ఆ ఇద్దరి భేటీ ఆసక్తికరం...!

By P. Kumar Aug. 07, 2020, 09:15 am IST
ఆ ఇద్దరి భేటీ ఆసక్తికరం...!

చిరంజీవి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజులు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. కొత్తగా ఏపీ బీజేపీ బాధ్యతలు చేపట్టిన వీర్రాజు ఇంటికెళ్లి మరీ చిరంజీవిని కలవడం రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ భేటీ పైకి వ్యక్తిగతంగా కనిపిస్తున్నప్పటికీ భవిష్యత్‌ బీజేపీ వ్యూహాల్లో ఇదీ ఓ భాగం కాదని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.

రాజకీయాల్లో పదవులు చేపట్టినప్పుడు అభినందనలు అందుకోవడం, ఆశీస్సులు తీసుకోవడం సహజమే. కానీ, సోము వీర్రాజు, చిరంజీవిల భేటీపై ఈ స్థాయిలో హైలెట్‌ అవ్వడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అమరావతి కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో బీజేపీ పాత్ర ఒక్కసారిగా పెరగడం, సోము వీర్రాజు ఆ పార్టీ అధ్యక్షడిగా బాధ్యతలు చేపట్టడం, సామాజికవర్గ సమీకరణాలు, బీజేపీ భవిష్యత్‌ వ్యూహాలు ఈ భేటీని ఆసక్తికరంగా మార్చేశాయి. చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా లేరు. అలాగనిఆ పార్టీతో పూర్తిగా తెగతెంపులు చేసుకోలేదు. ఇలాంటి తరుణంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చిరంజీవిని కలవడం చర్చనీయాంశమే.

చిరంజీవి కుటుంబంతో సోము వీర్రాజుకు ఈనాటిది కాదు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్‌ కళ్యాణ్‌ను నరేంద్రమోదీ వద్దకు తీసుకెళ్లింది సోము వీర్రాజే కావడం గమనార్హం. ఆ సమయంలో నరేంద్రమోదీతో సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు పవన్‌ సోము వీర్రాజుకు కృతజ్ఞతలు చెప్పడంతో అప్పటి వరకు ఏ కొద్ధి మందికో తెలిసిన ఆయన ఒక్కసారిగా రాష్ట్ర స్థాయిలో వార్తల్లోకెక్కారు.

ఇప్పటికే చిరంజీవి రాజకీయ అడుగులపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఒకసారి బీజేపీలో చేరతాడని, మరొకసారి వైఎస్సార్‌సీపీ చిరంజీవిని రాజ్యసభకు పంపించనుందని, మరోసారి తమ్ముడికి తోడుగా జనసేనలోకి వస్తున్నాడంటూ పుకార్లు షికారు చేశాయి. చిరంజీవి సైతం ఆ వార్తలను పెద్దగా ఖండించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం సినిమాలు తప్ప మరేవీ పట్టించుకొనేలా లేని చిరంజీవి భవిష్యత్‌లో పాలిటిక్స్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని డిసైడ్‌ అయితే ఏ పార్టీలోకెళ్తాడనే అంశం పెద్ద ఎత్తున డిబేట్లకు దారితీస్తుంది.

చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించి పార్టీ పెట్టినప్పుడు, ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకున్నప్పుడు సైతం ఆయన ప్రత్యర్థులపై పరుష పదజాలం ప్రయోగించిన దాఖలాలు లేవు. ఆయా రాజకీయ పార్టీల అధినేతలతో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ చిరంజీవి వాటిని వ్యక్తిగత సంబంధాలపై పడనీయకుండా జాగ్రత్త పడ్డాడు. తద్వారా పార్టీల్లోని నాయకులతో సత్సంబంధాలను నిలుపుకోగలిగాడు. మృదు స్వభావి, సౌమ్యుడు అనే ముద్ర ఉండటంతో చిరంజీవి చేరిక కేంద్రంగా వచ్చే వార్తలను ఆయా రాజకీయ పార్టీలు సైతం ఖండించలేదు.

బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించి బలపడాలని చూస్తోంది. పక్కరాష్ట్రమైన తమిళనాడునే తీసుకుంటే కుదిరితే పార్టీ అభ్యర్థిగా లేదా పొత్తులో భాగంగానేనైనా రజినికాంత్‌తో చెలిమి చే యాలని ఆశపడుతోంది. ఇదే తరహాలో ఏపీలోనూ చిరంజీవిని క్రౌడ్‌పుల్లర్‌గా బీజేపీ చూస్తుండే అవకాశం లేకపోలేదు. బీజేపీ వ్యూహం కనుక అదే అయితే భవిష్యత్‌లో చిరంజీవిని ఆ పార్టీ కథానాయకుడిగా చూసే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం ఒక ఊహాగానమే. జరుగుతుందని కానీ లేదా జరగదని గానీ గట్టిగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే రాజకీయాల్లో సమీకరణాలు ఎప్పుడు ఎలా మారతాయి అనేది ఎవరూ చెప్పలేరు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp