ఎప్పుడూ ప్రసంగాలేనా.. లెక్కలెప్పుడు తేలుస్తారు.. మంత్రి గారు..?

By Kotireddy Palukuri Jan. 21, 2020, 07:30 am IST
ఎప్పుడూ ప్రసంగాలేనా.. లెక్కలెప్పుడు తేలుస్తారు.. మంత్రి గారు..?

తమను చట్టసభలకు పంపిన ప్రజలు తాము ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో అన్నది నిత్యం గమనిస్తుంటార్న సృహ లేకుండా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతున్నారు. రాజకీయ పరమైన ఆరోపణలు అయితే పెద్దగా పట్టించుకోరు. కానీ ముఖ్యమైన, అదీ ఆర్థిక పరమైన అంశాలపై తప్పకుండా ఎప్పటికైనా ప్రజల నుంచి ప్రశ్నల తాకిడి తప్పదు. రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో సేకరించిన విరాళాలపై అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ ప్రజా ప్రతినిధుల ప్రకటనలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.

రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రజల నుంచి వివిధ రూపాలలో విరాళాలు సేకరించింది. బంగారం, నగదు, పొలం రూపంలో ఈ విరాళాలు వచ్చాయి. మొన్నటి వరకు ఈ మొత్తం ఎంత వచ్చాయో తెలిదంటూ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, మీడియా ప్రశ్నించడంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుదు వాటి లెక్క విప్పారు. అమరావతి పరిరక్షణ పేరుతో రాజమహేంద్రవరంలో నిర్వహించిన బస్సు యాత్రలో ఎంత మొత్తం వచ్చాయన్న వివరాలు మొదటి సారిగా వెల్లడించారు. 57 కోట్ల రూపాయాలు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. వెంటనే అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఆ మొత్తం ఎక్కడున్నాయో తెలియదంటూ మంత్రి కన్నబాబు సెలవిచ్చారు.

తాజాగా నిన్న జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో అమరావతి బ్రిక్స్‌ పేరున 58 లక్షల ఇటుకలు సేకరించారని వ్యవసాయ మంత్రి కన్నబాబు సభలో ప్రస్తావిచారు. అయితే ఆ ఇటుకలు ఎక్కడున్నాయో తెలిదన్నారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నా అమరావతి.. నా ఇటుక పేరుతో ఒక్కొక్క ఇటుక 10 రూపాయల చొప్పున ఆన్‌లైన్‌లో విక్రయించింది. అమరావతి నిర్మాణంలో తాము కూడా భాగస్వాములవ్వాలనే ఉద్దేశంతో ప్రజలు ఆ మొత్తం ఆన్‌లైన్‌లో చెల్లించారు. 10 రూపాయల చొప్పున 58 లక్షల ఇటుకలకు 5.8 కోట్ల రూపాయలు సమకూరాయి.

అయితే ఈ మొత్తం కూడా ఎక్కడుంతో తెలియదని మంత్రి కన్నబాబు సభలో తెలిపారు. 57 కోట్ల విరాళాలు, ఇటుకల పేరుతో 5.8 కోట్ల రూపాయలు.. ఇవన్నీ కూడా అమరావతి నిర్మాణం కోసం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సేకరించింది. ఇది ప్రభుత్వం అధికారికంగానే చేసింది. అయితే ఈ మొత్తం ఎక్కడుందో తెలియదంటూ మంత్రి మాట్లాడడం విడ్డూరంగా ఉంది.

ఈ మొత్తం ఎక్కడుందో తెలియకపోతే.. తెలుసుకుని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. కానీ దీనికి విరుద్ధంగా తెలియదంటూ మాట్లాడితే ప్రజలు హర్షించరన్న విషయం గుర్తుంచుకోవాలి. విరాళాలు, ఇటుకల విక్రయం రూపేన మొత్తం 65.8 కోట్ల రూపాయల లెక్క తేల్చి... ఈ మొత్తం ఎవరి వద్ద ఉన్నా స్వాధీనం చేసుకుంటేనే ప్రభుత్వ విశ్వసనీయత మరింత పెరుగుతుంది. లేదంటే ఏన్నాళ్లయినా ప్రజల మరచిపోరు. ఎప్పటికైనా సమాధానం చెప్పాల్సిన సమయం వస్తుందన్నది సత్యం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp