అదాని వస్తే మంచిదే.. అక్షరం నిలబడుతుంది

By Aditya Sep. 23, 2021, 08:00 pm IST
అదాని వస్తే మంచిదే.. అక్షరం నిలబడుతుంది

ఆడపిల్ల వయసు, మగాడి జీతం, పత్రిక సర్క్యులేషను అడగకూడదంటారు. అవి గుట్టుగా ఉంటేనే గౌరవం. గుట్టుగా ఇన్నాళ్లు నెట్టుకురాగలిగిన పత్రికారంగ వ్యాపారం ఇకపై ముందుకు సాగడం కష్టం అనేట్టుగా పరిస్థితి దిగజారింది. మూలిగే నక్కపై తాటిపండన్నట్టు అసలే నష్టాలతో కునారిల్లిన ఈ రంగాన్ని కరోనా కూడా దెబ్బకొట్టింది.

విచిత్రమైన వ్యాపారం..

ఏ వ్యాపారంలోనైనా అమ్మకాలు పెరిగే కొద్దీ లాభాలూ పెరుగుతాయి. బహుశా ఒక్క పత్రికా రంగంలోనే అమ్మకాలు విపరీతంగా పెరిగితే ఆ స్థాయిలో నష్టం పెరుగుతుంది. ఇందుకు కారణం దాని ఉత్పత్తి వ్యయానికి అమ్మకం ధరకు పొంతన లేకపోవడమే. ఒక పేపరు తయారు కావడానికి అయ్యే ఖర్చులో నాలుగో వంతు కూడా దాని ధర ఉండదు. మిగిలిన సొమ్మును ప్రకటనల రూపంలో సమకూర్చుకుని పత్రికలు మనుగడ సాగిస్తాయి. వచ్చే ప్రకటనల ఆదాయానికి అనుగుణంగా సర్క్యులేషను ను ఉండేలా చూసుకోవాలి. అలాకాకుండా ప్రకటనలు తగ్గి సర్క్యులేషను పెరుగుతూ పోతే నష్టమూ పెరుగుతుంది. అయితే తగినంత సర్క్యులేషను లేకుంటే ప్రకటనలు రావు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇన్నాళ్లు పత్రికలు నడిచాయి. కానీ ఆ రంగంలో వచ్చిన పెెడ ధోరణి వాటి ఉనికికే ముప్పు తెచ్చింది. ప్రకటనల కోసం ప్రభుత్వాలకు అనుకూల వైఖరి తీసుకోవడం మొదలైన తరువాత క్రమంగా జనంలో విశ్వసనీయత కోల్పొయాయి.

తెలుగులో మరీ వింత పోకడలు..

తెలుగునాట ఈనాడు అనుసరించిన విధానాలు కూడా పత్రికల ఎదుగుదలపై  ప్రభావం చూపాయి. తనకు సమీపంలో మరే పత్రిక బతికి బట్ట కట్టకూడదనే పంతంతో అది సాగించిన వ్యాపార పోకడలు ఎన్నో చిన్న పత్రికల గొంతు నులిమేశాయి. జిల్లా ఎడిషన్లు తేవడం, రంగుల్లో ముద్రణ, అవసరానికి మించి ప్రచురణ కేంద్రాలు నెలకొల్పడం వంటి చర్యల వల్ల ఇతర పత్రికలు దానికి పోటీ ఇవ్వలేకపోయాయి. నిర్వహణ వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. పత్రికపై లాభాల మాట అటుంచి నష్టం రాకుండా నడపటం ఎలాగో మిగతా పత్రికలకు అర్థంకాని పరిస్థితి. రామోజీ తన కింగ్‌ మేకర్‌ తెలివితేటలతో, ఇతర మార్గాల్లో వచ్చిన ఆదాయంతో ఇక్కడ వచ్చిన నష్టాలను పూడ్చుకునేవారు. ఈ తెలివితేటలు అందరికీ సాధ్యం కావు కనుక మిగతావారు వెనుకబడ్డారు. దానాదీనా పత్రికా రంగ నిర్వహణను ఆయన కాస్ట్లీ గ మార్చేశారు. ఉదయం, వార్త, సూర్య వంటి పత్రికలు ఇలాంటి గొంతు కోత పోటీ వల్లే దెబ్బతిన్నాయి.

Also Read : Zee గ్రూపుని కొనుగోలు చేసిన Sony, దేశంలోనే అతి పెద్ద నెట్ వర్క్ గా ఆవిర్భావం

ఇప్పటి కష్టాలకు కారణం..

కరోనా విజృంభణతో పత్రికలు కొనేవారు కరువయ్యారు. పత్రికను ముట్టుకుంటే కరోనా అంటుకుంటుంది అని భయపడ్డారు. చాలామంది ఉపాధి అవకాశాలు కోల్పోవడంతో అన్ని పత్రికల సర్క్యులేషన్‌ తగ్గింది. ప్రకటలన ఆదాయం దాదాపు శూన్యమైంది. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం స్వల్ప వ్యవధిలో న్యూస్‌ప్రింట్‌ ధర నాలుగురెట్లు పెరిగే స్థాయిలో దిగుమతి సుంకాలను పెంచేసింది. ఇది దేశవ్యాప్తంగా పత్రికల నిర్వహణను దెబ్బతీసింది. పాఠకులు వెబ్సైటుల వైపు మళ్లు తుండడం కూడా సర్క్యులేషన్ లపై ప్రభావం చూపింది. ఇన్నాళ్లూ పత్రికలను అడ్డం పెట్టుకుని సంపాదించిన రూ.వేల కోట్ల ఊసెత్తకుండా పత్రికల నిర్వహణ కష్టమైందంటూ యాజమాన్యాలు కొత్త పల్లవి అందుకున్నాయి. సిబ్బందికి జీతాలు ఇవ్వడం వల్లే నష్టం వస్తున్నట్టు అవి భావించాయి. జీతాల్లో కోత విధించాయి. పేజీలు తగ్గించాయి. సిబ్బందిని తొలగించాయి. ఉన్న సిబ్బందిలో ఇంకా ఎంత మందిని తొలగిస్తారోనన్న భయాన్ని సృష్టించాయి.

గొడ్డు చాకిరీలు.. గొర్రెతోక జీతాలు

ఇది ముప్పయేళ్ల కిందటి మాట. కాలమ్‌ సెంటీమీటర్‌కు రూపాయి పావలా చొప్పున లెక్కగట్టి నెలకోసారి స్ట్రింగర్లకు డబ్బు చెల్లించేవారు. అప్పట్లో నా కంట్రిబ్యూషన్‌కు మొదటి నెలలో వచ్చింది 88 రూపాయలు. అదీ చెక్కు రూపంలో. బ్యాంకు అకౌంట్‌ లేని నేను ఆ సొమ్ము తీసుకోవడానికి అర్జంట్‌గా ఖాతా తెరవడం.. అందుకు 30 రూపాయలు ఖర్చు కావడం. మిగిలిన సొమ్ము తీసుకోవడం ఓ వింత అనుభూతి. ఇంతోటి జీతానికి చెక్కు కూడానా అని నా మిత్రులు ఆట పట్టించారు కూడా! అయితే ఆదాయం తక్కువైనా పాత్రికేయ జీవితంలో అప్పట్లో గౌరవం, సంతృప్తి ఉండేది.

Also Read : హెరాయిన్ కథలో విజయవాడ తర్వాత ఇప్పుడు కృష్ణపట్నం

ఆ గౌరవం కోసమే ఈ వృత్తిని ఒక వ్యసనంగా మార్చుకుని దానికి బానిసలైపోయి బతుకుతున్నవారు ఎందరో. కుటుంబం గడిచే ఆదాయం రాకపోయినా ప్రెస్‌ అనే పదానికే ఇంప్రెస్‌ అయిపోయి అలా బుక్‌ అయిపోయారు. వారి బలహీనతను ఆసరాగా చేసుకొని సర్క్యులేషన్‌, అడ్వర్‌టైజ్‌ మెంట్‌లకు టార్గెట్‌లు ఇచ్చి మరీ వారిని కలెక్షన్‌ ఏజెంట్లుగా యాజమాన్యాలు మార్చేశాయి. రానురానూ ప్రెస్‌ అంటే గౌరవం తగ్గిపోయింది. నెలకు కనీసం రూ.రెండు వేలు కూడా రాని విలేకరులు రాష్ట్రంలో వేలల్లో ఉన్నారు. అయినా వారు ఆ వృత్తిని వదలరు. ఎందుకంటే వారు ఇంకో పని చేయలేనంతగా ఈ పనిలో ఇంకిపోయారు! ఇక పత్రిక ఆఫీసుల్లో పనిచేసే వారిది అదే పరిస్థితి. అన్ని విభాగాల్లోనూ శ్రమ దోపిడీయే. గొడ్డు చాకిరీలు.. గొర్రెతోక జీతాలు.

పోర్టులున్న వారికి ఫోర్త్‌ ఎస్టేట్‌ కష్టమా?

ఇప్పటికే టాటాలు, అంబానీలు మీడియాలో పెట్టుబడులు పెట్టగా తాజాగా అదానీలు సిద్ధపడుతున్నారని వినికిడి. మూడున్నర లక్షల కోట్లకు పైగా ఆస్తితో దేశంలో రెండో అత్యంత ధనవంతుడిగా ఎదిగిన అదానీ నష్టాల్లో ఉన్న ఈ రంగంలోకి ఎందుకు రావాలనుకుంటున్నారో.  పోర్టులను, ఎయిర్‌పోర్టులను, సెజ్‌లను టేకోవర్‌ చేసుకుంటూ వస్తున్నవారికి ఫోర్త్‌ ఎస్టేట్‌ నిర్వహణ ఒక లెక్కా!

మరి భావ ప్రకటనా స్వేచ్ఛ?

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అదానీ వస్తే మీడీయా రంగానికి ఒరిగేదేమైనా ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. అలాంటి పెట్టుబడిదారులు ఫక్తు వ్యాపార ధోరణితో ఉంటారని, ప్రభుత్వ పక్షం వహిస్తారని అంటున్నారు. భావప్రకటనా స్వేచ్ఛకు అవకాశం ఉండదని వాపోతున్నారు. ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ ఇప్పుడు మాత్రం ఉందా? అందుకే మాజీ సీఎం వైఎస్సార్ అంటుండేవారు పత్రికా స్వేచ్ఛ ఉన్నది యాజమాన్యాల కేగాని పాత్రికేయులకు కాదని. గొంగట్లో తింటూ ఏరుకోవడం ఎందుకు? అదానీయో.. మరొకరో.. స్వదేశీయో.. విదేశీయో.. ప్రింటో, ఎలక్ట్రానికో.. డిజిటలో నాలుగు రకాలుగా పెట్టుబడులు ఈ రంగంలోకి వస్తే ఈ పని తప్ప మరేదీ చేయలేని వాళ్ళైనా బతుకుతారు. రానివ్వండి తప్పేముంది? 

Also Read : ఈనాడు ఉద్యోగుల రిటైర్మెంట్ నిజంగానే స్వచ్చందమా ?
 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp