు తమ విజ్ఞప్తులను తెలియజేయడానికి పెద్ద ఎత్తున రైతులు హాజరవడంతో పాటు ఆన్లైన్ లో కూడా పెద్ద ఎత్తున తమ విజ్ఞప్తులను సీఆర్డీఏ కమిషన్ కి తెలియజేశారు. ఈ తరుణంలో రైతుల సూచనలను హైపర్ కమిటీ పరిగణలోకి తీసుకొని వారి అభిప్రాయాలను ముదింపు చేసి సమగ్రంగా ఒక నివేదికను రూపొందించనుంది. రేపు మధ్యాహ్నం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో హైపర్ కమిటీ సూచనపై చర్చించిన తరువాత అసెంబ్లీ లో ఏ రూపంలో బిల్లు ప్రవేశ పెట్టాలో అనేదానిపై క్యాబినెట్ భేటీలోనే కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం వుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp