ABN RK - పచ్చ అజెండాతో విచ్చలవిడిగా అభాండాలు

By Aditya Dec. 05, 2021, 09:47 am IST
ABN RK - పచ్చ అజెండాతో విచ్చలవిడిగా అభాండాలు

తెలుగుదేశం పార్టీ అజెండాకు అనుగుణంగా మీడియా హౌస్ ను నడుపుతున్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఎప్పటిలా ఈ వారం కూడా ఏపీ ప్రభుత్వంపై విచ్చలవిడిగా అభాండాలు వేశారు. కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగా ఆయన కొత్త పలుకు సాగింది. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై తన అక్కసును వెళ్ల గక్కడమే కాక రాష్ట్రంలోని మేధావులను, తటస్తులను ఆడిపోసుకున్నారు.

పోవాలి జగన్ అనుకుంటున్నారట!

రావాలి జగన్..కావాలి జగన్ అని రెండున్నరేళ్ల క్రితం అనుకున్న జనం ఇప్పుడు పోవాలి జగన్ అని అనుకుంటున్నారని అడ్డగోలుగా రాసేశారు. ఈ రెండున్నరేళ్లు జగన్మోహనరెడ్డి పాలనను చూసి నెత్తి, నోరు బాదుకొనే పరిస్థితి నెలకొందని ఒక పచ్చి అవాస్తవాన్ని అలవోకగా అల్లేశారు. చేలో పడిన గుడ్డెద్దు పంటను నాశనం చేసిన చందంగా పచ్చ పైత్యాన్ని తలకు ఎక్కించుకున్న రాధాకృష్ణ పూర్తిగా విచక్షణ కోల్పోయి ఏపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఒక ప్రజా ప్రభుత్వంపై జర్నలిజం ముసుగులో ఇలా వారం వారం దుర్మార్గంగా దాడి చేసి వికృత ఆనందం పొందడం ఒక్క రాధాకృష్ణకే చెల్లింది. తను రాసే రాతలు జనం నమ్మరని తెలిసినా కనీసం తెలుగుదేశం క్యాడర్ ను అయినా సంతృప్తి పరుద్దామన్న ఉద్దేశంతో ఆయన కొత్త పలుకును కొనసాగిస్తున్నారా అన్న సందేహం కలుగుతోంది.

జగన్ పై వ్యక్తిగత దాడి..

అయిదు అడుగుల అయిదు అంగుళాల పొడవు వుండే మనిషి జగన్మోహనరెడ్డి. తల్లిని, చెల్లిని దూరం చేసుకున్న వ్యక్తి రాష్ట్రానికి మేలు చేస్తాడా? అవినీతిని రాష్ట్రంలో వ్యవస్థీకృతం చేశారు. జగన్లో ఉన్న అంతర్ముఖుడిని ఎన్నికల ముందు జనం గమనించలేక పోయారు. వంటి వ్యాఖ్యలతో జగన్మోహనరెడ్డిపై రాధాకృష్ణ వ్యక్తిగత దాడి చేశారు. తన రాతలతో ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా కవ్విస్తున్నా పట్టించుకోవడం లేదు కనుక ఇలా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తే తనకు, తన మీడియాకు ప్రచారం దక్కుతుంది అని ఆయన భావిస్తున్నారేమో? లేకుంటే ప్రభుత్వ పనితీరును విమర్శించడానికి ముఖ్యమంత్రి ఒడ్డు పొడవు, ఆయన తల్లి, చెల్లి ప్రస్తావన ఎందుకు?

రాష్ట్రంలో అవినీతి వ్యవస్థీకృతం అయిపోయింది అంటున్న రాధాకృష్ణ అందుకు ఒక్క ఉదాహరణ అయినా ఎందుకు చూపడం లేదు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోజూ బ్యానర్ కథనం వండి వార్చే వేమూరి వారు అవినీతి వ్యవస్థీకృతం అయిపోతే ఇన్నాళ్లూ ఎందుకు ఆధారాలతో సహా రాయలేదు? కనీసం తన దమ్మున్న ఛానల్లో  అయినా ప్రసారం చేయవచ్చు కదా? అవినీతి వ్యవస్థీకృతం కావడం అంటే జన్మభూమి కమిటీల పేరిట జనానికి అందవలసిన ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక టీడీపీ క్యాడర్ చేతుల్లో పెట్టడం. వారు ఊరూవాడా దోచేసుకుంటున్నా పట్టించుకోవద్దని స్వయంగా ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించడం. మనిషి పుట్టుక నుంచి చావు వరకు అన్ని దశల్లోనూ ప్రజలను దోచుకోవడం. అయిదేళ్ళూ జరిగిన ఆ దోపిడీని వ్యవస్థీకృత అవినీతి అంటారని రాధాకృష్ణకు తెలియదా? ఇప్పుడు ప్రభుత్వం పారదర్శకంగా పథకాల సొమ్మును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంటే అవినీతి వ్యవస్థీకృతం అని రాసేస్తే ఎవరు నమ్ముతారు?

చంద్రబాబు విజనరీ అట ..

నీటిపారుదల అంటే వైఎస్ రాజశేఖరరెడ్డి, అభివృద్ధి, విజన్ అంటే చంద్రబాబు గుర్తుకొస్తారని, జగన్ మాత్రం రాష్ట్రంను సర్వ నాశనం చేసిన వ్యక్తి గా మిగిలిపోతారని సూత్రీకరించారు. రాజశేఖరరెడ్డి నీటిపారుదల రంగంలో గుర్తుండిపోయే సేవ చేశారని ఇనాళ్లకు ఒప్పుకున్న రాధాకృష్ణ.. వైఎస్సార్ బతికి ఉన్నంత కాలం జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అంటూ నానా యాగీ చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబును ఒక్కడిని పొగిడితే బాగుండదని వైఎస్సార్ పాలనను మెచ్చుకున్నారు. అయితే రాజశేఖరరెడ్డి అనగానే ఒక 108, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్, రాజీవ్ గృహకల్ప వంటి పలు పథకాలు గుర్తుకు వస్తాయి. అయిదేళ్లలో ఆయన చేసిన అభివృద్ధి కళ్ల ముందు కదలాడుతుంది.

అదే చంద్రబాబునాయుడు 14 ఏళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క పథకం కూడా లేకపోవడం గమనార్హం. అయినా బాబుగారు విజనరీ అంటూ ఇప్పటికీ రాధాకృష్ణ పులకరించిపోవడమే విచిత్రం. బాబు విజనరీ కాదు ఆర్డినరీ అని జనం ఎప్పుడో గమనించారు. ఆయన విజన్ అంతా సొంత ప్రయోజనాల పరిరక్షణ కోసమేనని అర్థం చేసుకున్నారు. అందుకే చిత్తుగా ఓడించారు. జగన్మోహనరెడ్డి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఆనందం ఆవిరి అయిందని రాసేసిన రాధాకృష్ణ.. ప్రతి ఎన్నికకు అధికార పార్టీ ఓటింగ్ శాతాన్ని ఎందుకు పెంచుకుంటోందో వివరించి ఉంటే బాగుండేది.

అప్పులపై తప్పుడు వాదన..

1953 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పు 3 లక్షల కోట్లు కాగా ఈ రెండున్నర ఏళ్లలోనే జగన్ మూడు లక్షల కోట్ల అప్పు చేశారని రాశారు. మరి 2014లో చంద్రబాబు అధికారం చేపట్టేసరికి విభజిత ఆంధ్రప్రదేశ్ అప్పు 93 వేల కోట్లు ఉంటే ఆయన పాలన ముగిసే సరికి అంటే 2019లో మూడు లక్షల కోట్లు అయింది. ఈ విషయం ప్రస్తావించకుండా జగన్ పైనే నింద వేయడం పచ్చపాతం కాదా? పైగా జగన్ చేసిన అప్పుల్లో సింహభాగం ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయగా బాబు హయాంలో చేసిన అప్పులు ప్రచార ఆర్భాటాలకే వినియోగించారు. జగన్ వ్యవస్థలను చెరబడుతున్నారని అభాండం వేశారు. ఆ విషయంలో చంద్రబాబుకు పేటెంట్ ఉన్న సంగతి వేమూరి వారు మరచిపోయినట్టున్నారు.

వ్యవస్థలను చెరబట్టడం, వెన్నుపోట్లు పొడవడం, కుట్రలు చేయడంలో బాబు నైపుణ్యం లోక విదితం కదా! అప్పుల వల్ల రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీయడం వల్ల దేశవ్యాప్తంగా పరువుపోతోంది ఇది అవమానం కాదా? అని ప్రశ్నించిన రాధాకృష్ణకు.. కేంద్రమే 80 లక్షల కోట్లు అప్పు చేసిన విషయం, చాలా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువగా అప్పులు చేసిన సంగతి తెలియదా? ఏ ప్రభుత్వం అప్పు చేసినా ప్రజల అవసరాలు తీర్చడానికి, అభివృద్ధి కోసమే. అటువంటప్పుడు పరువు పోవడం, అవమాన పడడం వంటిది ఎందుకుంటుంది?

మేధావులపై నిందలు..

ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లాం, జస్టిస్ లక్ష్మణరెడ్డి వంటి మేధావులు జగన్ అధికారంలోకి రావడానికి కృషి చేశారని, ఇప్పుడు వారు పదవుల్లో సేద తీరుతున్నారని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసక పాలనకు వారే బాధ్యత వహించాలని చాలా గంభీరంగా రాశారు. అయితే ఎవరు బాధ్యత వహించడానికి అయినా ఆంధ్రప్రదేశ్ లో రాధాకృష్ణ ఊహించిన పరిస్థితి ఉంటే కదా? సంక్షేమ పథకాలతో సామాన్యుల జీవన ప్రమాణాలు పెరగటం, రాష్ట్ర ప్రభుత్వ పాలనకు ఇంటా బయటా ప్రశంసలు రావడం నడుస్తున్న చరిత్ర. దీన్ని పచ్చరాతలతో చెరిపేద్దాం అనుకోవడం వేమూరి వారి అవివేకం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp