సంక్రాంతి పోరులో చట్టం.. సాంప్రదాయం.. ఏది గెలవబోతోంది..?

By Kotireddy Palukuri Jan. 11, 2020, 02:31 pm IST
సంక్రాంతి పోరులో చట్టం.. సాంప్రదాయం.. ఏది గెలవబోతోంది..?

సంక్రాంతి పండుగకు ఇక రెండు రోజులే సమయం ఉంది. ఉభయగోదావరి జిల్లాలో జరిగే కోడిపందేలు ఈ సారి కూడా జరుగుతాయా..? లేదా ఈ సారైనా చట్టం గెలుస్తుందా..? అన్నది మరో రెండు రోజుల్లో తేలిపోతుంది. ఎప్పటిలాగే ఈ ఏడాదికి కోడి పందేలు నిషేధం అంటూ పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. కోడి పందేలు నిర్వహించినా, బరులకు స్థలం ఇచ్చిన వారిపై కూడా కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు.

ఇక పందేంరాయుళ్లు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఏర్పాట్లలో నిమగ్నమైయున్నారు. ఏటా పోలీసులు చేప్పే మాటలే కదా అని లైట్‌ తీసుకుంటున్నారు. పండగకు ముందు ఇలా ప్రచారం చేయడం పండగ మూడు రోజులు చూసి చూడనట్లు ఉండడంతో ఎలాగైనా పందేలు జరిగుతాయన్న ధీమాలో ఉన్నారు. ఇప్పటికే పందేలు జరిగే సమీపంలోని పట్టణాల్లో లాడ్జి రూములు మూడు రోజులకు బుకింగ్‌ అయ్యాయి.

కోడి పందేల నిర్వహణకు ఆసక్తి చూపుతూ సాఫీగా జరిగేందుకు కోర్టుల్లో కూడా పిటిషన్లు వేసిన చరిత్ర కలిగిన రఘురామకృష్ణం రాజు ఇప్పుడు అధికారపార్టీ ఎంపీగా ఉన్నారు. ఇటీవల కోడి పందేలు తమ సాంప్రదాయమంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా మంత్రి శ్రీరంగనాథరాజు కోడిపుంజులను పట్టుకుని కత్తుల్లేకుండా సాంప్రదాయ పద్ధతిలో పందేలు జరగాలంటూ అభిలషించారు.

అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల తీరు ఇలా ఉంటే.. మరో వైపు వైఎస్సార్‌సీపీ సర్కార్‌ ఇప్పటికే అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపింది. పేకాట క్లబ్బులను మూసేయించింది. ఇప్పుడు కోడి పందేల విషయంలో కూడా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాల రాజు పోలీసులు, రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ పందేలు జరగడానికి వీల్లేదంటూ, ఎవరైన అతిక్రమిస్తే అరెస్ట్‌లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

పోలీసులు పందేలు జరిగే గ్రామాల్లో ముందస్తుగా ప్రచారం చేస్తున్నారు. కోడిపందేలు, ఆ సమయంలో నిర్వహించే జూదాలు నిషేధమంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో పోలీసు, రెవెన్యూ, గ్రామ సచివాలయం ఉద్యోగులతో గ్రామ, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. ఇలాంటి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తూ కోడిపందేలా నిషేధంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేస్తోన్న తరుణంలో చివరి నిమిషంలో ఎప్పటిలాగే సాంప్రదాయం గెలుస్తుందా..? లేక ఈ సారి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చట్టం గెలుస్తుందా..? వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp