అదానీ రావడం లేదని నాడు - వచ్చేస్తున్నాడని నేడు, ఆంధ్రజ్యోతి అక్కసు రాతలు

By Raju VS Sep. 22, 2021, 03:45 pm IST
అదానీ రావడం లేదని నాడు - వచ్చేస్తున్నాడని నేడు, ఆంధ్రజ్యోతి అక్కసు రాతలు

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏదయినా మంచి కార్యక్రమం చేస్తున్న సమయంలో దానికి సంబంధిత వ్యతిరేక కథనాలు ప్రచురించడం ఆంద్రజ్యోతికి అలవాటు. అదే చంద్రబాబు పాలనలో అయితే దానికి భిన్నంగా ఉంటుంది. కానీ టీడీపీయేతర పార్టీల ప్రభుత్వాలు గద్దెమీదున్న సమయంలో పాఠకులను గందరగోళపరచడమనేది ఆంధ్రజ్యోతికి పెద్ద అలవాటు. అందులోనూ జగన్ ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి విషయాల్లో సమ ప్రాధాన్యతతో సాగుతుండడం అసలు గిట్టని సదరు సంస్థ మరింత రెచ్చిపోతోంది. దేశ స్వతంత్ర్య అమృతోత్సవ్ సందర్భంగా ఏపీలో వాణిజ్య ఉత్సవ్ జరిగింది. దేశ, విదేశాల ఎగుమతిదారులు హాజరయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెరిగిన తీరు మీద ప్రశంసలు కురిపించారు.

దేశంలో అందరికన్నా ఏపీ వెనుకబడిపోయిందని నిత్యం కొండంతరాగం తీస్తున్న ఆంధ్రజ్యోతి అంచనాలకు భిన్నంగా దేశంలో ఎగుమతుల విషయంలో ఏపీ 4వ స్థానానికి చేరుకుంది. గతంలో 9వ స్థానంలో ఉన్న రాష్ట్రంలో ఇటీవల తీసుకున్న నిర్ణయాలు సత్పలితాన్నిస్తున్నాయి. కరోనా పరిస్థితుల్లో కూడా ఏపీ నుంచి ఎగుమతులు 14.1 బిలియన్‌ డాలర్ల నుంచి 16.8 బిలియన్‌ డాలర్లకు అంటే 19.4 శాతం వృద్ధి చెందాయి.

2018–19లో ఎగుమతుల్లో రాష్ట్రం 9వ స్థానంలో ఉండగా 2019–20లో 7వ స్థానానికి చేరుకుంది. 2020–21లో నాలుగో స్థానానికి చేరుకుంది ఏపీ నుంచి ఆక్వా ఉత్పత్తులు, బియ్యం సహా వివిధ రకాల ఎగుమతులు వేగవంతమయ్యాయి. దాంతో కరోనా సమయంలో కూడా దేశంలో ఎగుమతులు పడిపోయినా ఏపీ నుంచి మాత్రం అనూహ్యంగా పెరుగుదుల నమోదయ్యింది. దానికి అనుగుణంగా జగన్ ప్రభుత్వ చొరవను పలువురు ప్రశంసించారు. వివిధ దేశాలకు చెందిన ఎగుమతిదారులు కూడా ఏపీ ప్రభుత్వ తీరుని అభినందిస్తూ మరింత పెట్టుబడులు , ఎగుమతులకు సన్నద్ధమవుతున్నట్టు ప్రకటించారు.

Also Read : హెరాయిన్ కేసులో నిందితుడు సుధాకర్ ఎవరు?అతని వెనక ఎవరున్నారు?

ఇది ప్రజలు గుర్తిస్తే ఆంధ్రజ్యోతి అసలు లక్ష్యానికి విఘాతం కలుగుతుంది. అందుకే తాజాగా అదానీ ని ఆంధ్రా సూరీడు అంటూ ఓ అడ్డగోలు కథనం అచ్చేసింది. నిజానికి ఇదే అదానీ కి చెందిన డేటా సెంటర్ విశాఖ నుంచి తరలిపోయిందని ఆంధ్రజ్యోతి చేయని రచ్చ లేదు. అప్పుడు అదానీ సహా పెట్టుబడిదారులంతా రాష్ట్రాన్ని వదలిపోతున్నారని గగ్గోలు పెట్టిన సంస్థ ఇప్పుడు ఏపీలో అదానీ హవా పెరిగిపోతోందని వాపోవడం అంటే ఆ మీడియా సంస్థ రెండు నాలుకల ధోరణి ఇట్టే అర్థమవుతుంది. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతానికి, అతడి పచ్చ మీడియా రెండు నాలుకల సిద్ధాంతం తోడయినట్టుగా ఈ పరిణామాలు చాటుతున్నాయి. అదానీ డేటా సెంటర్ విషయంలో సందిగ్ధ పరిస్థితులు చూసి ఇంకేముంది, వెళ్లిపోయినట్టేనని నానా హంగామా చేసి, నేడు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి అదానీ సంస్థ రావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడం చదివేవాళ్లకే ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం నిస్సిగ్గుగా రాతలు రాసేస్తోంది.

ఏపీలో పెట్టుబడులు రావడం లేదని ఓ వైపు చెబుతూనే, అదే నోటితో పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ వక్రభాష్యాలు అల్లడం ఏదయితే ఉందో నభూతో నః ఆంధ్రజ్యోతి అన్నట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబు ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని, ఆయన ఓటమి తర్వాత అంతా తరలిపోతున్నారని నోటికొచ్చిందల్లా రాసేసిన జ్యోతి ఇప్పుడు చిత్రంగా అదానీ ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారంటూ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుని ఉదాహరణగా చూపడం విశేషంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించి, ఏపీ ప్రభుత్వం సోలార్ ప్రాజెక్టుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటుంది. దానిని కూడా జ్యోతి తప్పుబడుతూ రాతలు రాస్తోంది. ఒకవేళ ఏపీ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుని ముందుకెళితే దానిని చంద్రబాబు న్యాయస్థానాల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఏపీ ప్రభుత్వం ఏం చేసినా ఏదో పేరుతో బద్నాం చేసేందుకు అనుగుణంగా మొత్తం యంత్రాంగం ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందులో ఆంధ్రజ్యోతి సహా కొన్ని మీడియా సంస్థలు పెద్ద గొంతెత్తి అరిచే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది.

Also Read : హెరాయిన్- ఆంధ్రప్రదేశ్ : బోడిగుండుకు మోకాలికి ముడిపెడుతున్న ఓ వర్గం మీడియా

ఏపీలో పెట్టుబడులకు తాజా ఆంధ్రజ్యోతి కథనమే ఓ ఉదాహరణ. వివిధ సంస్థలు ఏపీ వైపు వస్తున్నాయనడానికి ఇదో సంకేతం. ఇప్పటికే కేజీ బేసిన్ లో రిలయెన్స్ సంస్థ కార్యకలాపాలు సాగుతుండగా, తాజాగా అదానీ సంస్థ వివిధ పెట్టుబడులు పెడుతుండడంతో దేశఃలో రెండు పెద్ద కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇక ఆంధ్రజ్యోతి సహా పచ్చ మీడియా ఏడుపులు వింటూనే ఏపీలో పెట్టుబడుల ప్రవాహం చూడాల్సి వస్తుందేమో అనేటంత వాతావరణం ఏర్పడుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp