ఆధార్ చిరునామా మార్పు క‌ష్టాలకు చెల్లు

By iDreamPost.com Nov. 14, 2019, 09:13 am IST
ఆధార్ చిరునామా మార్పు క‌ష్టాలకు చెల్లు

అన్నింటికీ ఆధార్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని సుప్రీంకోర్టు ఒక‌టికి పదిసార్లు చెప్పిన‌ప్ప‌టికీ క్షేత్ర‌స్థాయిలో అమ‌లు అంత ఆశాజ‌న‌కంగా లేదు. తుమ్మినా ద‌గ్గినా ఆధార్ చూపాల్సిన దుస్థితి. ఆధార్‌లో త‌ప్పుల‌ను స‌రిదిద్దుకోవాలంటే ఆ బ్ర‌హ్మ‌దేవుడు దిగిరావాల్సిన ప‌రిస్థితి. ఒక్కోసారి విసిగేసి ఈ ఆధార్ వ‌ద్దురా బాబూ అని చిరాకు చెందిన వారు లేక‌పోలేదు.

ముఖ్యంగా ఉద్యోగులు ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి ఆధార్‌ను మార్పు చేసుకోవాల్సి వ‌స్తోంది. దీని కోసం ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి వ‌స్తోంది. ఆధార్ మార్పు కోసం క‌రెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, బాడుగ ఇంటి అగ్రిమెంటో...వీటిలో ఏదో ఒక‌టి స‌మ‌ర్పించాల్సి వ‌చ్చేది. కొంద‌రు ఇంటి య‌జ‌మానులు అగ్రిమెంట్ ఇచ్చేందుకు స‌సేమిరా అంటారు. ఇంటిని బాడుగకు ఇవ్వ‌డ‌మైనా మానేస్తారేమో గానీ,  ఎట్టిప‌రిస్థితుల్లోనూ అగ్రిమెంట్ ఇవ్వ‌రు.

ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికి ప‌రిష్కారం చూపుతూ కేంద్ర‌ప్ర‌భుత్వం ఆధార్ చిరునామా మార్పున‌కు కేవ‌లం ల‌బ్ధిదారులు సొంతంగా ఒక లేఖ ఇస్తే స‌రిపోతుంద‌ని ఆదేశాలిచ్చింది. ఇది ఆధార్‌కార్డుదారుల‌కు ఎంతో ఊర‌టనిచ్చే అంశం. ఎందుకంటే ఏదైనా స‌మ‌స్య త‌మ‌దాకా వ‌స్తే త‌ప్ప దాని తీవ్ర‌త అర్థం కాదు. ప‌నులు మానేసి రోజుల త‌ర‌బ‌డి ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌, నానా అగ‌చాట్లు ప‌డుతున్న వారికి కేంద్రం నిర్ణ‌యం ప్ర‌శంస‌నీయం. 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp