నామినేటెడ్ పదవుల పందేరం, పక్కా ప్రణాళికతో జగన్ సిద్ధం

By Raju VS Jun. 14, 2021, 12:00 pm IST
నామినేటెడ్ పదవుల పందేరం, పక్కా ప్రణాళికతో జగన్ సిద్ధం

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీల పదవుల పంపకం సందడి కనిపిస్తోంది. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల కేటాయింపు జరగోబోతంది. దానికి తగ్గట్టుగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ పక్కా ప్రణాళికతో సిద్దమయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ కార్పోరేషన్ చైర్మన్ పదవులు, డైరెక్టర్ పదవులకు అర్హతలను కూడా నిర్ణయించారు. నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల్లో అవకాశం కోల్పోయిన వారికి, అంతకుముందుగా ఎమ్మెల్యేలకు చైర్మన్ పదవులను కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది.

ఒక్కసారిగా 80 కార్పోరేషన్లకు చైర్మన్ పదవులు కేటాయించబోతున్నారు. దానికి సంబంధించిన కీలక సమావేశం ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మనసులో మాట వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ కోసం టికెట్ రాకపోయినా పనిచేస్తున్న నేతలను మొదటి ప్రాధాన్యతగా చైర్మన్ పదవులకు నిర్ణయించారు. అందులో కూడా సామాజిక న్యాయానికి అనుగుణంగా 50 శాతం రిజర్వుడు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. రెండున్నరేళ్ల పదవీకాలం ముగుస్తుండడంతో విజయదశమికి అటూ ఇటూ అన్నట్టుగా మంత్రివర్గ మార్పులు, చేర్పులకు సిద్దమవుతున్నారు. దానికి తగ్గట్టుగా ప్రస్తతుం పలువురు ఎమ్మెల్యేలకు చైర్మన్ పదవులు కేటాయించే అవకాశం ఉంది.

వచ్చేసారికి తమకు అమాత్య హోదా వస్తుందని ఆశతో ఉన్న వారిలో కొందరికి చైర్మన్ పదవులు కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది. తద్వారా మంత్రివర్గ కూర్పుల విషయంలో క్లారిటీ తీసుకురావడానికి జగన్ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందులో ఎక్కువగా సీనియర్లు ఉంటారని సమాచారం. వారితో పాటుగా ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న కొందరు బంధువులకు కూడా కీలక పదవులు కేటాయించే అవకాశం ఉంది. టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ఈనెల 21తో ముగుస్తుంది. ఆ తర్వాత నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి పేరు ప్రతిపాదనలో ఉంది. సుదీర్ఘకాలంగా జగన్ వెంట ఉన్న సీనియర్ నేతగా ఆయనకు ఛాన్స్ దాదాపు ఖాయమని ప్రచారం సాగుతోంది. సుబ్బారెడ్డి కి మరో కీలక పదవి కట్టబెట్టే అవకాశం ఉంది. ఇదే రీతిలో మంత్రివర్గంలో ఉన్న కొందరు మంత్రుల సన్నిహితులకు కూడా నామినేటెడ్ పదవుల్లో న్యాయం చేయడం ద్వారా తదుపరి జరిగే మంత్రివర్గంలో మార్పులకు లైన్ క్లియర్ చేస్తున్నట్టు చెబుతున్నారు.

ఇక భారీగా 900 మందికి డైరెక్టర్ పోస్టులు దక్కబోతున్నాయి. ఇక్కడ కూడా పోటీ ఎక్కువగా ఉంది. పలువురు నేతల నుంచి అనుచరుల కోసం వినతులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ తరుణంలో వాటికి కూడా కనీస అర్హత నిర్ణయించి, ఆ స్థాయి నేతలకు మాత్రమే కేటాయించే అవకాశం కనిపిస్తోంది. కనీసం మండల స్థాయిలో గుర్తింపు ఉండి, పార్టీ కోసంపనిచేస్తున్న వారికి ప్రాధాన్యతనిచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా కొద్ది రోజుల్లో జరగబోతున్న నామినేటెడ్ పోస్టుల పందేరం ఆ తరువాత జరగబోతున్న మంత్రివర్గంతో ముడిపెట్టి ఎంపిక చేయబోతున్నట్టు స్పష్టమవుతోంది. ఇది వైఎస్సార్సీపీ వర్గీయుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp