అంబేద్కర్‌ విగ్రహం విషయంలో టీడీపీ నేతలు ఆ విషయం మరచిపోతున్నారా..?

By Kotireddy Palukuri Jul. 11, 2020, 03:11 pm IST
అంబేద్కర్‌ విగ్రహం విషయంలో టీడీపీ నేతలు ఆ విషయం మరచిపోతున్నారా..?

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణ విషయంలో టీడీపీ నేతలు ఓ మౌలిక విషయం విస్మరించి జగన్‌ సర్కార్‌పై విమర్శలు చేస్తున్నారు. 2017 ఏప్రిల్‌ 16వ తేదీన బి.ఆర్‌.అంబేద్కర్‌ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 2019 మే వరకూ ఆయన అధికారంలో ఉన్నారు. అంటే విగ్రహా ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన తర్వాత రెండేళ్లు అధికారంలో ఉన్నారు. మరి 125 అడుగుల విగ్రహం నిర్మించేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి ఆ సమయం సరిపోలేదా..? అనే మౌలిక ప్రశ్న ఇక్కడ ఎదురువుతోంది.

ప్రతి దాన్ని రాజకీయం, ఓట్ల కోణంలో చూసే చంద్రబాబు అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన కూడా రాజకీయాల్లో భాగంగానే చూశారా..? అంటే అవుననేలా ఓ సంఘటన ఆ సమయంలో జరిగింది. 2016 ఏప్రిల్‌ 16 నాటికి బి.ఆర్‌.అంబేద్కర్‌ జన్మించి 125 వసంతాలు పూర్తయ్యాయి. ఆ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌.. 125వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఆ సమయంలో చంద్రబాబు ఈ విషయం మరిచిపోయారో.. లేక ఆలోచన రాలేదోగానీ అంబేద్కర్‌ చిత్రపటానికి ఓ దండ వేసి నివాళులర్పించారు. అయితే కేసీఆర్‌ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తానని ప్రకటించడంతో తాను వెనకబడిపోయానని గ్రహించిన చంద్రబాబు 2017లో అంబేద్కర్‌ 126వ జయంతి సందర్భంగా అమరావతిలో 20 ఎకరాల స్థలంలో అంబేద్కర్‌ స్మృతి వనంతోపాటు 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామని ఘనంగా ప్రకటించారు. అయితే అటు కేసీఆర్‌.. ఇటు చంద్రబాబు ఆ తర్వాత తాము చెప్పిన మాటను మరచిపోయారు.

తాజాగా సీఎం జగన్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఉన్న స్వరాజ్‌ మైదానంలో ఏర్పాటుకు సంకల్పించి ఈ నెల 8వ తేదీన శంకుస్థాపన కూడా చేశారు. ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పారు. ఇలా జగన్‌ శంకుస్థాపన చేశారో.. లేదో టీడీపీ నేతలు విమర్శల దాడి మొదలుపెట్టారు. మాజీమంత్రి నక్కా ఆనంద్‌ బాబు, టీడీపీ తరఫున మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వర్ల రామయ్య తదితరులు అంబేద్కర్‌ విగ్రహం చంద్రబాబు శంకుస్థాపన చేసిన చోటనే నిర్మించాలని డిమాండ్‌ చేయడం మొదలుపెట్టారు. తమ డిమాండ్‌ను అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కూడా చేస్తామని హెచ్చరిస్తున్నారు.

తనకు రాజ్యసభ సీటు ప్రకటించి ఆ తర్వాత గంటల్లోనే తూచ్‌.. లేదని చెప్పిన చంద్రబాబును అభినవ అంబేద్కర్‌ అని కొనియాడిన వర్ల రామయ్య... శంకుస్థాపన చేసిన తర్వాత రెండేళ్లు అధికారంలో ఉన్నా కూడా అంబేద్కర్‌ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదో తమ అధినేతను అడిగే ప్రయత్నం అయినా చేశారా..? కనీసం ఇప్పుడైనా చేస్తే.. ప్రజలు హర్షిస్తారు. వర్ల రామయ్య, నక్కా ఆనంద్‌ బాబుల తీరు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తీరు మాదిరిగా ఉంది. ఆయన కూడా చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీని జగన్‌ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్‌ చేసి రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి తెరలేపారు. ఇలాగే వీరు కూడా సోమిరెడ్డి బాటలోనే నడుస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం ఏడాదిలో విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఏడాదిలో ఆ పని చేయకపోతే అప్పుడు విమర్శలు చేయవచ్చు. ఫలితంగా టీడీపీ నేతలు ఆశించిన ఫలితం కూడా దక్కుతుంది. ఇప్పుడు చేయడం వల్ల మీడియాకు న్యూస్‌ ఫీడ్‌ తప్పా ఒరిగేది ఏమీ లేదు. పైగా అంబేద్కర్‌ విగ్రహం విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేస్తామంటే వ్యతిరేకిస్తున్నారనే కోణంలో నష్టం కూడా జరగే ప్రమాదం లేకపోలేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp