అస్తమించిన దీపం అదృష్టదీపక్

By Voleti Divakar May. 16, 2021, 08:00 pm IST
అస్తమించిన దీపం అదృష్టదీపక్

సాహిత్య దీపాన్ని సమాజానికి అందించిన అదృష్ట దీపక్ అస్తమించారు . శ్రీశ్రీ తరువాత ఆస్థాయిలో అభ్యుదయ రచనలు చేసిన ఆయన కరోనాతో కన్నుమూశారు . పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న సామెత అభ్యుదయ రచయిత అదృష్టదీపక్ విషయంలో అక్షరాలా నిజం . ప్రజానాట్య మండలి , అభ్యుదయ రచయితల సంఘం , ఇతర ప్రజాసంఘాలతో అనుబంధం తనలో ఉత్తేజాన్ని నింపిందని ఆయన చెప్పేవారు . ఊహ తెలిసినప్పటి నుంచి ఎర్రజెండా తన ఊపిరిలో భాగమైందని అదృష్టదీపక్ చెప్పుకున్నారు . వామపక్ష భావాల్లో పుట్టి పెరిగిన అదృష్టదీపక్ 1950 జనవరి 18 న తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించారు . అదృష్ట దీపలన్న అరుదైన నామధేయాన్ని మేనమామే ఆయనకు పెట్టారు . తన మేనమామ స్ఫూర్తి , ప్రోత్సాహంతో సాహిత్య , నాటక రంగాల్లోకి ప్రవేశించారు . రావులపాలెంలో ప్రాధమిక విద్యను పూర్తి చేసిన అదృష్టదీపక్ తరువాత రామచంద్రపురంలో విఎస్ఎం కళాశాలలో చరిత్రలో ఎంఏపూర్తి చేశారు . పక్కనే ఉన్న ద్రాక్షారామలోని పివిఆర్ కళాశాలలో 25 ఏళ్ల పాటు చరిత్ర అధ్యాపకుడిగా పనిచేశారు .

రంగస్థలం నుంచి సాహిత్యరంగంలోకి ...

పిల్లల బొమ్మల భారతం పుస్తకం ఆయన జీవిత గమనాన్నే మార్చివేసిందని చెప్పవచ్చు . ఐదో తరగతిలో ఉండగా మంచి మార్కులు సాధించిన అదృష్టదీపక్ కు ఉపాధ్యాయుడు వేంకట పార్వతీశ్వర కవులు రచించిన పిల్లల బొమ్మల భారతం పుస్తకాన్ని బహుమతిగా అందించారు . అప్పటి నుంచి ఆయన పాఠ్యేతర పుస్తకాల పఠనంలో ఆసక్తి పెరిగింది . అలాగే తండ్రి బంగారయ్య పాడే రామదాసు కీర్తనలు , జానపద గీతాలు ఆయనలో స్ఫూర్తిని రగిలించాయి . శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం , మూడు యాభైలు , ఆరుద్ర రచించిన కూనలమ్మ పదాలు చదివి సాహిత్యంలో ప్రేరణ పొందారు . తన రచనల్లో వ్యంగానికి తన తండ్రే స్ఫూర్తి అని చెబుతారు . అలాగే మేనమామ సినిమా పాటల బాణీలతో రాసిన రాజకీయ గీతాల కరపత్రాలు తనను కవిగా , కళాకారుడిగా తయారుచేశాయని చెప్పేవారు . 1957 లో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడినపుడు మాచవరంలో జరిగిన విజయోత్సవ సభలో అదృష్టదీపక్ బుర్రకథలు చెప్పే ఆయన మేనమామ ఆయనతో పాటపాడించారు . ఈ సంఘటన అదృష్టదీపక్ లో ఆత్మసైర్యం పెరిగి , రంగస్థలం వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించింది . ఏడేళ్ల వయస్సులోనే ఆచార్య ఆత్రేయ రచించిన కప్పలులో బాలనటుడిగా రంగస్థల ప్రవేశం చేశారు . గొల్లపూడి మారుతీరావు రచించిన అనంతంలో అనంతపాత్ర , ఆశయాలు సంకెళ్లు నాటికలో బెనర్జీ పాత్ర , ఆదివిష్ణు రచించిన మంచుతెరలో సాంబశివరావు , చలపతి పాత్రలు అదృష్టదీపక్కు మంచి పేరు తెచ్చిపెట్టాయి . ఎన్నో నాటక పరిషత్తుల్లో ఉత్తమ నటుడు , హాస్యనటుడు వంటి అవార్డులు సొంతం చేసుకున్నారు .

చౌచౌలో మొదటి రచన

1962 లో రాజమహేంద్రవరం నుంచి వెలువడే చౌచౌ అనే మాసపత్రికలో అదృష్టదీపక్ తొలి రచన ప్రచురితమైంది .జోకర్ , బుడుగు , నవ్వులు పువ్వులు , పకపకలు తదితర హాస్యపత్రికల్లో ఆయన రచనలు ప్రచురితమయ్యాయి . కోకిలమ్మ పదాలు , అగ్ని , సమరశంఖం , ప్రాణం , అడవి , దీపకరాగం , ఆశయాల పందిరిలో , శ్రీశ్రీలో తీరనిదాహం , అదృష్టదీపక్ కథలు , తెరిచిన పుస్తకం తదితర రచనలు చేశారు . ఆతరువాత అనేక ప్రముఖ పత్రికల్లో ఆయన రచనలు ప్రచురితమయ్యాయి . సప్తతి సందర్భంగా దీపం
పేరిట ప్రముఖుల వ్యాసాలతో ప్రత్యేక సంకలనాన్ని విడుదల చేశారు . సాక్షి దినపత్రిక ఆవిర్భావం నుంచి పదశోధన పేరిట ప్రత్యేక శీర్షికను నిర్వహించారు . ఉదయం పత్రికలో పద సంపద శీర్షికను నిర్వహించారు .

సినీ గేయరచయితగా ...

సాహిత్యంతో పాటు సినీరంగంలో కూడా అభ్యుదయ భావాలతో కూడిన గీతాలనే అదృష్టదీపక్ రాశారు . రెడ్ స్టార్ మాదాల రంగారావు నిర్మించిన యువతరం కదిలింది చిత్రంలో ఆశయాల పందిరిలో గీతంతో సినీరంగ ప్రవేశం చేశారు . విప్లవశంఖం , నేటి భారతం , దేశంలో దొంగలు పడ్డారు , ఎర్రమందారం , ప్రజాస్వామ్యం , నవభారతం , భారతనారీ , అన్న , దేవాలయం , మా ఆయన బంగారం , వందేమాతరం , అర్ధరాత్రి స్వతంత్రం తదితర చిత్రాల్లో గీత రచనలు చేశారు.నేటిభారతంలో మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం పాటకు ఉత్తమ గేయ రచయితగా కళాసాగర్ అవార్డును పొందారు . అదృష్టదీపక్ శ్రీశ్రీ , గల మల్లారెడ్డి , చాసో , రాచమల్లు రామచంద్రారెడ్డి , చందు సుబ్బారావు , స్మైల్ , చెరబండ రాజు , సి నారాయణరెడ్డి తదితర ప్రముఖ సాహితీవేత్తలతో అనుభవాలను తెరిచిన పుస్తకం పేరిట ఆవిష్కరించారు .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp