Amalapuram Ex MLA - జెడ్పి పీఠంపై ఆశతో జెడ్పిటిసిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్..!

By Prasad Oct. 16, 2021, 12:00 pm IST
Amalapuram Ex MLA - జెడ్పి పీఠంపై ఆశతో జెడ్పిటిసిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్..!

జెడ్పీ పీఠంపై ఆశతో జెడ్పీటీసీగా పోటీ... భారీ తేడాతో ఓటమి... అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పదవికే ఎసరు తెచ్చేలా ఉంది. పరిషత్‌ ఎన్నికల ముందు పోటీ నుంచి తప్పుకోవాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. కాని అమలాపురం నియోజకవర్గ పరిధిలో ఆ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులు సీరియస్‌గానే తలపడ్డారు. నియోజకవర్గ పరిధిలో ఫలితాలు ఊహించని విధంగా రావడం టీడీపీ నాయకులకు మింగుడుపడడం లేదు. ఇదే సమయంలో తమ పార్టీ ఇన్‌చార్జి ఆనందరావు జెడ్పీటీసీ అభ్యర్థిగా నామామాత్రపు పోటీ కూడా ఇవ్వకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే అదనుగా ఆనందరావును ఇన్‌చార్జిగా మార్చాలనే పల్లవి అందుకున్నారు.

ఆనందరావు అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు టీడీపీ తరపున పోటీ చేసి ఒక్కసారి మాత్రమే గెలుపు సాధించారు. తొలిసారి 2009లో పోటీ చేసినా ఆయన కేవలం 23,185 ఓట్లతో మూడవస్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2014లో మరోసారి పోటీ చేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గొల్ల బాబూరావు మీద 12 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. తిరిగి 2019 ఎన్నికల్లో ప్రస్తుత రాష్ట్రమంత్రి పినిపే విశ్వరూప్‌ చేతిలో ఏకంగా 25,654 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. గత సాధారణ ఎన్నికల నాటి నుంచి కాలం ఆయనకు కలిసిరావడం లేదు. గత ఎన్నికల్లో సిటింగ్‌ ఎమ్మెల్యే అయినప్పటికీ పార్టీ సీటు తెచ్చుకునే విషయంలోనే ఆయన అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. అతని గెలుపుపై నమ్మకం లేకపోవడంతో చివరి వరకు పార్టీ టిక్కెట్‌ ఇవ్వలేదు. ఆనందరావుకు నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందనే నివేదికలకు తోడు, నాటి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వర్గం వ్యతిరేకించడం వంటి కారణాలతో ఆయనకు టిక్కెట్‌ దక్కుతుందనే నమ్మకం సొంత అనుచరవర్గానికి కూడా లేకుండా పోయింది.

నాటి ఎన్నికల్లో అమలాపురం పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసిన దివంగత లోక్‌సభ స్పీకర్‌ జి.ఎం.సి.బాలయోగి కుమారుడు జి.హరీష్‌ మాధుర్‌ను అసెంబ్లీకి పోటీ చేసించాలని రాజప్ప భావించారు. పార్లమెంట్‌ నుంచి తమ అభ్యర్థిగా పోటీలో నిలిపేందుకు మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్‌ను అప్పటికప్పుడు పార్టీలోకి తీసుకువచ్చారు. కాని మాజీమంత్రి, స్వర్గీయ మెట్ల సత్యనారాయణరావు తనయుడు మెట్ల రమణబాబుతోపాటు పార్టీ సమన్వయ కమిటీలో మెజార్టీ నాయకులు పట్టుబట్టడంతో ఆనందరావుకు తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు టిక్కెట్‌ కేటాయించారు. ఇదే కాకుండా సమయం వచ్చినప్పుడల్లా తన సహచర మంత్రి రాజప్పను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు పార్టీ సీనియర్‌ నాయకుడు, నాటి ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు చేసిన యత్నాల్లో భాగంగా ఆనందరావుకు టిక్కెట్‌ వచ్చింది.

Also Read : Mangalagiri Lokesh లోకేష్ ఇలాఖాలో టీడీపీకి షాక్.. ఎంపీపీ డౌటే?

గురు, శిష్యులైన రాజప్ప, ఆనందరావులకు ఎన్నికల ముందు చెడిన బంధం నేటికీ కొనసాగుతూనే ఉంది. రాజప్ప వర్గం, ఆనందరావుల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. నియోజకవర్గంలో రాజప్ప వర్గానికి అతని సోదరుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు నాయకత్వం వహిస్తుండగా, ఆనందరావుకు మెట్ల వర్గం కొమ్ముకాస్తుంది. మండలాల్లో కూడా పార్టీ క్యాడర్‌ రెండుగా చీలిపోయింది. ఇది కాస్తా గ్రామాల వరకు పాకిపోతుంది.


ఆనందరావు ప్రాదేశిక ఎన్నికల్లో అమలాపురం మండలం నుంచి జెడ్పీటీసీగా బరిలో నిలిచారు. తూర్పు జెడ్పీ చైర్మన్‌ పదవి ఎస్సీలకు రిజర్వ్‌ కావడంతో ఆయన ఆ పదవి ఆశించారు. తెరవెనుక పొత్తుల్లో భాగంగా జనసేన అభ్యర్థి జెడ్పీటీసీ బరిలో లేకుండా చూసుకున్నారు. ఇందుకోసం కొన్ని ఎంపీటీసీ స్థానాలను కూడా వదులుకున్నారు. ఇక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే జెడ్పీటీసీగా బరిలో దిగుతున్నారనే భయం కాని, పోటీ ఉంటుందేమోననే ఆందోళనకాని అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తొలి నుంచి లేదు. ఆనందరావుకు సైతం ఎన్నికల గోదాలోకి దిగిన తరువాత కాని తత్వం బోధపడలేదు. ఎన్నికల ముందు పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా చంద్రబాబు ప్రకటించడం ఆనందరావు నెత్తిన పాలుపోసినట్టయ్యింది.

కాని నియోజకవర్గంలో ఆ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు యధావిధిగా పోటీ చేశారు. ముమ్మరంగా ప్రచారం చేశారు. కొన్నిచోట్ల ఓటర్లకు లక్షల్లో సొమ్ములు వెదజల్లారు. ఇంత చేసినా ఆ పార్టీకి ఘోరమైన ఫలితాలు వచ్చాయి. నియోజకవర్గ పరిధిలో 61 ఎంపీటీసీ స్థానాలకు గాను రెండు ఏకగ్రీవం కాగా, ఆ రెండు వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. మిగిలిన 59 స్థానాలకు గాను వైఎస్సార్‌సీపీ 42 స్థానాలను చేజిక్కించుకున్నాయి. రెండవ స్థానంలో జనసేన 11 స్థానాలు గెలుచుకోగా, టీడీపీ కేవలం 6 ఎంపీటీసీలకు మాత్రమే పరిమితమైంది.

Also Read : Tdp President - అచ్చెన్నాయుడు వార్నింగ్స్

ఆనందరావు ఓటమి మరీ దారుణం. ఇక్కడ వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి పి.శ్రీహరి రామ్‌గోపాల్‌కు ఏకంగా 17,280 ఓట్ల మెజారిటీ రావడం విశేషం. ఇదే సమయంలో ఆనందరావుకు వచ్చిన ఓట్లు కేవలం 10,946 కావడం ఇక్కడ గమనార్హం. సొంత మండలం ఉప్పలగుప్తంలో సైతం ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయి. ఇక్కడ టీడీపీ కేవలం రెండు స్థానాలకు పరిమితమైంది. ఆనందరావు సొంత గ్రామం ఎస్‌.యానాంలో ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెట్టా అప్పారావు ఏకంగా 862 ఓట్ల భారీ మెజార్టీతో గెలవడం ఆనందరావు వర్గానికి మింగుడు పడని అంశంగా మారింది. ఇటువంటి ఫలితాలు వస్తాయని ముందే ఊహించే పోటీ నుంచి తప్పుకుంటామని పరువు నిలబెట్టుకున్నారని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. పోటీలో లేమని చెప్పుకున్నా ప్రయోజనం లేదని, గట్టిగా పోరాడిన మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం ఇవే ఫలితాలు వచ్చాయని వారు గుర్తు చేస్తున్నారు.


అమలాపురం నియోజకవర్గంలో టీడీపీకి సాధారణ ఎన్నికల్లో కనీసం గౌరవప్రదమైన ఓట్లు వచ్చాయి. ఇక్కడ జనసేన బలంగా ఉన్నా టీడీపీ అభ్యర్థిగా ఆనందరావు ద్వితీయస్థానంలో నిలిచారు. తరువాత పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. మున్సిపల్‌ ఎన్నికల్లో కనీసం పోటీలో ఉన్నారా? లేదా అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఈ ఎన్నికల్లో జనసేన 6 స్థానాలు గెలవగా, టీడీపీ నాలుగు స్థానాలకు పరిమితమైంది. తాజా ప్రాదేశిక ఎన్నికల్లో కూడా టీడీపీ మూడవస్థానానికి పరిమితమైంది. వైఎస్సార్‌సీపీ, జనసేన బలంగా పోటీపడిన స్థానాల్లో టీడీపీకి మరీ దారుణంగా రెండు అంకెల ఓట్లు రావడం విశేషం. ఉదాహరణకు ఉప్పలగుప్తం మండలంలో నాలుగు ఎంపీటీసీ స్థానాల్లో కేవలం 50 లోపు ఓట్లు మాత్రమే వచ్చాయి. జనసేన బలంగా ఉన్నచోట టీడీపీ నామమాత్రంగా లేకపోవడం ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి రానురాను దిగజారిపోతుండడంతో ఆనందరావు వ్యతిరేకవర్గాల గళం పెరుగుతుంది. నియోజకవర్గ ఇన్‌చార్జిను మార్చాలనే డిమాండ్‌ జోరందుకుంటుంది.

Also Read : Kapu Corporation - ఎంతో చేసిన టీడీపీని కాపులు ఎందుకు తిరస్కరించారో?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp