బీజేపీ నుంచి ఆ మాజీ టీడీపీ నేత అవుట్

By Kiran.G Oct. 20, 2020, 07:29 am IST
బీజేపీ నుంచి ఆ మాజీ టీడీపీ నేత అవుట్

2019 ఎన్నికల ముందు టీడీపీకి కళ్ళు చెవులు,చంద్రబాబుకు అన్ని తామే అన్నట్లు వ్యవహరించిన అనేకమంది తెలుగు తమ్ముళ్లు ఎన్నికల్లో పార్టీ ఓటమి తరువాత బీజేపీ పంచన చేరారు. రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి,సీఎం రమేష్,టీజీ వెంకటేష్,గరికపాటి లాంటి నేతలతో పాటు అధికారప్రతినిధులుగా మీడియా ముందు హల్ చల్ చేసిన సాదినేని యామిని,లంకా దినకర్ లాంటి వారు కూడా బీజేపీలో చేరారు.

వ్యాపారాలు ఉన్న పెద్ద నాయకులకు కేంద్ర ప్రభుత్వం అండ ఉంటుందన్న ఆశతో బీజేపీలో చేరగా,కాస్త మాటకారితనం ఉన్న యామిని,దినకరన్ లాంటి వారికి టీడీపీ పూర్తిగా మునిగిపోయిన నావలా కనిపించి బీజేపీలో ఏదో ఒక పదవి దక్కకపోతుందా? అన్న ఆశతో బీజేపీలో చేరారు.

మనుష్యులు బీజేపీలో మనసులు టీడీపీలో

ఇలా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలు "మనిషి ఇక్కడ మనసు అక్కడ" అన్న చందాన బీజేపీ ప్రతినిధులుగా మీడియా చర్చలకు వెళ్లి బీజేపీ పార్టీ వైఖరిని కాకుండా చంద్రబాబు వాణిని వినిపించేవారు. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్నత కాలం వీరికి అడ్డులేకుండాపోయింది. కానీ సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తరువాత "పచ్చ" బీజేపీని ప్రక్షాళన చేయటం మొదలు పెట్టి అనేకమందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సంతృప్తికర సమాధానం ఇవ్వని వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

బీజేపీ రాష్ట్ర విభాగం అనుమతులు లేకుండా టీవీ చర్చల్లో పాల్గొన్న లంకా దినకర్ కు కూడా జూలై చివర్లో షో కాజ్ నోటీస్ ఇచ్చారు. దానికి దినకర్ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవటంతో నిన్న రాత్రి పార్టీ అధ్యక్షుడి ఆదేశాల ప్రకారం దినకర్ ను బీజేపీ నుండి సస్పెండ్ చేస్తూ ఆఫీస్ సెక్రెటరీ శ్రీనివాసులు ప్రకటన విడుదల చేశారు.


కలిసిరాని రాజకీయం

చార్టెడ్ అకౌంట్ అయిన లంక దినకర్ మంచి ప్రాక్టీస్ ను వదులుకొని 2014 ఎన్నికల్లో ఒంగోలు టీడీపీ టికెట్ లక్ష్యంగా పూర్తిస్థాయి రాజకీయాలలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో ఒంగోలు టికెట్ దామరచర్ల జనార్ధన్ కు దక్కటంతో నిరాశ చెందిన దినకర్ కు చంద్రబాబు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు వరకు కూడా ఏదో ఒక పదవి దక్కుతుందన్న ఆశతో పనిచేసిన దినకర్ కు చివరికి నిరాశే ఎదురయ్యింది.

చంద్రబాబు వాడుకొని వదిలేశాడన్న కోపంతో పాటు టీడీపీ కోలుకునే అవకాశం లేదని భావించి ప్రాంతీయ పార్టీలలో టాలెంట్ ఉన్న నాయకులకు గుర్తింపు లేందటూ బీజేపీలో చేరారు.

బీజేపీలో అధికారప్రతినిధి పదవి కోసం చేసిన లాబీయింగ్ సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడు కావటంతో ఉపయోగం లేకుండాపోయింది. బీజేపీలో ఉంటూ చంద్రబాబు కోసం పనిచేసే నాయకులకు కళ్లెం వేసిన సోము వీర్రాజు దినకర్ మీద సస్పెన్షన్ వేటు వేశారు.

ఘనమైన చరిత్ర

దినకర్ తండ్రి సుభాష్ చంద్రబోస్ టీడీపీ ప్రకాశం జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు. ఎన్టీఆర్ టీడీపీని ప్రకటించినప్పుడు సుభాష్ చంద్రబోస్ ప్రకాశం జిల్లాలో టీడీపీ నిర్మాణం కోసం పనిచేశారు. కానీ ఆయనకు రాజకీయంగా పెద్ద పదవులు దక్కలేదు.

దినకర్ మేనమామ బత్తిన నరసింహారావు ప్రకాశం జిల్లాలో బలమైన బీజేపీ నేత. ఒక దశాబ్దం పాటు బీజేపీ కి ఆర్ధికంగా దన్నుగా నిలిచారు. మౌర్య హోటల్ యజమానిగా బత్తిన నరసింహారావుకు వ్యాపార వర్గాలలో మంచి గుర్తింపు ఉంది. 1991 లోక్ సభ ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు.

బీజేపీ సస్పెండ్ చేయటంతో లంకా దినకర్ రాజకీయ జీవితం ముగుస్తోందా లేక పాత గూటికి అంటే టీడీపీలో చేరుతారో చూడాలి. దినకర్ ను సస్పెండ్ చేయటం ద్వారా బీజేపీలోని చంద్రబాబు మనుష్యులకు గట్టి హెచ్చరిక పంపినట్లే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp