ఆరోగ్య రాజధానిగా ఆంధ్రప్రదేశ్...

By Suresh May. 06, 2021, 08:52 pm IST
ఆరోగ్య రాజధానిగా ఆంధ్రప్రదేశ్...

తిండి కలిగితేనే కండగలదు..కండ కలవాడే మనిషోయ్ అన్నాడు..గురజాడ...కానీ ఇఫ్పుడు ఆరోగ్యకరమైన సమాజం ఉంటేనే అభివృద్ధివంతమైన సమాజం అవుతుందని, ఆధునిక సిద్ధాంతకర్తలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని జగన్ ప్రభుత్వం ఆరోగ్యరంగం, విద్యారంగంపై పెడుతున్న శ్రద్ధ ఇప్పుడిప్పుడే ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. గతంలో ఆసుపత్రుల్లో ఎలుకలు కొరికి చిన్నారులు చనిపోయిన పరిస్థితుల నుంచి బయటపడి ప్రస్తుతం ఇంటింటికి వైద్యం అనే స్థాయికి చేరుకుంది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం ఇప్పుడు ఏపీలో మరింత ముందుకు సాగుతోంది. ఇటీవలే కన్నుమూసిన నిమ్స్ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు, ఓ ఇంటర్వ్యూలో చెబుతూ యూనివర్సల్ హెల్త్ స్కీం అనేది ఉంటేనే దేశ ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు కల్పించవచ్చని తెలిపారు. అంతేకాదు అలాంటి పథకానికి ఆరోగ్య శ్రీ యే ఉదాహరణగా చెప్పారు.

ప్రపంచంలోనే టాప్ రేడియాలజిస్టులో ఒకరైన కాకర్ల సుబ్బారావు, ఈ పథకాన్ని గుర్తించి పొగిడారంటే దాని విలువను గుర్తించవచ్చు. విద్య, వైద్యంపై ప్రభుత్వాలు ఖర్చు పెట్టడం ద్వారానే మిలీనియం గోల్స్ సైతం సాధించవచ్చని అటు ఐక్యరాజ్యసమితి కూడా సూచనలు చేసింది. అభివృద్ధి చెందిన దేశాలైన చైనా, ఆస్టేలియా, జపాన్, అమెరికా వంటి దేశాలు వైద్య రంగంపైనే అత్యధికంగా తమ ఖర్చును పెడుతున్నాయి. మానవవనరులను తయారు చేసే వైద్య, విద్యారంగాలపై ఖర్చు చేయడం సమంజసమని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు అమర్త్య సేన్ లాంటి వారు కూడా సూచించారు. ప్రస్తుతం ఏపీలోని అమ్మఒడి పథకం, అలాగే ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సులు దేశానికే ఆదర్శం అవుతున్నాయి.

ఇక కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొనేందుకు సైతం సీఎం జగన్ ముందు చూపు చాలా ఉపయోగపడింది. 108, 104 అంబులెన్సుల వ్యవస్థను పటిష్టపరచడం ద్వారా, రోగులను సకాలంలో వైద్యం అందించడంలో చాలా సహాయపడుతన్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేసిక్ లైఫ్ సపోర్టు అంబులెన్సులలో స్పైన్‌ బోర్డు, స్కూప్‌ స్ట్రెచర్, వీల్‌ ఛైర్, బ్యాగ్‌ మస్క్, మల్టీ పారా మానిటర్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇక పరిస్థితి విషమంగా ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో ఏఎల్‌ఎస్‌ అంబులెన్సులలో అత్యాధునిక వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. ఇక చంటిపిల్లల కోసం నియోనేటల్‌ అంబులెన్సులలో ఇన్‌క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను అమర్చారు. దేశంలో కేరళను వైద్య రంగంలో ముందు వరుసలో ఉందని అంతా అంటుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మోడల్, అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్‌ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే 30 నిమిషాల్లో అంబులెన్సులు చేరే విధంగా సర్వీసులు అందిస్తున్నారు. ఇక మొదటి వేవ్ సందర్భంలోనే దేశంలోనే అత్యధిక టెస్టులు చేయడంలో ఏపీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. అలాగే కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చిన ఘనత కూడా జగన్ సర్కారుదే కావడం విశేషం. ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్ కొరతను కూడా అధిగమించేందుకు ఏపీ సర్కారు యుద్ధప్రాతిపదికన విదేశాల నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసేందుకు సిద్ధమైంది. విదేశాల్లో ఆక్సిజన్ సరఫరా చేసే వారి వివరాలు సేకరించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇలా ఏపీ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp