బీజేపీలో సస్ఫెన్షన్ల పర్వం ప్రారంభం, తొలి వికెట్ పడింది

By Raju VS Aug. 05, 2020, 09:00 pm IST
బీజేపీలో సస్ఫెన్షన్ల పర్వం ప్రారంభం, తొలి వికెట్ పడింది

ఏపీ బీజేపీలో అనుకున్నట్టుగానే ఆసక్తికర మార్పులు మొదలయ్యాయి. ఏపీ బీజేపీలో పార్టీ నిర్ణయాన్ని, అద్యక్షుడి అభిప్రాయాన్ని గౌరవించలేదనే కారణంతో ఓ నాయకుడిని సస్ఫెండ్ చేశారు. ఈ మేరకు సోము వీర్రాజు తీసుకున్న నిర్ణయంతో పార్టీ నాయకుడు ఓ వీ రమణకు నోటీసులు జారీ అయ్యాయి. గతంలో చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగి, టీడీపీ హయంలో టీటీడీ బోర్డ్ మెంబర్ గా కూడా పనిచేసిన రమణ పేరుతో తాజాగా ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైన ఆర్టికల్ పై క్రమశిక్షణా ఉల్లంఘనగా భావించి సస్ఫెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

బీజేపీలో చేరిన పలువురు మాజీ టీడీపీ నేతల తీరు మీద ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా పార్టీ నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకించే ధోరణి సహించబోమని తేల్చిచెప్పారు. అందులో భాగంగా ఇప్పటికే సూటిగా హెచ్చరికలు జారీ చేసినా కొందరు నేతల్లో మార్పు రావడం లేదని వీర్రాజు గ్రహించినట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే మూడు రాజధానుల విషయంలో బీజేపీ వైఖరిని, పార్టీ అధ్యక్షుడి హోదాలో సోము వీర్రాజు ప్రకటనలను తప్పుబడుతూ వ్యాసం రాయడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఓ వీ రమణపై సస్ఫెన్షన్ ఉత్తర్వులు వెలువడ్డాయి.

మంగళవారం నాడు ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ ఆర్టికల్ ప్రచురితం అయ్యింది. మూడు ముక్కలాటలో నష్టపోతున్న బీజేపీ పేరుతో రాసిన ఆర్టికల్ లో ఓవీ రమణ తన అబిప్రాయాలు వెల్లడించారు. రాజధాని విషయంపై పార్టీ వైఖరిని తప్పుబట్టారు. పార్టీలో ఉన్న తనలాంటి వారు ఎందరినో నిరాశ పరిచేలా ఉందన్నారు. కొత్త అధ్యక్షుడి వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయమంటూ సోము వీర్రాజుని విమర్శించారు. దానిని పరిగణలోకి తీసుకున్న బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం తీవ్ర చర్యలకు పూనుకుంది. నేరుగా సస్ఫెండ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.

ఈ పరిణామాలతో టీడీపీ పట్ల సానుకూలంగా ఉండే నేతల స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. తమ సన్నిహితుడిపై సస్ఫెన్షన్ చర్యలకు పూనుకున్న తరుణంలో అభిప్రాయ వ్యక్తీకరణకు అవకాశం లేకుండా పోయిందని అంటారా..లేక తాజా పరిణామాల ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంటారా అన్నది చర్చనీయాంశం. ఏమయినా సోము వీర్రాజు మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా దూకుడు చూపుతున్న తరుణంలో బీజేపీ వ్యవహారం రసకందాయకంలో పడుతున్నట్టుగానే చెప్పవచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp