ఆస్పత్రికి అచ్చెం నాయుడు

By Karthik P Jul. 08, 2020, 09:07 pm IST
ఆస్పత్రికి అచ్చెం నాయుడు

ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్‌ అయి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న అచ్చెం నాయుడును హైకోర్టు ఆదేశాల మేరకు ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే కాపీని అచ్చెం నాయుడు తరఫు న్యాయవాది జైలు సూపరింటెండెంట్‌కు అందజేశారు. అనంతరం అచ్చెం నాయుడును గుంటూరులోని రమేష్‌ హాస్పటల్‌కు తరలించారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, ప్రైవేటు ఆస్పతికి తరలించాలని అచ్చెం నాయుడు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌తో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి.

కాగా, తనకు బెయిల్‌ మంజూరు చేయాలని అచ్చెం నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తనపై కక్షపూరితంగా కేసు పెట్టారని, ఏసీబీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో బెయిల్‌ మంజూరు చేయాలని అచ్చెం నాయుడు పిటిషన్‌ దాఖలు చేశారు. అచ్చెం నాయుడుకు ఏసీబీ కోర్టు పొడిగించిన రిమాండ్‌ ఈ నెల 10వ తేదీ వరకూ ఉంది. ఇప్పటికే ఏసీబీ కోర్టు అచ్చెం నాయుడు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది.

150 కోట్ల రూపాయల ఈఎస్‌ఐ స్కాంలో గత నెల 13వ తేదీన అచ్చెం నాయుడును ఆయన స్వగ్రామంలో ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఫైల్స్‌కు ఆపరేషన్‌ జరిగిన కారణంగా ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు అచ్చెం నాయుడును ఈ నెల 1వ తేదీ వరకూ గుంటూరు సర్వజన ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించారు. కోలుకోవడంతో డిశ్ఛార్జి చేశారు. అయితే 2వ తేదీనే తనకు ఆరోగ్యం బాగోలేదని, ప్రైవేటు ఆస్పత్రికి తరలించారని, ఖర్చు తానే భరిస్తానని అచ్చెం నాయుడు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌తో ఆయనకు ఊరట లభించింది. బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు ఏమి తీర్పు ఇస్తుందో వచ్చే వారం తేలనుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp