రసవత్తరంగా మారబోతోన్న అసెంబ్లీ సమావేశాలు

By Siva Racharla 17-11-2019 10:41 AM
రసవత్తరంగా మారబోతోన్న అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 2 నుండి శీతాకాల సమావేశాలకు శాసనసభ సిద్దం అవుతోంది. 13రోజులపాటు సమావేశాలు జరుగుతాయని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించడంతో చలికాలంలో రాజకీయ వేడి రాజుకోబోతోంది. జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత ఈ సమావేశాలు జరుగుతున్నాయి. తొలుత సభ్యుల ప్రమాణస్వీకారం కోసం, బడ్జెట్ ఆమోదం కోసం సభ జరిగినప్పటికీ ఈసారి సభ గతానికి భిన్నంగా ఉంటుందని చెప్పక తప్పదు.

రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా విపక్ష టీడీపీ తీవ్ర సంక్షోభం దిశగా సాగుతోంది. సభ ప్రారంభం అయ్యేనాటికి ఆ పార్టీ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉన్న 23మందిలో వల్లభనేని వంశీ చేజారిపోయారు. పైగా టీడీపీ ని తూర్పారబెడుతున్నారు. లోకేష్ మీద గురిపెట్టి, చంద్రబాబు ని కూడా వదలకుండా వంశీ చేస్తున్న విమర్శలు టీడీపీ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ జగన్ కి జై కొట్టిన వంశీ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరం అవుతుంది. ఈలోగానే రాజీనామా చేసి ఉప ఎన్నికల శంఖారావం పూరిస్తారా లేక అసెంబ్లీ సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ వంశీ సభలో అడుగుపెట్టి, ఇదే రీతిలో టీడీపీ మీద విమర్శలు గుప్పిస్తే ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతుంది. గతంలో వైసిపి తరుపున గెలిచిన ఆదినారాయణ రెడ్డి, జ్యోతుల నెహ్రూ వంటి వారితో జగన్ మీద ఆయన పరోక్షంలో కూడా విమర్శలు చేయించిన చంద్రబాబు కి వంశీ వ్యవహారం మింగుడుపడే అవకాశం లేదు.
ఈలోగా గంటా శ్రీనివాసరావు విషయంలో కూడా స్పష్టత వస్తుందని చెబుతున్నారు. అదే జరిగితే గంటా వెంట ఎవరైనా ఉంటారా లేక ఆయన ఒంటరిగా తనదారి తాను చూసుకుంటారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఏమైనా ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ ని వీడుతున్నట్టు క్లారిటీ వచ్చేయడంతో ఈ నెలాఖరు నాటికి మరికొందరు కూడా క్యూ కట్టడం ఖాయమని రాజకీయ పరిశీలకుల అంచనా. దాంతో చంద్రబాబు విపక్ష2హోదా ఈసారికైనా మిగులుతుందా లేక అసలుకే ఎసరు వస్తుందా అన్నది కూడా ప్రశ్నర్ధకం గా తయారయ్యింది.

ఏమైనా మొదటి సమావేశాల్లోనే టీడీపీ నేతల మీద దూకుడుగా వ్యవహరించిన పాలకపక్ష సభ్యులు ఈసారి మరింత రెచ్చిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈకాలంలో సభ వెలుపల విపక్షం చేసిన విమర్శలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలకు తగిన రీతిలో కౌంటర్ ఇవ్వాలనే ఆలోచనలో వైసిపి నేతలున్నారు. ఇప్పటికే స్పీకర్ ని అవమానించారంటూ నారా లోకేష్ సహా ముగ్గురు టీడీపీ నేతలపై ఫిర్యాదు చేయడం దానికో సూచికగా కనిపిస్తోంది. ఈ పరిణామాలతో రాబోయే సమావేశాలు మరింత హాటుహాటుగా సాగుతాయనడంలో సందేహం కనిపించడం లేదు. సంఖ్యరీత్యా నే కాకుండా తాజా పరిణామాల తర్వాత మానసికంగా కూడా సమస్యల్లో ఉన్న టీడీపీ ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News