మేలుకోకపోతే ముప్పే..!

By Jaswanth.T Oct. 30, 2020, 10:02 am IST
మేలుకోకపోతే ముప్పే..!

కాలుష్యం.. ఇది సామాన్యులకు అర్ధం కాని బ్రహ్మపదార్ధం. ఎందుకంటే నేరుగా తమపై పడే ఫలితాలు ప్రభావం తెలిసే పరిస్థితి ఉండదు. దీంతో మనకు తెలియకుండానే కాలుష్యానికి కారణమవుతుంటాం. ఇళ్ళ నుంచి పోగయ్యే చెత్తను రోడ్లమీద పడేసి, వాటిని తగలబెడితే మనవంతు వాతావరణ కాలుష్యం పెంచుతున్నట్టే లెక్క. అయితే ఇటువంటి కాలుష్యభరిత చర్యలను గురించి అవగాహన కల్పించడం గానీ, అడ్డుకట్ట వేయడానికి గానీ పకడ్భంధీగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టిన దాఖలాలు ఇప్పటి వరకు లేవనేచెప్పాలి.

పరిశ్రమలు, ఇతర కాలుష్య ఉత్పత్తికారకాలపై కాలుష్యనియంత్రణ బోర్డు అధికారులు నామమాత్రపు పర్యవేక్షణ మాత్రమే ఇప్పటి వరకు ఉంది. దీంతో సామాన్యులు తమను ఇబ్బందిపెట్టే కాలుష్యాన్ని గుర్తించినప్పటికీ దానిని గురించి ఫిర్యాదులు చేసినాగానీ పెద్దగా ప్రయోజనం కలిగిన దాఖాల్లేవు. ముఖ్యంగా వాయుకాలుష్యం విషయంలో నిబంధనల అమలు మరీ పలుచగానే ఉందన్న అభిప్రాయం సర్వత్రా విన్పిస్తుంటుంది.

దీంతో పలు చిన్న, మధ్యతరహా కర్మాగారాలు, కాలపరిమితి తీరిపోయిన వాహనాలు తదితరవాటి ద్వారా యధేశ్చగా వాయు నాణ్యతను దెబ్బతీయడం జరిగిపోతోంది. ఇది ఎంతగానంటే ఒక పరిమిత వాతావరణ పరిస్థితుల్లో గాల్లో ఆక్సిజన్‌ స్థాయి కూడా తగినంత లేనివిధంగా మారిపోతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాల్లోనూ ఈ వాయుకాలుష్య తీవ్రత నిర్ణీత ప్రమాణాలను ఎప్పుడో దాటిపోయిందని సంబంధిత రంగ నిపుణులు గగ్గోలు పెడుతుంటారు. వీరికి పర్యావరణ ప్రేమికులు తోడొస్తుంటారు. అయినప్పటికీ నియంత్రణ చర్యలు చేపడుతున్న దాఖలాల్లేవు.

ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) 50 పాయింట్లకంటే తక్కువగా ఉండాలి. అయితే దేశ వ్యాప్తంగా మెజార్టీప్రాంతాల్లో దీనికి కొన్ని రెట్లు అధికంగానే నమోదవుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీని కారణంగా ప్రజలు ఊపిరితీసుకోవడంలో ఇబ్బందులతోపాటు, ఇతర సంబంధిత వ్యాధుల భారిన పడుతున్నట్టు చెబుతున్నారు.

ఫ్యాక్టరీలు, వాహనాలు, చెత్తను తగలబెట్టడం, వ్యవసాయ వ్యర్ధాలకు నిప్పుపెట్టడం.. ఇలా చెప్పుకుంటూ పోతే వాయుకాలుష్యానికి మన చుట్టూ కన్పించే కారణాలే వందల్లో ఉంటాయంటే అతిశయోక్తికాదు. వీటిని నియంత్రించాల్సిన యంత్రాంగం కూడా ఇప్పటివరకు మొద్దునిద్దర్లోనే ఉంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందన్న వార్తలు వస్తున్నాయి. వాయుకాలుష్యానికి కారణమైన వారికి భారీగా జరిమానాలు, జైలు శిక్షలు విధించే విధంగా ఆర్డినెన్స్‌ను జారీ చేసినట్టు చెబుతున్నారు. పర్యవేక్షణకు ప్రత్యేక బృందాన్ని కూడా సిద్ధం చేస్తోందంటున్నారు. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణకు ఒక పెద్ద ముందడుగు పడిందనే చెప్పాలి. ఇప్పటి వరకు తీవ్ర నిర్లక్ష్యం కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడంతోపాటు, విలువైన ప్రకృతి కూడా దెబ్బతిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా మేలుకోవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp