సుప్రీంకోర్టు స్పందన పై సర్వత్రా ఆసక్తి, తీర్పు తర్వాత ఏం జరుగుతుంది..

By Raju VS Jan. 24, 2021, 03:00 pm IST
సుప్రీంకోర్టు స్పందన పై సర్వత్రా ఆసక్తి, తీర్పు తర్వాత ఏం జరుగుతుంది..

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వివాదాస్పదమయ్యాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఏకపక్ష వైఖరి, ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కారణంగా ఏడాది కాలంలో వివాదం కొనసాగుతోంది. తాజాగా అది తీవ్రమయ్యింది. దాదాపు చివరి అంకానికి చేరినట్టు కనిపిస్తోంది. మరో రెండు నెలల వ్యవధిలో పదవీ విరమణ చేయాల్సిన నిమ్మగడ్డ తనహయంలోనే ఎన్నికలు జరగాలనే మంకుపట్టుతో వ్యవహరించడం చర్చనీయాంశం అవుతోంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతున్న దశలో ఇలాంటి వైఖరి చుట్టూ దుమారం సాగుతోంది. చివరకు ప్రభుత్వ అభ్యంతరాలు, ఉద్యోగుల సహాయ నిరాకరణ మధ్య నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఇచ్చేసి హైదరాబాద్ వెళ్లిపోవడం ఆసక్తికరంగా మారింది.

సోమవారం నాడు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్ట్ స్పందించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలయిన తరుణంలో ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఎస్ఈసీ అనుకూల వర్గాలు ఆశిస్తున్నాయి. గతంలో కేరళ ఎన్నికల్లో వాయిదాకి అంగీకరించలేదు కాబట్టి, ఈసారి కూడా అదే జరుగుతుందని జోస్యం చెబుతున్నారు. తోలుత అప్పట్లో తీర్పు ఇచ్చిన జస్టిస్ లావు నాగేశ్వర రావు బెంచ్ మీదనే ఇదే కేసు ఉన్నా రిజిస్టర్ వేరే బెంచ్ ముందు రీ లిస్ట్ చేయడంతో ఈ కేసు విచారణ జస్టిస్ సంజేయి కిషన్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు రాబోవడం గమనార్హం.

ఎస్ఈసీ అనుకూల వర్గాలు ఆశిస్తున్నట్టు జరిగితే ఏపీలో ఎన్నికల కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఆశాభంగం అవుతుంది. ఆందోళన పెరుగుతుంది. అయినప్పటికీ ఎన్జీవోలు, ఇతర ప్రభుత్వ సిబ్బంది ఏమేరకు ఉంటుందన్నది సందేహమే. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న పోలీసులు, ప్రభుత్వ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వకుండా ఎన్నికలు అంటే ససేమీరా అంటున్నారు. చుట్టూ కరోనా గ్లాస్ షీల్డ్ పెట్టుకుని ప్రెస్ మీట్ నిర్వహించిన నిమ్మగడ్డ తమను మాత్రం జనంలోకి వెళ్లాలని ఆదేశించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే సమ్మెకి కూడా వెనుకాడబోమని చెబుతున్నారు. దాంతో సిబ్బంది తోడ్పాటు లేకుండా ఎన్నికల నిర్వహణ అసాధ్యంగా మారుతుందని చెప్పవచ్చు.

సుప్రీంకోర్టు దానికి భిన్నంగా వ్యాక్సినేషన్ కి ప్రాధాన్యతనిచ్చినా ఆశ్చర్యం లేదు. కేరళలో స్థానిక ఎన్నికల తర్వాత కరోనా కేసులు పెరిగిన తరుణంలో అక్కడి అనుభవాన్ని గమనంలో ఉంచుకుని తీర్పు వెలువడే అవకాశం కూడా లేకపోలేదు. అదే జరిగితే ఏపీలో పరిస్థితి అంతా సజావుగా మారుతుంది. రెండు నెలల తర్వాత ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అవుతుంది. సమస్యలు లేకుండా స్థానిక ఎన్నికలు జరపడానికి ముందే కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఉద్యోగులు, ప్రభుత్వం , పోలీసులు కూడా శాంతించే అవకాశం ఉంటుంది.

ఈ రెండింటిలో ఏం జరుగుతుందన్నది చర్చనీయాంశమే. ఎన్నికలే జరపాల్సిన పరిస్థితి వస్తే రాష్ట్రంలోని 13,371 గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్‌ పదవులకు, 1.34 లక్షల వార్డు మెంబర్‌ పదవులకు పోలింగ్ ఎలా పూర్తి చేస్తారన్నది ప్రశ్నగా మారుతోంది. ఇప్పటికే తమకు నిధులు , సిబ్బంది లేరని వాపోతున్న ఎస్ఈసీ ఆ తర్వాత ఎలా నెట్టుకు వస్తారన్నది చూడాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం హైదరాబాద్ తరలించిన బ్యాలెట్ బ్యాక్సులు కూడా ఇంకా తీసుకురాలేదు. వాటి పరిస్థితి ఏమిటన్నది కూడా అనుమానమే. అన్నింటికీ మించి 2019 ఓటర్ లిస్ట్ ప్రకారం ఎన్నికలు జరుపుతానంటున్న తరుణంలో సుమారు 3.6లక్షల మంది యువ ఓటర్ల హక్కులు ఏమవుతాయన్నది కూడా ఇప్పుడు కీలకాంశం అవుతుంది. దీనిపై కూడా తాజాగా రాష్ట్ర హై కోర్టులో గుంటూరు కు చెందిన విద్యార్థిని ధూళిపాళ్ల అఖిల హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp