మోడీ మంత్రివర్గం నుంచి మంత్రి రాజీనామా, వ్యవసాయ బిల్లుకి వ్యతిరేకంగా నిరసన

By Raju VS Sep. 18, 2020, 07:00 am IST
మోడీ మంత్రివర్గం నుంచి మంత్రి రాజీనామా, వ్యవసాయ బిల్లుకి వ్యతిరేకంగా నిరసన

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ , వ్యవసాయ బిల్లుల మూలంగా రైతులకు అన్యాయం జరుగుతుందంటూ క్యాబినెట్ మంత్రి ఆందోన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకి నిరసనగా తన పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన శిరోమణి అకాలీదళ్ కి చెందిన ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఈ విషయాన్ని ధృవీకరించారు.

పార్లమెంటులో ప్రభుత్వం ఈ బిల్లులు ప్రవేశపెట్టిన బిల్లుల నేపథ్యంలో మంత్రి రాజీనామా చర్చనీయాంశం అయ్యింది. ఇప్పటికే ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ లో తీవ్ర నిరసనలు కూడా జరుగుతున్నాయి. తొలుత ఆమె రాజీనామా అంశాన్ని ఎస్ ఏ డీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ సభలోనే ప్రకటించారు. దానికి అనుగుణంగా ఆమె రాజీనామా చేసినట్టు ప్రకటించారు.

రెండు వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా సుఖ్బీర్ సింగ్ బాదల్ తన ప్రసంగంలో కేంద్రం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. యాభై ఏళ్లుగా నిర్మించిన వ్యవసాయరంగాన్ని నాశనం చేసేలా కేంద్రం ప్రతిపాదిత బిల్లులున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్ధతు ధర విషయంలో ప్రభుత్వ బాధ్యతనుంచి తప్పించుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం అకాలీదళ్ కి లోక్ సభలో ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. కాగా వారిద్దరూ భార్య భర్తలయిన సుఖ్ బీర్ సింగ్, హర్సిమ్రత్ కావడం విశేషం. ఎన్డీయే లో భాగస్వామిగా ఉన్న ఆపార్టీ తరుపున క్యాబినెట్ లో హర్సిమ్రత్ కి చోటు దక్కింది. ఆమె 2009లో భటండీ స్థానం నుంచి తొలిసారి విజయం సాధించారు. 2014 తర్వాత కూడా ఆమె మోడీ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు.

నిత్యావసర సరుకుల సవరణ బిల్లు తో పాటుగా రైతుల ఉత్పత్తి వాణిజ్యం మరియు వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు, వ్యవసాయ సేవల బిల్లుపై అకాలీదళ్ వ్యతిరేకంగా ఉంది. ఇప్పటికే ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ ఫిరోజ్ పూర్ ఎంపీ సుఖ్ బీర్ సింగ్ లోక్ సభలో తన ఓటు వేశారు. అయితే ఇప్పటికే దిగువ సభ ఆమోదం పొందింది. పంజాబ్ రైతాంగంలో పట్టున్న పార్టీగా అకాలీదళ్ స్థానికంగా రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో చివరకు క్యాబినెట్ నుంచి వైదొలగాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే ఎన్డీయే లో కొనసాగుతారా లేదా అన్న విషయంపై ఆపార్టీ స్పష్టత ఇవ్వలేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp