బానిస బ్రతుకులకు స్వేచ్ఛను ప్రసాదించిన అబ్రహం లింకన్

By Kiran.G Feb. 12, 2020, 12:49 pm IST
బానిస బ్రతుకులకు స్వేచ్ఛను ప్రసాదించిన అబ్రహం లింకన్

"Those who deny freedom to others deserve it not for themselves"(ఇతరులకు స్వేచ్ఛను ఇవ్వడానికి నిరాకరించేవారికి దానిని పొందే అర్హత లేదు) - అబ్రహం లింకన్

అబ్రహం లింకన్... పరిచయం అక్కరలేని పేరు.. కడు పేదరికంలో పుట్టి,చిన్న వయసులోనే తల్లిని కోల్పోయి, 8 సార్లు రాజకీయ జీవితంలో వరుసగా ఓడిపోయి, అరుదైన వ్యాధితో బాధపడి కొన్ని నెలలు మంచానికి మాత్రమే పరిమతమైన ఒక ఫెయిల్యూర్ పర్సన్ ఒక్కసారి మాత్రం విజయం సాధించాడు.. ఆ గెలుపుతో అమెరికా దేశ ముఖ చిత్రం మారిపోయింది. స్వేచ్ఛ, సమానత్వం అనేది అమెరికాలో ఇప్పుడు చూడగలుగుతున్నాం అంటే దానికి కారణం అమెరికా దేశానికి 16 వ అధ్యక్షుడిగా పని చేసిన అబ్రహం లింకన్ ... ఈరోజు ఆయన జన్మదినం..

అబ్రహం లింకన్ జీవితం ఎందరికో స్ఫూర్తి.. ఎవరైనా ఏదైనా పనిలో ఓటమి చెందితే అబ్రహం లింకన్ జీవితాన్నే ఉదాహరణగా చూపుతారు .. ఆయన ఓటములతో పోలిస్తే నీది కూడా ఒక ఓటమేనా అని అబ్రహం లింకన్ జీవితాన్ని ఉదాహరణగా చెప్పి ఓటమి బాధతో కృంగిపోయిన ఎందరికో జీవితంపై తిరిగి ఆశల్ని రేకెత్తించేలా చేస్తారు మోటివేటర్స్..
అమెరికా దేశంలో స్వేచ్ఛ,సమానత్వం గురించి నినదించిన తొలి వ్యక్తి అబ్రహం లింకన్.. 1809 ఫిబ్రవరి 12 వ తేదీన థామస్ లింకన్, నాన్సీ హాంక్స్ లింకన్ దంపతులకు జన్మించాడు.. లింకన్ తొమ్మిదేళ్ల వయసులోనే తల్లి మరణించింది.. దాంతో తండ్రి మరో వివాహం చేసుకున్నాడు.. తండ్రికి మానసికంగా దూరంగా ఉన్న లింకన్ సవతి తల్లిని మాత్రం అమ్మగా అంగీకరించాడు.. ఆవిడ కూడా లింకన్ ను ప్రేమగా చూసుకొనేది.. తమ్ముడు, అక్క కూడా లింకన్ 19 ఏళ్ల లోపే చనిపోయారు.

10 సంవత్సరాల చిన్న వయసులోనే అమెరికా అధ్యక్షుడు కావాలని కల కన్నాడు.. లా చదివాడు.. చిన్ననాటి కలను నిజం చేసుకోవడానికి రాజకీయాల్లోకి వెళ్ళాడు.. వరుస ఓటములు ఎదురయ్యాయి. అయినా తట్టుకున్నాడు..రాజకీయాల్లో వరుసగా 8 ఓటముల తర్వాత మొత్తానికి విజయం సాధించాడు.. ఆ ఒక్క గెలుపు అమెరికా చరిత్రను మార్చేసే మహత్తర విజయం అని చాలామందికి అప్పుడు తెలియదు.

బానిసత్వం...సాటి మనుషులను మనిషిగా చూడకుండా బానిసలుగా చూసే విధానం అప్పటికి అమెరికాలో ఉండేది.. నల్ల జాతీయులను బానిసలుగా చేసుకుని వారిని కనీసం మనుషులుగా కూడా గుర్తించేవారు కాదు.. అలాంటి బానిసత్వాన్ని రద్దు చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చాడు లింకన్.. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగానే బానిసత్వాన్ని రద్దు చేస్తూ 13 వ రాజ్యాంగ సవరణ చేసి ఉత్తర్వులు జారీ చేసాడు. స్వేచ్ఛ సమానత్వం ప్రతీ ఒక్కరికీ దక్కాలని, సాటి మనిషిని బానిసగా చూసే విధానం పోవాలని నినదించాడు.. దీంతో అమెరికాలో అంతర్యుద్ధం మొదలైంది..

బానిసత్వం చట్ట బద్దంగా ఉన్న 11 రాష్ట్రాలు అమెరికా నుండి విడిపోతున్నట్లు ప్రకటించాయి. ఆ 11 రాష్ట్రాలు కలిసి కాన్ఫిడరేట్ స్టేట్స్ గా విడిపోయి రాబర్ట్ లీ అధ్యక్షతన బానిసత్వ నిర్మూలన చట్టానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాయి.. బానిసత్వం కొనసాగించాలని 11 రాష్ట్రాలు పోరాటం చేసాయి. 1861-65 వరకూ అమెరికాలో సివిల్ వార్ కొనసాగింది.. ఈ అంతర్యుద్ధాన్ని అబ్రహం లింకన్ ఉక్కుపాదంతో అణచి వేసాడు.. ఏప్రిల్ 10, 1865 న రాబర్ట్ లీ లొంగిపోవడంతో అంతర్యుద్ధం ముగిసింది.. దీంతో బానిసత్వ రద్దు చట్టం అమల్లోకి వచ్చింది.. బానిసలుగా మగ్గిపోతున్న ఎందరో నల్ల జాతీయులకు స్వేచ్చా వాయువులు ప్రసాదించాడు అబ్రహం లింకన్..

కానీ ఈ బానిసత్వ నిర్మూలనను వ్యతిరేకిస్తున్న కొందరు సానుభూతిపరులు అబ్రహం లింకన్ కిడ్నాప్ కు పథకం వేశారు.. కానీ లింకన్ ఈసారి నల్ల జాతీయులకు ఓటు హక్కును కల్పిస్తామని చెప్పడంతో కిడ్నాప్ పథకం కాస్తా హత్యా పథకంగా మారిపోయింది.. దీనికి అప్పటి ప్రఖ్యాత రంగస్థల నటుడు జాన్ విల్క్స్ బూత్ చేతులు కలపడంతో హత్య పథకం అమలు సులువుగానే జరిగిపోయింది..


ఏప్రిల్ 14, 1865 రాత్రి 10.15 నిమిషాలకు, నాటకం చూస్తున్న అబ్రహం లింకన్ ను, జాన్ విల్క్స్ బూత్ అతి సమీపం నుండి తలపై కాల్చడంతో అబ్రహం లింకన్ కోమాలోకి వెళ్లారు.. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా అబ్రహం లింకన్ ను కాపాడలేక పోయారు.. ఏప్రిల్ 15,1865 న ఉదయం 7.22 నిమిషాలకు లింకన్ మరణించినట్లు, డాక్టర్లు ప్రకటించారు.. ఆ విధంగా ఒక గొప్ప నాయకుడిని అమెరికా కోల్పోయింది.

కానీ లింకన్ మరణం గురించి అనేక అనుమానాలు ఉన్నాయి.. లింకన్ హత్య వెనుక ఆర్ధిక కారణాలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తుంటారు.. లింకన్ కాన్స్పిరసీ అనే పుస్తకం లింకన్ మరణంపై అనేక అనుమానాలను రేకెత్తించింది..లింకన్ ని చంపిన జాన్ విల్క్స్ బూత్ ని రహస్యంగా దేశం దాటించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయ్.

ఈనాడు నల్ల జాతీయులు అమెరికాగడ్డపై స్వేచ్చా వాయువులు పీలుస్తున్నారంటే ఆనాడు అబ్రహం లింకన్ చేసిన కృషి దానికి కారణం.. చిన్నవయసులో నీతిని తప్పనని తల్లికిచ్చిన మాటపై నిలబడి లాయర్ గా పని చేస్తున్నప్పుడు తన క్లయింట్ దే తప్పు ఉన్నట్లు తనకి తెలిసిన వెంటనే కేసును వాదించకుండా దోషులకు శిక్ష పడేలా చేసేవాడు లింకన్.. వరుస ఓటముల నుండి గెలుపు ఎలా నిచ్చెన వేసుకోవాలోచూపించిన లింకన్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమే..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp