పోరాట ఫలం.. ఆ మహిళా నేతకు పీఠం

By Ramana.Damara Singh Jul. 22, 2021, 11:30 am IST
పోరాట ఫలం.. ఆ మహిళా నేతకు  పీఠం

మొక్కవోని దీక్షతో పోరాడితే ఫలితం దానంతట అదే లభిస్తుందనడానికి ప్రత్యక్ష నిదర్శనం అక్కరమాని విజయనిర్మల. భీమిలికి చెందిన ఈ మహిళా నేత వైఎస్సార్సీపీలో చేరింది మొదలు పార్టీ ఉన్నతికి.. టీడీపీ నేతల ఆగడాలను ఎదుర్కొనేందుకు పోరాటం చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకోలేకపోయినా ఏ మాత్రం కుంగిపోకుండా పార్టీ కోసం చేసిన శ్రమే ఆమెకు గుర్తింపునిచ్చింది. ఫలితం చూపించింది. ప్రతిష్టాత్మక విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) అధ్యక్ష పదవి వరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిపిన నియామకాల్లో భాగంగా విజయనిర్మలను ఈ పదవిలో నియమించింది.

16 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో..

గ్రాడ్యుయేషన్ చేసిన అక్కరమాని విజయనిర్మల భీమిలికి చెందినవారు. 2005లో టీడీపీ ద్వారా క్రియాశీల రాజకీయాలలోకి వచ్చిన ఆమె తొలి ప్రయత్నంలోనే అప్పటి భీమిలి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలరుగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే మున్సిపల్ ఉపాధ్యక్షురాలిగా కూడా ఎన్నికయ్యారు. 2008లో అప్పటి మున్సిపల్ చైర్ పర్సన్ కొప్పుల ప్రభావతిపై సొంత టీడీపీ కౌన్సిలర్లే అవిశ్వాసం ప్రకటించి పదవి నుంచి దించేశారు. దాంతో వైస్ చైర్ పర్సన్ గా ఉన్న విజయనిర్మల ఇంఛార్జి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. పదవీ కాలం పూర్తి అయ్యేవరకు.. 18 నెలలు ఆ పదవిలో ఉన్నారు. 

2012లో అక్కరమాని, ఆమె భర్త వెంకటరావు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. అప్పటి నుంచి వారు భీమిలి నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. వెంకట్రావు పార్టీ భీమిలి పట్టణ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 2015లో విజయనిర్మల భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులయ్యారు. నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేసేందుకు ఈ దంపతులు ఎంతో శ్రమించారు. పార్టీ పిలుపిచ్చిన అన్ని కార్యక్రమాలను సొంత వనరులు వెచ్చించి నిర్వహించారు.

Also Read : ఇచ్ఛాపురం.. మూడు పదవుల వరం

సామాజికవర్గ పరంగానూ మంచి పట్టున్న విజయనిర్మలను గత ఎన్నికల్లో పార్టీ అంతర్గత సర్దుబాట్లలో భాగంగా భీమిలి కాకుండా విశాఖ తూర్పు నియోజకవర్గ టికెట్ ఇచ్చారు. అయినా నిరాశ చెందకుండా అక్కరమాని దంపతులు విజయం కోసం తుది వరకు తీవ్రంగా పోరాడి ఓడిపోయారు. అయితే పార్టీ అధికారంలోకి రావడంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ.. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అక్రమాలపై పోరాటం సాగిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా మున్సిపల్ ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గ పరిధిలో 10 మంది కార్పొరేటర్లను గెలిపించికొని సత్తా చాటారు. వీరి కష్టాన్ని, పోరాటాలను గుర్తించిన పార్టీ ఊహించని బహుమతి అందించింది.

ప్రతిష్టాత్మక పదవి

వీఎంఆర్డీఏ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక సంస్థ. మెట్రో నగరంగా ఎదుగుతున్న విశాఖ మహా నగరపాలక సంస్థ(జీవీఎంసీ)తో పాటు విజయనగరం, భీమిలి, అనకాపల్లి పట్టణాలు, చుట్టుపక్కల మరో 287 గ్రామాలను కలిపి 1721 చదరపు కిలోమీటర్ల పరిధిలో ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టడం, నిర్వాహణ ఈ సంస్థ బాధ్యతలు. ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే వందల కోట్ల విలువైన పనులు ఈ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. విశాఖ కార్యనిర్వాహక రాజధాని అవుతున్న తరుణంలో వీఎంఆర్డీఏ ప్రాధాన్యత మరింత పెరిగింది. ద్రోణంరాజు శ్రీనివాస్ వంటి సీనియర్లు నిర్వహించిన ఈ పదవిని.. ఎంతోమంది పోటీ పడినా కాదని మరీ అక్కరమాని విజయనిర్మల ఇవ్వడం విశేషం.

Also Read : మొదట తండ్రిని తరువాత కూతురిని వరించిన ఆ పదవి .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp