విష్ణువర్థన్‌రెడ్డి దాడి మీద ఫిర్యాదు చేసేది విజయవాడలోనా?

By Karthik P Feb. 26, 2021, 12:00 pm IST
విష్ణువర్థన్‌రెడ్డి దాడి మీద ఫిర్యాదు చేసేది విజయవాడలోనా?

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి న్యూస్‌ ఛానెల్‌ స్టూడియోలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌ రెడ్డిపై జరిగిన దాడి మీడియా, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. చర్చ కార్యక్రమంలో లైవ్‌లోనే మాటా మటా పెరిగి అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు శ్రీనివాసరావు బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డిపై చెప్పు దాడి చేశారు.

ఈ ఘటన ప్రజలందరూ వీక్షించారు. ఈ ఘటన కొందరి ప్రొద్భలంతోనే జరిగిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. చర్చ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఉన్న జర్నలిస్ట్‌ ఘటన జరిగిన సమయంలోనూ, ఆ తర్వాత ప్రవర్తించిన తీరు అనేక సందేహాలకు తావిచ్చింది. నెటిజన్లు ఈఘటనను తీవ్రంగా ఖండించారు.

అయితే ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ శాఖ ఆది నుంచి ప్రవర్తించిన తీరుపై ఆ పార్టీ శ్రేణుల నుంచే అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా బీజేపీపై, ఆర్‌ఎస్‌ఎస్‌పై ఎవరూ విమర్శలు చేసినా.. ప్రెస్‌మీట్‌లు పెట్టి వారిపై విరుచుకుపడే సోము వీర్రాజు.. ఆ పార్టీకి మొన్నటి వరకు ఏపీ ఉపాధ్యాక్షుడుగా, ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న విష్ణువర్థన్‌ రెడ్డిపై బహిరంగంగా చెప్పుతో దాడి చేసినా.. సోములో ఏ మాత్రం చలనం లేదు. నిత్యం జరిగే ఘటనలపై స్పందించాలన్నట్లుగా.. ఓ వీడియో విడుదల చేసి చేతులుదులుపుకున్నారు.

సదరు వీడియలోనూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఈ ఘటనపై ఆయన ఏ మాత్రం సీరియస్‌గా లేనట్లుగా చెబుతున్నాయి. ఘటనను ఖండిస్తున్నానని, దాడి చేసిన వ్యక్తిలాంటి వారిని చర్చలకు పిలవొద్దని డిమాండ్‌ చేస్తూ, కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేయాల్సిన చోట.. విజ్ఞప్తి చేయడంతోనే సోము వైఖరి తేటతెల్లమైంది.

దాడి చేసిన వ్యక్తిని ఇకపై డిబేట్‌కు పిలవబోనని చర్చా కార్యక్రమం సంధాన కర్త వెంకట కృష్ణ బల్లగుద్దీ మరీ చెప్పిన మాట నీటిమీద రాతైంది. మరుసటి రోజు పిలిచి చర్చ నిర్వహించారు. ఈ ఘటనతో ఏపీ బీజేపీలో ఆగ్రహజ్వాలలు ఎగిశాయి. ఏబీఎన్‌ను, ఆంధ్రజ్యోతి పత్రికను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

పేలవమైన ఈ తరహా స్పందనతో ఏపీ బీజేపీ మరింత పలుచనైంది. సర్వత్రా విమర్శలు రావడంతో.. దాడి ఘటనపై నిమ్మలంగా ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరో బలవంతం చేసినట్లుగా, ఇష్టంలేనట్లుగా ఈ ఘటన పట్ల ఏపీ బీజేపీ అధ్యక్షుడు వ్యవహరిస్తున్నట్లుంది.

పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో దాడి జరిగితే.. ఏపీలో ఫిర్యాదు చేయడం అత్యంత హాస్యాస్పదంగా ఉంది. ఇలాంటి కంటితుడుపు చర్యల ద్వారా సాధించేది ఏమీ ఉండదు. పార్టీలో ఏళ్ల తరబడి నుంచి ఉన్న నేత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్లే పార్టీ ఇలా వ్యవహరిస్తే.. కొత్తగా పార్టీలో చేరే వారికి అక్కడ ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పరిణామాలు బీజేపీలో చేరాలనుకునే నేతలను ఆలోచించేవిగా ఉన్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏ లక్ష్యంతో పని చేస్తున్నారో గానీ.. ఈ తరహా స్పందన వల్ల ఆయన విమర్శలపాలవడంతోపాటు పార్టీకి నష్టం చేకూరుతుందనేది కాదనలేని సత్యం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp