యూ కాంట్ ఎస్కేప్ - ఏసీబీ

By Kiran.G Jan. 20, 2020, 05:34 pm IST
యూ కాంట్ ఎస్కేప్ - ఏసీబీ

మనిషి పుట్టినట్లు ధ్రువీకరణ పత్రం కావాలంటే లంచం.. మనిషి చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం కావాలంటే లంచం.. మనిషి పుట్టుక చావు మధ్యలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే అన్నట్లు తయారయింది పరిస్థితి. కొందరు అధికారులు లంచాల కోసం ప్రజల ఆదాయాన్ని జలగల్లా పీలుస్తున్నారు..

కాగా జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలను తీసుకునే వారిపై ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా ఇంతకుముందు ఏసీబీ డీజీగా పని చేసిన కుమార్ విశ్వజిత్ స్థానంలో పీఎస్సార్ ఆంజనేయులును ఏసీబీ డీజీగా నియమించారు. కొత్త డీజీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ లో రెండు వేర్వేరు సంఘటనల్లో లంచం తీసుకుంటున్న అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే పలాస గవర్నమెంట్ హాస్పిటల్‌లో జనన ధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి రూ.5వేలు లంచం తీసుకుంటూ డాక్టర్ యు స్వరాజ్యలక్ష్మి పట్టుబడ్డారు.ఆమెతో పాటుగా మెడికల్ ఆఫీసర్ శ్రీకృష్ణరావు, ల్యాబ్ అసిస్టెంట్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. జనన ధ్రువీకరణ పత్రం కోసం లంచం అడిగినట్లు బాధితుడు పిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి వారిని పట్టుకున్నారు.

మచిలీపట్నం కలెక్టరేట్ లో ల్యాండ్ రికార్డ్స్ సెక్షన్‌లో ఏవోగా పనిచేస్తున్న ప్రశాంతి మూడు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఏవో ప్రశాంతి పట్టుబడింది. 3 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ప్రశాంతి పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు.

ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో పట్టుబడిన అధికారులు ఇద్దరూ మహిళలే కావడం విశేషం. కాగా గతంలో మండల స్థాయిలో చిన్న చిన్న అధికారులపై మాత్రమే ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు జిల్లాస్థాయి పై అధికారులపై కూడా దాడులు నిర్వహిస్తున్నారు. దానికి ఉదాహరణగా మచిలీపట్టణం కలెక్టరేట్ పై జరిగిన ఆకస్మిక దాడిని చెప్పుకోవచ్చు. ఈ దాడిలో ల్యాండ్ రికార్డ్స్ సెక్షన్‌లో ఏవోగా పని చేస్తున్న ప్రశాంతి పట్టుబడింది. ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్న ఆకస్మిక దాడుల వల్ల అవినీతి అధికారులు లంచాలు తీసుకోవడానికి భయపడుతున్నారు. ఇది జగన్ సర్కారు సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp