బీజేపీ రాష్ట్ర అధ్య‌క్ష పదవి రేస్‌లో ఆదినారాయ‌ణ‌రెడ్డి

By Sodum Ramana 16-11-2019 09:23 AM
బీజేపీ రాష్ట్ర  అధ్య‌క్ష పదవి రేస్‌లో ఆదినారాయ‌ణ‌రెడ్డి

ఇటీవ‌ల బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి త్వ‌ర‌లో భ‌ర్తీకానున్న రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని స‌మాచారం. క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు అసెంబ్లీ నుంచి ఆయ‌న మూడు ద‌ఫాలు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. 2014లో వైసీపీ త‌ర‌పున ఎన్నికైన ఆయ‌న‌, ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌తో విభేదించి టీడీపీలోకి ఫిరాయించారు. ఆ త‌ర్వాత ఆయ‌న మంత్రి ప‌ద‌విని కూడా సొంతం చేసుకున్నారు.
జ‌మ్మ‌ల‌మ‌డుగులో మొద‌టి నుంచి ప్ర‌త్యేక రాజ‌కీయ ప‌రిస్థితులు నెల‌కున్నాయి. ఇక్క‌డి నుంచి గుండ్ల‌కుంట శివారెడ్డి టీడీపీకి నాయ‌క‌త్వం వ‌హించేవారు. ఆయ‌న ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా కూడా ప‌నిచేశారు. అనంత‌రం ఆయ‌న హైద‌రాబాద్‌లో హ‌త్య‌కు గురయ్యారు. అప్ప‌ట్లో ఈ దుర్ఘ‌ట‌న తీవ్ర దుమారం రేపింది. అనంత‌రం శివారెడ్డి సోద‌రుడి కుమారుడు రామ‌సుబ్బారెడ్డి నాయ‌క‌త్వ బాధ్య‌తలు తీసుకున్నారు. ఈయ‌న కూడా చంద్ర‌బాబు హ‌యాంలో మంత్రిగా ప‌నిచేశారు.

ఆ త‌ర్వాత ఆదినారాయ‌ణ‌రెడ్డి వైఎస్ ముఖ్య అనుచ‌రుడిగా జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఆధిప‌త్యం చెలాయించ‌సాగారు. వైఎస్సార్ మ‌ర‌ణానంత‌రం కొన్నాళ్లు జ‌గ‌న్ ప‌క్షాన‌, మ‌రికొన్నాళ్లు కిర‌ణ్‌కుమార్‌రెడ్డి వెంట న‌డిచారు. వైఎస్ జ‌గ‌న్ సొంత జిల్లా జ‌మ్మ‌ల‌మడుగు నుంచి ఆయ‌న వైసీపీ త‌ర‌పునే పోటీ చేసి గెలుపొందారు.మంత్రి అనిపించుకోవాలన్నఆశతో జ‌గ‌న్‌ది పిల్లికి భిక్ష‌మెయ్య‌ని మ‌న‌స్త‌త్వ‌మ‌ని, ఎవ‌రి అభిప్రాయాలు తీసుకోర‌ని ఘాటైన విమ‌ర్శ‌లు చేసి చంద్ర‌బాబు పంచ‌న చేరారు. 2019 ఎన్నిక‌ల్లో జ‌మ్మ‌ల‌మ‌డుగు టికెట్ ద‌క్కించుకునేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డిన‌ప్ప‌టికీ, చివ‌రికి రామ‌సుబ్బారెడ్డికే టికెట్ ల‌భించింది. క‌డ‌ప ఎంపీ స్థానం నుంచి అవినాశ్‌రెడ్డిపై ఆది పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు.ఫ్యాక్ష‌న్‌కు పెట్టింది పేరైన జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఆదినారాయ‌ణ‌రెడ్డి, రామ‌సుబ్బారెడ్డి క‌ల‌యిక బెడిసి కొట్టింది. దీన్ని ఎన్నిక‌ల ఫ‌లితాలు రుజువు చేశాయి.

చంద్ర‌బాబు అండ చూసుకుని జ‌గ‌న్‌తో పాటు వైఎస్ కుటుంబంపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసిన ఆదినారాయ‌ణ‌రెడ్డికి అధికారం కోల్పోయాక అభ‌ద్ర‌త భావం పెరిగింది. దీంతో ఆయ‌న టీడీపీని వీడి బీజేపీలో చేరాల్సిన త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుత బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వీ కాలం డిసెంబ‌ర్‌లో ముగియ‌నుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండ‌టంతో అధ్య‌క్ష ప‌ద‌వికి ప్రాధాన్యం పెరిగింది. ఈ నేప‌థ్యంలో బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఆదినారాయ‌ణ‌రెడ్డి గ‌ట్టిగా కృషి చేస్తున్నార‌ని స‌మాచారం. ఆది ఓడిపోయిన‌ప్ప‌టికీ జ‌నాల్లో మంచి ప‌లుకుబ‌డి ఉంది. కార్య‌క‌ర్త‌ల కోసం ఎందాకైనా నిల‌బ‌డ‌తార‌ని ఆయ‌న‌పై న‌మ్మ‌కం ఉంది. ఏపీలో గ‌త ప‌దేళ్లుగా రెడ్ల సామాజిక‌వ‌ర్గం నుంచి బీజేపీ అధ్య‌క్షులెవ‌రూ లేరు. దీంతో ఆదినారాయ‌ణ‌రెడ్డి అభ్య‌ర్థిత్వాన్ని బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. అందులోనూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ‌ల‌ప‌డాల‌ని ప్ర‌ణాళిక రూపొందిస్తున్న బీజేపీ నాయ‌క‌త్వం క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జాబ‌లం ఉన్న నాయ‌కుడి కోసం అన్వేషిస్తుండ‌టం కూడా ఆదికి క‌ల‌సి వ‌చ్చే అంశ‌మ‌ని ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇటీవ‌ల ఆదినారాయ‌ణ‌రెడ్డి ప‌ది స్కార్పియోలు కూడా కొనుగోలు చేసిన‌ట్టు స‌మాచారం. తాను బీజేపీ అధ్య‌క్షుడిగా ఎన్నికైతే ప్ర‌తి జిల్లాలో బ‌ల‌మైన పార్టీ నేత‌ల‌ను గుర్తించి ఒక్కో వాహ‌నాన్ని ఇవ్వాల‌నేది ఆది ఆలోచ‌న‌గా ఆయ‌న వ‌ర్గీయులు చెబుతున్నారు. ఆది ప్ర‌య‌త్నాలు ఏ మాత్రం ఫ‌లిస్తాయో కాల‌మే జ‌వాబు చెప్పాలి.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News